breaking news
RAVULA chandrasekharreddy
-
'కోదండరామ్ ఫోన్ ట్యాప్ చేయడం సిగ్గుచేటు'
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం సిగ్గుచేటని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. చివరకు తెలంగాణ ఉద్యమ కారులపై కూడా నిఘా పెట్టడడంతో ప్రభుత్వ నిజరూపం బట్టబయలైందన్నారు. ఆయన మంగళవారం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారం ప్రభుత్వ దిగజారుడు తనాన్ని రుజువు చేస్తోందని వ్యాఖ్యానించారు. తమకు నచ్చని వ్యక్తులపై నిఘా పెట్టడం తెలంగాణ ప్రభుత్వానికి ఓ అలవాటుగా మారిందని ఆరోపించారు. వ్యక్తి స్వేచ్చను హరించే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ పోషించిన కీలక పాత్ర గురించి అందరికీ తెలుసనీ, అప్పటి కంటే ఇప్పుడే జేఏసీ అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం జేఏసీ పనిచేయాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి ఏమైందో అంతుబట్టడం లేదని రావల వ్యాఖ్యానించారు. -
టీడీపీ.. అందరి పార్టీ
► ఉద్యమకారులను కనుమరుగు చేసే కుట్ర ► 29న ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలి ► పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాలమూరు: టీడీపీని.. ఆంధ్రాపార్టీ అని ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పుట్టిన పేదలపార్టీ, అందరిదని ఆ పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రతిపేదవాడి గుండెల్లో ఉంటుందన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్రౌన్‌గార్డెన్‌లో జరిగిన టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ పడవ మునిగేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. మునిగేటప్పుడు చివరగా ఎక్కినవారే తిరిగి సొంతగూటికి వస్తారని ఉదాహరించారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన వ్యాపారసంస్థల హోర్డింగ్‌లు ఉండేవని ప్రస్తుతం, కేసీఆర్, కవిత, హరీష్‌రావు, కేటీఆర్ బొమ్మలు కనిపిస్తున్నాయని విమర్శించారు. వ్యాపార సంస్థలను మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్బెడ్రూం ఇళ్లు రెండుచోట్ల నిర్మించి గ్రాఫిక్స్, 3జీతో చూపి ప్రజలను భ్రమపెడుతున్నారని విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వేలో 22లక్షల మందికి ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారని, ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. ఆ పథకమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధోగతి పాలు చేస్తుందన్నారు. ఈ రెండేళ్లలో రూ.లక్ష కోట్లు అప్పులుచేశారని అన్నారు. ఉద్యమకారులను కనుమరుగుచేసే కుట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. పొలిటికల్ జేఏసీ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేసిన కోదండరాంను ఎవరనే స్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని సహాయక చర్యలు చేపట్టాలని రావుల డిమాండ్‌చేశారు. మార్చి 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో, మండలంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కరువుపై రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిలో కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎ.రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిములు మాట్లాడుతూ ప్రభుత్వం హామీలను విస్మరించిందన్నారు. అంతకుముందు పలు తీర్మానాలతో కూడిన పత్రాలను కలెక్టర్ టీకే శ్రీదేవికి అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర, జిల్లా నేతలు సీతాదయాకర్‌రెడ్డి, జయశ్రీ, బాల్‌సింగ్‌నాయక్, రాములు, సమద్‌ఖాన్, ఎన్.పి.వెంకటేష్ పాల్గొన్నారు.