breaking news
Rayala seema districts
-
రూ.11,606 కోట్లతో వైఎస్సార్ స్టీల్ పరిశ్రమ
సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన ఉక్కు పరిశ్రమను సాకారం చేసే పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలో సర్కార్ సొంతంగా వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ పేరిట నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారంలో భాగస్వామ్య కంపెనీగా ఎస్సార్ స్టీల్ ఎంపికైంది. సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,148.68 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఎస్సార్ స్టీల్ చేసిన ప్రతిపాదనకు తాజాగా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్లో భాగస్వామి ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలవగా సాంకేతిక అంశాలు పరిశీలించాక లిబర్టీ స్టీల్‌ను ఎస్బీఐ క్యాప్ ఎంపిక చేసింది. అయితే లిబర్టీ స్టీల్‌కు ఆర్థిక వనరులను సమకూర్చే మాతృ సంస్థ జీఎఫ్జీ అలయన్స్ బ్రిటన్‌లో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందనే వార్తలు రావడంతో రెండో స్థానంలో ఉన్న ఎస్సార్ స్టీల్‌ను ఎంచుకుంది. ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వానికి 85 శాతం వాటా ఏడాదికి మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో వివిధ ఉక్కు ఉత్పత్తుల తయారీకి ఎస్సార్ స్టీల్ ముందుకొచ్చింది. ఇందుకు మొత్తం రూ.11,606 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ భాగస్వామ్య కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వం 85 శాతం, ఎస్సార్ స్టీల్ 15 శాతం వాటాలు కలిగి ఉంటాయి. ఈ భాగస్వామ్య కంపెనీ ఏర్పాటుకు మొత్తం రూ.4,062 కోట్ల ప్రారంభ మూలధనం అవసరమవుతుందని అంచనా వేయగా.. ఇందులో ఎస్సార్ స్టీల్ రూ.609 కోట్ల సమకూరుస్తుంది. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,000 కోట్లపైన పెట్టుబడి పెట్టనుంది. 2024 మార్చి నాటికి ఉత్పత్తి ప్రారంభం.. తొలి దశలో ఏడాదికి కనీసం పది లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మార్చి 31, 2024కి ఉత్పత్తిని ప్రారంభించాలి. తొలిదశలో 3,150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ఎస్సార్ స్టీల్ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ఏర్పాటయ్యే అనేక యూనిట్లు, ఇతర కార్యకలాపాల ద్వారా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. దీనికి ఒప్పందం కుదిరి ఎస్సార్ స్టీల్ పనులు ప్రారంభించేలోగా రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో ఇతర మౌలిక వసతులు కల్పించనుంది. ఉత్పత్తిని ప్రారంభించే నాటికి భాగస్వామ్య కంపెనీలో మెజార్టీ వాటా అంటే 51 శాతం వాటాను ఎస్సార్ స్టీల్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉత్పత్తి ప్రారంభమైన ఏడేళ్లలోపు రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి వాటాను విక్రయించే విధంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఉత్పత్తి మొదలయ్యాక ఏడేళ్లపాటు రాష్ట్ర పెట్టుబడులకు 8.7 శాతం చొప్పున రాబడి రావచ్చని ఎస్బీఐ క్యాప్ అంతర్గత అంచనా వేసింది. -
విప్లవ వీరుడు.. రేనాటి సూర్యుడు
ఉయ్యాలవాడ, న్యూస్‌లైన్ : ‘సైరా నారసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ’ అనే జానపద గేయం రాయలసీమ ప్రజల నాలుకపై నానుతూ ఆయన తెగువ, త్యాగానికి నిదర్శనంగా మారుమోగుతోంది. భారత దేశంలో తెల్లదొరల నిరంకుశత్వ పాలనపై మొదటి సారిగా తిరుగుబాటు బావుట ఎగరవేసి వారి గుండెల్లో సింహస్వప్నమయ్యాడు రేనాటి గడ్డ సూర్యుడు, విప్లవ వీరుడు మన ఉయ్యాలవాడ నారసింహారెడ్డి. నేడు ఆయన 167 వర్ధంతి సందర్భంగా ‘న్యూస్‌లైన్’ కథనం. ఉయ్యాలవాడ మండల కేంద్రానికి చెందిన సీతమ్మ, పెద్దమల్లారె డ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్త మండలాలుగా ప్రకటించి బ్రిటీష్వారికి దారాదత్తం చేశారు. పాలనలో నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన కొనసాగేది. నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. బ్రిటీష్ నిరంకుశ పాలనపై ఆగ్రహించిన ఈయన మొదటిసారిగా 1842లో వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేశాడు. కోవెలకుంట్ల తహశీల్దార్‌ను నరికిచంపడమేకాకుండా ఖజానా కొల్లగొట్టడంతో బ్రిటీష్‌వారు వణికిపోయారు. అప్పటి నుంచి అనేక ప్రయత్నాలు చేసిన బ్రిటీష్ వారు ఎట్టకేలకు 1847లో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకున్నారు. బందిపోటుగా ముద్రవేసి 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు చేశారు. నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుస్తున్నారు. ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో నరసింహారెడ్డి పేరుపై సైరా నారసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ అన్న జానపద గేయాలు వినిపిస్తుండటం ఆయన వీరత్వానికి ప్రతీక. ఆయన త్యాగానికి గుర్తింపేది నంద్యాల, న్యూస్‌లైన్: తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి బ్రిటీష్ వారి చేతిలో వీరమరణం పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని సర్కారు గుర్తించకపోవడంపై నల్లమల, కుందూ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ నేతల ఒత్తిడి మేరకు ప్రాధాన్యం లేని వ్యక్తుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ ప్రాంతం కోసం బ్రిటీష్‌వారిపై తిరుగుబాటు చేసి ప్రాణాలొడ్డిన విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆమాత్రం గుర్తింపు ఇవ్వకపోవడం గమనార్హం. ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ మాజీ సభ్యుడు ఉయ్యాలవాడ మండల కేంద్రానికి చెందిన పోచాబ్రహ్మానందరెడ్డి మాత్రం ఏటా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన త్యాగాలను స్మరించుకుంటుండడం విశేషం. నరసింహారెడ్డితో పాటు దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డికి సంబంధించి పలు పనులు చేపట్టాలని ప్రతిపాదనలు పంపిన అధికార పార్టీకి చెందిన నాయకులు పట్టించుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో ప్రభుత్వానికి పంపిన తీర్మానాలు... ఈ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలు, రిజర్వాయర్లు, చెరువులు, విద్యాసంస్థలు, రైళ్లు, బస్టాండ్లు ఇతర వాటికి వారిద్దరి పేర్లు పెట్టాలి వీరి పేరుతో తపాలా బిల్లలు విడుదల చేయాలి. నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తిని పాఠ్యాంశాల్లో చేర్చాలి వీరిద్దరి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించారు. పార్లమెంటులో సైతం నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి. నంద్యాల, కర్నూలు, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాల్లో వీరిద్దరి విగ్రహాలు ఏర్పాటు చేయాలి. సినిమాలు, డాక్యుమెంటరీ చిత్రాలు తీసి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించే ఏర్పాటు చే యాలి. వీరికి సంబంధించిన రచనలను ప్రభుత్వ ఖర్చుతో ప్రచురించి గ్రంథాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో అందుబాటులో ఉంచాలి. వీరిద్దరిపై పీహెచ్డీ చేసిన వారి గ్రంథాలను కూడా ముద్రింపజేయాలి. గుర్తింపు లభించే వరకు పోరాటం: పోచాబ్రహ్మానందరెడ్డి, రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి అధ్యక్షుడు మొదటి స్వాతంత్య్ర సమరయోధుడిగా నరసింహారెడ్డిని గుర్తించాలని ఇప్పటికే రేనాటి ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈయనతోపాటు దాన కర్ణుడిగా గుర్తింపు పొందిన బుడ్డా వెంగళరెడ్డికి కూడా ఎప్పుడో గుర్తింపు లభించి ఉండాల్సింది. రవీంద్రభారతితోపాటు విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాల్లో వీరి సాహసాలు, త్యాగాలను ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తాం. అవకాశం లభిస్తే రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలిసి వినతిపత్రాలు అందజేస్తాం.