breaking news
ratha sapthami
-
సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
-
రథం తరలిస్తుండగా విషాదం..ఇద్దరు మృతి
దామరగిద్ద/ నారాయణపేట: ఆలయానికి కొత్త రథం తీసుకొస్తుండగా విద్యుత్ ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నారాయణపేట జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం..దామగిద్ద మండలంలోని బాపన్‌పల్లి గ్రామానికి 4 కి.మీ. దూరంలో వెంకటేశ్వర గుట్టపై పురాతన దేవాలయం ఉంది. భక్తులు ఈ ఏడాది రథోత్సవం కోసం కొత్త ఇనుప రథాన్ని చేయించారు. శుక్రవారం రథసప్తమి కావడంతో రథాన్ని గుడి వద్దకు తీసుకువస్తుండగా విద్యుత్‌వైర్లు రథం పైభాగానికి తగిలాయి. దీంతో 18 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దిడ్డిమూతుల హన్మంతు (34), సంజనోళ్ల చంద్రప్ప(37) మృతి చెందారు. కృష్ణాపురం వెంకటప్ప అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
తిరుమలలో నేడు, రేపు బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 12వ తేదీ మంగళవారం రథసప్తమి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 11, 12వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. అదేవిధంగా, 12వ తేదీ చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. రథసప్తమి రోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అలాగే, 12వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. -
‘పాల’ భానుడు
జన్మదినం నాడు బాల భానుడు పాల భానుడిగా మారాడు. అరుణ శిలపై క్షీరధారలు అమృత ధారలుగా కురిసిన వేళ ప్రచండ మార్తాండుడు ప్రశాంత క్షీరాదిత్యుడై అగుపించాడు. పాపాలు నాశనం కావాలని, లోపాలు మాయం కావాలని కోరుతూ భక్తులు పాలు కురిపిస్తుంటే అంతటి దేవదేవుడు నవ్వుతూ స్నానించాడు. ప్రఖ్యాత అరసవల్లి సూర్యనారాయణ క్షేత్రంలో రథ సప్తమి సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి క్షీరాభిషేక సేవ ప్రారంభమైంది. స్వయానా దేవశిల్పి విశ్వకర్మ మలిచిన భానుడి వాస్తవ రూపం ఇక భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ నిజరూప దర్శనం కోసం వేలాది మంది ఇప్పటికే అరసవల్లి వీధుల్లో బారులు తీరారు. అరసవల్లి: భానుడు పాలపొంగుల్లో మునిగిపోయాడు. నల్లటి అరుణశిల శ్వేతవర్ణంలో మారిపోయేంతలా క్షీరధారల్లో అభిషేకమాడాడు. సూర్యజయంతి (రథసప్తమి) సందర్భంగా ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లిలో కొలువైన సూర్యనారాయణ స్వామి వారి జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ప్రత్యేక క్షీరాభిషేక సేవ ప్రారంభమైంది. తొలి అభిషేకాన్ని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్వహిం చారు. ఆయన స్వహస్తాలతో గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టుపై పంచామృతాలు, క్షీరధారలు కురిపించా రు. దీంతో ఆలయ ప్రాంగణమంతా ఒక్కసారిగా ఆదిత్యుని నామస్మరణతో మారుమోగింది. స్వరూపానందేంద్ర స్వామికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఉత్సవ అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ ఈఓ శ్యామలాదేవి, ఆలయ పునర్నిర్మాత వరుదు బాబ్జీ, ఆలయ వ్యవస్థాపక« ధర్మకర్త ఇప్పిలి జోగిసన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, నగేష్ శర్మ తదితరులు గౌరవ స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా గర్భాలయంలోకి వెళ్లిన స్వరూపానంద ఆదిత్యునికి ప్రత్యేక విశేష పూజలు చేశారు. క్షీరాభిషేకం చేసిన అనంతరం స్వామి విశిష్టతను భక్తులకు వివరించారు. పట్టువస్త్రాల సమర్పణ ఆలయ నియమాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆది త్యునికి పట్టువస్త్రాలను స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తీసుకునివచ్చారు. ఆమె వెంట దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి, ఆలయ ఈఓ శ్యామలాదేవి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇప్పిలి జోగిసన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం తరఫున అందజేసిన పట్టువస్త్రాలను స్వామికి విని యోగించేందుకు చర్యలు చేపట్టారు. పోటెత్తిన భక్తజనం రథసప్తమిని పురష్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అరసవల్లికి తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో, ప్రధాన రోడ్డుపైన భక్తుల కోసం ఏర్పాటు చేసి న క్యూలైన్లలో భక్తులు వచ్చి స్వామి క్షీరాభిషేకం, నిజరూపాన్ని దర్శించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12.30 నుం చి క్షీరాభిషేకం ప్రారంభమైంది. ఇది బుధవారం వేకువజామున 6 గంటలకు ముగిసిపోతుంది. అక్కడ నుంచి నిజరూపంలో స్వామి దర్శనమిస్తారు. వీవీఐపీలు, వీఐపీలు, జిల్లా ఉన్నతాధికారులు, దాతల కుటుంబాలకు ఆలయ ప్రధాన ముఖ ద్వారం (ఆర్చిగేట్) నుంచి ప్రవేశం కల్పించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు పూర్తి స్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఎల్ఈడీ స్క్రీన్స్‌లు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా ఎస్పీ నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. స్థానిక డీసీఎంఎస్ గోడౌన్ నుంచి రూ.500 దర్శన టిక్కెట్లు, అలాగే ఇక్కడ నుంచే క్షీరాభిషేక సేవ (రూ.216) టిక్కెట్లు దర్శనాల క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. అలాగే అసిరితల్లి అమ్మవారి ఆలయం పక్క నుంచి ఉచిత, సాధారణ దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దాతలకు తప్పని పాట్లు ఈ సారి రథసప్తమికి ఇబ్బందులు లేని దర్శనాలకు ప్రాధాన్యమిస్తున్నామంటూ కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, ఎస్పీ త్రివి క్రమవర్మలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించారు. దేవా దాయ అధికారుల లెక్కలను సైతం పట్టించుకోకుండా భద్రతకే ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా వీవీఐపీల వాహనాలు, పోలీసుల వాహనాలను మాత్రమే ఆర్చిగేట్ వరకు అనుమతిచ్చారు. దాతల కుటుంబసభ్యులకు అటు 80 ఫీట్ రోడ్డులోనే వాహనాలను నిలిపివేయడంతో అక్కడ నుంచి అంటే సుమారు కిలోమీటరు దూరం నుంచి నడిచి రావడంతో దాతలు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో పాటు ఆ పార్టీ నాయకురాలు వరుదు కల్యాణి, కేంద్ర మాజీ మంత్రి కృపారాణి దంపతులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సప్త వాహనాలపై తిరుమలేశుడు
తిరుమల : సూర్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించే రథసప్తమి వేడుకలతో తిరుమల పులకించిపోతోంది. ఏడుకొండలూ గోవింద నామస్మరణతో గురువారం మారుమోగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఏడు వాహానాల్లో తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. ఉదయం 5గంటలకు సూర్యప్రభ వాహనంలో .. 9గంటలకు చిన్నశేష వాహనం,11 గంటలకు గరుడ వాహనంపై ఊరేగారు. ఒంటి గంటకు హనుమంత వాహనంలో విహరించిన అనంతరం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఆ తరువాత కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం..చంద్రప్రభ వాహనసేవలతో స్వామివారు ఊరేగుతారు. శ్రీవారి వాహన సేవలను తిలకించి.. భక్తులు తరిస్తున్నారు.