To register voters
-
ఒక్కరోజులో లక్ష!
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రహసనంగా ముగిసింది. గంపగుత్తగా ఓటర్ల నమోదు పెద్దఎత్తున జరిగింది. దాదాపు అన్ని డివిజన్లలోనూ ఇదే రీతిలో ఓటర్ల నమోదు జరిగినట్టుగా తెలుస్తోంది. శనివారం విశాఖ ఆర్డీవో కార్యాలయంలో ఇదే రీతిలో ఓటర్ల నమోదుకు నారాయణ విద్యాసంస్థలతో కలిపి ఆళ్వార్‌దాస్ విద్యా సంస్థల యాజమాన్యం విఫలయత్నం చేయగా సీపీఎం నేతలు అడ్డుకుని వాటిని తగలబెట్టారు. అరుునప్పటికీ చివరిరోజు ఏకంగా సుమారు లక్ష ఓట్ల నమోదుకు దరఖాస్తులందినట్టుగా అధికారులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరో రెండు నెలల్లో ఖాళీ కానున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు చేపట్టిన కసరత్తులో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గత నెల 1న ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టారు. తొలి ఎనికల్లో 1,61,374మంది ఓటుహక్కు నమోదు చేసుకోగా, గడిచిన పదేళ్లలో పెరిగిన పట్టభద్రుల సంఖ్యను బట్టి 2.50 లక్షలకు పైగా ఓట్లు నమోదవుతాయని అంచనా వేశారు. ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సిబ్బందిలో ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఉంటే వారి తరపున ఎవరో ఒకరు సమర్పించే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు గంపగుత్తగా ఓటర్ల నమోదుకు తెగపడ్డారుు. ఆళ్వార్‌దాస్ కళాశాల సెక్రటరీ రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆళ్వార్దాస్తోపాటు మున్సిపల్ శాఖా మంత్రికి చెందిన ‘నారాయణ’ విద్యాసంస్థలు కూడా ఉత్తరాంధ్ర పరిధిలో పెద్ద ఎత్తున ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులను ఎన్నికల ఏజెంట్లుగా ఇంటింటికీ పంపి పట్టభద్రుల నుంచి పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు పత్రాలను సేకరించారు. వీటిని చివరి రోజైన శనివారం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఆ విద్యాసంస్థలో 7 వేలమంది సిబ్బంది ఉన్నారట.. విశాఖ ఆర్డీవో కార్యాలయంలో కూడా ఇదే రీతిలో ఆళ్వార్‌దాస్ విద్యాసంస్థలు తమ లెటర్ హెడ్‌పై ‘మా సంస్థలకు చెందిన 7 వేల మంది సిబ్బంది ఓట్లను సమర్పిస్తున్నాం.. అంగీకరించాల్సింది’గా కోరారు. ఇంతలో వచ్చిన ఆర్డీవో వెంకటేశ్వర్లు దరఖాస్తులను పరిశీలించి తొలుత ఇన్ని వేల దరఖాస్తులను తీసుకోలేమని చెప్పారు. మంత్రి ద్వారా ఒత్తిడి తీసుకురాగా, ఇంతలో అక్కడకు చేరుకున్న సీపీఎం నేతలు బల్క్ ఓటర్ల నమోదును అడ్డుకుని అధికారులను నిలదీశారు. కనీసం అభ్యర్థి, గెజిటెడ్ అధికారి సంతకాలు లేకపోగా, ఒక లెటర్ హెడ్‌పై ఇన్ని వేల దరఖాస్తులు ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించారు. అడ్డగోలుగా ఓటర్ల నమోదుకు సీపీఎం నేతలు బ్రేకులేయడంతో ఆళ్వార్‌దాస్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోక్‌నాధం, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వివి శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో పక్క గడువు ముగిసేనాటికి నమోదైన ఓటర్ల వివరాలను సోమవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ బాబూరావునాయుడు ప్రకటించారు. 4వ తేదీ వరకు 48 వేలే నమోదు... ఓటర్ల నమోదుకు అక్టోబర్ 1న శ్రీకారం చుడితే తొలి పదిరోజులు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఆ తర్వాత 17వ తేదీ నాటికి 2,054 దరఖాస్తులొచ్చారుు. ఇక అక్టోబర్ 30 నాటికి ఆ సంఖ్య 31,011కు చేరింది. నవంబర్ 3వ తేదీ నాటికి 47 వేలకు చేరారుు. 4వ తేదీకి ఆ సంఖ్య 48,835కు చేరింది. ఓటర్ల నమోదుకు చివరి రోజైన ఐదవ తేదీ నాటికి ఆ సంఖ్య ఊహలకు అందని రీతిలో ఏకంగా 1.47,956కు చేరింది. అంటే చివరి రోజైన శనివారం ఒక్కరోజు ఏకంగా సుమారు లక్ష ఓట్లు నమోదైనట్టు అధికారులు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ఓటర్ల నమోదులో అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్ల మేరకు కార్పొరేట్ సంస్థలకు అధికారులు దాసోహమైనట్టుగా ఆరోపణలు బలంగా విన్పిస్తున్నారుు. లేకుంటే చివరిరోజు ఏకంగా లక్ష ఓట్ల నమోదు ఏ విధంగా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. అందిన దరఖాస్తుల్లో విశాఖ జిల్లా పరిధిలో 89,676, శ్రీకాకుళం జిల్లాలో 28,329, విజయనగరం జిల్లా పరిధిలో 29,951 ఉన్నారుు. డివిజన్ల వారీగా నమోదైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నారుు. -
టీడీపీ ఓటర్లా.. ఐతే ఓకే
ఓటర్ల నమోదులో ‘అధికార’ పెత్తనం దొడ్డిదారిన అధికారులకు ఆదేశం టీడీపీ సానుభూతిపరులకు ప్రాధాన్యం నమోదులో వెనుకబడిన జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధికారం ప్రయోగిస్తూ అక్రమాలకు తెరలేపుతోంది. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో తమ పార్టీ సానుభూతి పరులనే ఓటర్లుగా నమోదు చే సుకోవాలని అధికారులకు అనధికార ఆదేశాలచ్చినట్లు తెలుస్తోంది. ఈ తీరుపై వామపక్ష ఎమ్మెల్సీ అభ్యర్థులు నిరసన కూడా వ్యక్తం చేశారు. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాల తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రమణ్యం, పట్టభద్రుల ఎమ్మెల్సీగా యండవల్లి శ్రీనివాసులరెడ్డి అభ్యర్థులుగా మరోసారి ఎన్నికల బరిలో దిగే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. చిత్తూరు/చిత్తూరు (గిరింపేట): ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడంలో టీడీపీ మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందనే భావనతో పోటీకి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. టీచర్ల యూనియన్లలో గెలుపు గుర్రాలపై సర్వే చేయించుకొని వారిని పార్టీలోకి రావాలని..ఒక వేళ రాలేకపోతే సంఘాల్లోనే ఉంటూ పార్టీ అభ్యర్థులకు సహకరించాలని టీడీపీ అధిష్ఠానం కోరుతోందని తెలిసింది. కొన్ని రోజుల క్రితం జిల్లాలోని ఎస్టీయూ సంఘ నేతకు టీడీపీ జిల్లా నాయకులు ఫోన్ చేసి తమ మద్దతుదారుడిగా పోటీ చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. దీనికి సమ్మతిస్తే విజయవాడ, హైదరాబాద్‌కు వచ్చి ముఖ్యనేతను కలవొచ్చని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఓటర్ల నమోదులో ఏకపక్షం.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లను నమోదు చేసుకోవడంలో అధికారులు.. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఓటు నమోదుకు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే పట్టభద్రులు, ఉద్యోగులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నమోదులో లేనిపోని ఆంక్షలు విధిస్తున్నారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు నమోదుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నమోదు విషయంలో మిగిలిన రెండు జిల్లాల కంటే చిత్తూరు వెనబడింది. యూనివర్సిటీ, ప్రైవేటు విద్యా సంస్థల్లో అధికార టీడీపీ ఓటర్ల నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకే చోట ఎక్కువ మందిని ఓటర్లను నమోదుచేసుకోకూడదనే నిబంధన ఉన్నా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. తెలిసినా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీలో ఓటమి గుబులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని అంతర్గత సర్వేల్లో తేలడంతో అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఓటు వేసేలా దొడ్డిదారులో ్లప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించకుండా ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ నాయకులకున్న విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులందరి ఓట్లనూ కొల్లగొట్టేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు సమాచారం. గెలుపుగుర్రాలెవరు... మూడు జిల్లాలో గెలుపు గుర్రాలు ఎవరు అని టీడీపీ అధిష్ఠానం ఆరా తీస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉండేవారికి టిక్కెట్లు ఇచ్చే విషయంలో కొందరిపేర్లు తెరపైకి తీసుకొస్తోంది. ఇప్పటికే చదలవాడ సుచరిత, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, దేశాయి శెట్టి హనుమంత రావు, వాసుదేవనాయుడు పేర్లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీదారులుగా తెరపైకి తెస్తోంది. వీరిలో ఒకరికి టీడీపీ బీఫాం ఇస్తుందని సమాచారం. ప్రత్యేక రాయలసీమ వాదుల పోటీ..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతున్న నాయకులు కూడా పోటీచేస్తారనే ఉహాగానాలు ఊపందుకున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కొన్నాళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో దిగి రాయలసీమ రాష్ట్రం కోసం రాజకీయంగా పోరాడాలని నాయకులు భావిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా భూమన సుబ్రమణ్యం రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాచిరెడ్డి పురుషోత్తం రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.


