breaking news
Raja Vannemreddy
-
పాటలతో ప్రశ్నిస్తా
మనీష్ బాబు హీరోగా, అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా హీరోయిన్స్‌గా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రశ్నిస్తా’. జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మించారు. వెంగి సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీలను దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ) విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రారంభం రోజున మనీష్‌ని చూసాను. మంచి హైట్, ఫిజిక్‌తో బాగున్నాడు. ఇప్పుడు టీజర్ చూసాక హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి. భవిష్యత్తులో తను పెద్ద హీరోగా ఎదగాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలు డీల్ చేయడం చాలా కష్టం. కానీ, రాజా వన్నెంరెడ్డిగారు అలాంటి చిత్రాలు తీసి హిట్స్ కొట్టారు’’ అన్నారు.‘‘చిన్న సినిమాగా స్టార్ట్ చేసిన ఈ చిత్రం కథ డిమాండ్‌ను బట్టి బడ్జెట్ ఐదు రెట్లు పెరిగి పెద్ద చిత్రంలా తయారయ్యింది. ఈ సినిమాతో మనీష్ 10కోట్ల రేంజ్ హీరో అవుతాడు’’ అన్నారు రాజా వన్నెంరెడ్డి. ‘‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా పొలిటికల్ టచ్‌తో రూపొందించిన చిత్రమిది. ట్రయిలర్ రిలీజ్ చేసిన తర్వాత మా సినిమాకి బిజినెస్ క్రేజ్ పెరిగింది’’ అని పి. సత్యారెడ్డి అన్నారు. మనీష్, అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా నిర్మాతలు కోనేరు సత్యనారాయణ, బెక్కం వేణుగోపాల్, రాజీవ్ శివారెడ్డి, వరప్రసాద్, విసు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
సుబ్బలక్ష్మి... వైఫాఫ్ జెర్రి జంబులింగం
హిట్ క్యారెక్టర్ సినిమా పేరు : క్షేమంగా వెళ్లి లాభంగా రండి (2000) డెరైక్ట్ చేసింది : రాజా వన్నెంరెడ్డి సినిమా తీసింది : ‘ఎడిటర్’ మోహన్ మాటలు రాసింది : పి. రాజేంద్రకుమార్ కోవై సరళది తమిళనాడులోని కోయంబత్తూరు. ఆ కోయంబత్తూర్ షార్ట్ నేమ్ ‘కోవై’. అలా ఊరి పేరునే ఇంటి పేరు చేసుకున్న కోవై సరళ ఇంట గెలిచి, రచ్చ గెలిచారు. తమిళ యాక్సెంట్ ధ్వనించే తెలుగు డైలాగ్ డెలివరీ... ఆ బాడీ లాంగ్వేజ్... ఎక్స్ప్రెషన్స్... ఇవన్నీ కోవై సరళను టాప్ కమెడియన్‌ను చేశాయి. ముఖ్యంగా బ్రహ్మానందం-కోవై సరళలది సూపర్‌హిట్ కాంబినేషన్. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’దే ఆ క్రెడిట్ అంతా. కోవై సరళ విశ్వరూపం కనిపిస్తుందీ సినిమాలో. మొగుడూ పెళ్లాలూ ఎలా ఉండాలంటే? చిలకా గోరింకల్లాగా, సీతారాముల్లాగా ఉండాలని ఈజీగా ఎగ్జాంపుల్స్ చెప్పేస్తారు. మరి మొగుడూ పెళ్లాలూ ఎలా ఉండకూడదంటే మాత్రం ఒక్క ఎగ్జాంపులూ చెప్పరు. అందుకే మీకు సుబ్బలక్ష్మి-జెర్రి జంబులింగం గురించి చెప్పాల్సి వస్తోంది. ‘బొబ్బిలి టైగర్’నంటూ తెగ బిల్డప్పులిచ్చే జెర్రి జంబులింగం వరుణ్ మోటార్స్‌లో ఓ సాదాసీదా మెకానిక్కు. కానీ విపరీతమైన టెక్కు. వచ్చే నాలుగు వేల జీతాన్ని అప్పులు తీర్చడానికి, మందు తాగడానికి సద్వినియోగం చేస్తుంటాడు. అప్పు చేసి పప్పు కూడు తినాలనుకునే రకం. తిప్పలు ఎన్నున్నా టిప్‌టాప్‌గా ఉండాలనుకునే మొండి ఘటం. అతనికో భార్య. పేరు సుబ్బలక్ష్మి. చాలా అనుకూలవతి. భర్త సిట్ అంటే సిట్. స్టాండ్ అంటే స్టాండ్. భర్త బ్రాందీ తాగుతుంటే అతనేదో అమృతం తాగుతున్నట్టు మురిసిపోతుంది. మధ్యమధ్యలో మంచింగ్... మందులో వాటర్ మిక్సింగ్... ఈ జంబులింగం వల్ల సుబ్బలక్ష్మికి దక్కిందేంటయ్యా అంటే నలుగురు పిల్లలు. అంతే తప్ప నో సుఖం... నో సంతోషం! సుబ్బలక్ష్మి ఇంత అనుకూలంగా ఉన్నా, జంబులింగం ఆమెను పురుగుకన్నా హీనంగా చూస్తుంటాడు. ఆఫీసు నుంచి రాగానే షూస్ ఆమే విప్పాలి... తను విప్పుకోవడానికి నామోషీ. ఆఫీసుకెళ్లే ముందు బండి దాకా బ్రీఫ్‌కేస్ ఆమే మొయ్యాలి. చివరకు బండి కూడా తుడవాలి. ఆ రోజు జంబులింగానికి యమా కోపమొచ్చేసింది. ‘‘ఏంటే ఇది’’ అని కోపంగా గుడ్లురుముతూ తన ‘టీవీఎస్ 50’ మోపెడ్ చూపించాడు. సుబ్బలక్ష్మి హడలిపోయింది. ‘‘అయ్యో... కాకి దొడ్డికెళ్లిందండీ’’ అంటూ అక్కడున్న కాకి రెట్టను తన కొంగుతోనే తుడిచేసింది. అప్పుడు బయలుదేరాడు ఆఫీసుకి జంబులింగం విజయగర్వంతో. ఇంటి పని... వంట పని... చివరకు పిల్లల్ని కాన్వెంట్‌కి తీసుకెళ్లే పని కూడా సుబ్బలక్ష్మిదే. ఓ రోజు పచారీ కొట్లో పనుండి పిల్లల్ని దించమంటే ‘‘ఏంటే నాకే పని చెప్తున్నావ్?’’ అని గయ్‌మని ఇంతెత్తున ఎగిరాడు. ‘‘పోన్లే బావా... ఈ ఒక్క రోజుకే కదా’’ అని సర్దిచెప్పాడు పక్కింటి రాంబాబు. ‘‘ఈ ఆడాళ్ల దగ్గర ఒక్క రోజు వంగితే, లైఫ్‌లాంగ్ తమ లంగా బొందుకి కట్టేసుకుంటారు’’ అంటూ ఓ జీవనసత్యం చెప్పాడు జంబులింగం. పాపం సుబ్బలక్ష్మి లైఫ్ ఇలా తగలడింది. ప్రతి క్షణం ఈసడింపులు - చులకన. గౌరవం లేదు - మర్యాద లేదు - రెస్పెక్ట్ లేదు - ఇంకేమీ లేదు. అయినా భర్తను ఒక్క మాట అనడానికీ నోరు లేదు. అది మూగతనం కాదు, సగటు భార్యతనం. భర్త సగం జీతమే చేతికిచ్చినా గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేస్తూ ఉంటుంది. పచారీ షాపువాడు దార్లో కనబడి ‘‘ఎన్నాళ్లీ అరువు బేరం... సిగ్గులేని జన్మ’’ అని ఛీ కొట్టినా భర్త గౌరవానికి భంగం రానీయదు. చివరకు ఆఫీసు అటెండర్ దగ్గర భర్త వేలకు వేలు అప్పు చేసినా ‘‘పోన్లే మగమహారాజు... ఏవో ఖర్చు లుంటాయ్’’ అని తనకు తానే సర్దిచెప్పుకుంటుంది. జంబులింగం పొగరుమోత్తనం వల్ల, అబద్ధాల వల్ల ఉన్న ఉద్యోగం కాస్తా ఊడిపోతుంది. దాంతో సంసార నౌకను తానే నడపడానికి సిద్ధమవుతుంది సుబ్బలక్ష్మి. ఇది కూడా గిట్టదు జంబులింగానికి. ‘‘ఎంత ధైర్యమే నీకు? ఆడదానివి. అందునా పెళ్లానివి. ఉద్యోగం చేస్తావా? అసలు నీకీ లత్కోర్ ఐడియా ఎవరిచ్చారు? ఒక ఇంట్లో రెండు పొయ్యిలు వెలక్కూడదు. అలాగే ఒకే ఇంట్లో రెండు బ్రెయిన్లు ఆలోచించకూడదు’’ అంటూ ఆమె చెంప చెళ్లుమనిపించాడు జంబులింగం. గుడ్ల నీరు కుక్కుకుంటూ వెళ్లిపోయింది సుబ్బలక్ష్మి. కానీ పిల్లల ఆకలి, స్కూలు ఫీజులు, ఇంటి రెంట్... ఇవన్నీ గుర్తుకొచ్చి సుబ్బలక్ష్మి బెంబేలు పడిపోయింది. ఇక ఉద్యోగానికి వెళ్లక తప్పలేదు. దాంతో జంబులింగం శివతాండవమాడేశాడు. జుట్టు పట్టుకుని సుబ్బలక్ష్మిని ‘పోవే... పో’ అంటూ బయటకు గిరాటేసేశాడు. అయినా ఏం మాట్లాడలేదు సుబ్బలక్ష్మి.పక్కింటావిడ ‘‘రా... రమ్మని’’ పిలిచి ఆశ్రయమిచ్చిందామెకు. దాంతో కల్లు తాగిన కోతిలాగా ఇంకా రెచ్చిపోయాడు జంబులింగం. రంగనాయకిని రంగంలోకి దించాడు. పగలు పనిమనిషిలాగా - రాత్రి సొంత మనిషిలాగా ఉండాలంటూ బహిరంగంగానే ఆమె బుగ్గగిల్లుతూ సరసాలాడటం మొదలెట్టాడు. ఏ భార్య అయినా భర్త ఎన్ని కొట్టినా, తిట్టినా సహిస్తుంది. కానీ భర్త పరాయి ఆడదానితో పరాచికాలాడుతుంటే మాత్రం తట్టుకోలేదు.ఇక్కడ అదే జరిగింది. ఇప్పటివరకూ కుక్కిన పేనులా పడి ఉన్న సుబ్బలక్ష్మి గాడ్జిల్లా అవతారమెత్తింది. భర్త ఎన్ని తిట్టినా కొట్టినా మొద్దురాచ్చిప్పలా ఉన్న సుబ్బలక్ష్మి ఆర్డీఎక్స్ బాంబులా మారిపోయింది.బాక్సింగ్ రింగ్‌లో దిగిన మల్లయోధుడిలాగా జంబులింగం ముందు ఒక్క దూకు దూకింది. అతగాడు చాలా నిర్లక్ష్యంగా ‘‘ఏంటే?’’ అన్నట్టుగా చూశాడు. ఇక చూడాలి సుబ్బలక్ష్మి విశ్వరూపం. కొట్టుడే కొట్టుడు. జంబులింగం జీవితంలో ఏనాడూ అంత పరుగు పెట్టలేదు. అలా పెట్టాడు. బావి చుట్టూ తిరిగాడు. పెరడంతా తిరిగాడు. బిందె అడ్డుపెట్టుకున్నాడు. చేట అడ్డుపెట్టుకున్నాడు. అయినా సుబ్బలక్ష్మి ఆగదే...? తన్నింది... రక్కింది... కొరికింది... గిల్లింది... గిచ్చింది... మొట్టింది... అయినా ఆమె కోపం చల్లారలేదు. కత్తి తీసుకుని జంబులింగం పీక కోయడానికి బయలుదేరింది. జంబులింగం వణికిపోయాడు. టైస్టులంతా ఒక్కసారిగా కలగలిసి తనను చుట్టుముట్టినట్టుగా భయపడిపోయాడు. ‘‘నువ్వు నా దేవతవే’’ అంటూ సుబ్బలక్ష్మిని పొగడ్తలతో కాకా పట్టి, కూల్ చేయడానికి ట్రై చేశాడు. అయినా తగ్గలేదు సుబ్బలక్ష్మి. ‘‘నేను అడుక్కు తినైనా పిల్లల్ని పెంచుతాను. నిన్ను మాత్రం వదిలేది లేదు’’ అంటూ జంబులింగాన్ని ఫుట్‌బాల్ ఆడేసింది. ఇదండీ... ఆ మొగుడూ పెళ్లాల కథ.భార్యను పురుగులాగా... డస్ట్బిన్లాగా ట్రీట్ చేసేవాళ్లను సుబ్బలక్ష్మి పారగాన్ చెప్పులతో ఫెడీ ఫెడీమని కొట్టినట్టే లెక్క! ఇంతకూ జంబులింగం పరిస్థితేంటి? ఇక్కడ సేఫ్టీ లేదనుకుని పుట్టింటికెళ్లిపోయాడా? లేక సుబ్బలక్ష్మితో కాళ్ల బేరానికొచ్చి ఈ ఇంట్లోనే అణిగిమణిగున్నాడా? తెలుసుకోండి ‘మగా’నుబావులారా... భార్యో రక్షతి రక్షితః! - పులగం చిన్నారాయణ బ్రహ్మానందం యాక్షన్‌కి కోవై సరళ రియాక్షన్స్ అదుర్స్! ‘విరలుక్కేత్త వీక్కమ్’ సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్. దాన్నే తెలుగులో రీమేక్ చేశాం. డెరైక్టర్‌గా నాకిదే ఫస్ట్ మూవీ. ‘ఎడిటర్’ మోహన్‌గారు దగ్గరుండి తెలుగు వెర్షన్‌కు చాలా మార్పులూ చేర్పులూ చేయించారు. మూడు జంటల మధ్య ప్రధానంగా కథ నడుస్తుంది. తమిళంలో వడివేలు-కోవై సరళ ఓ జంటగా చేశారు. తెలుగులో కూడా అంతలా వర్కవుట్ కావాలంటే బ్రహ్మానందంగారు ఒక్కరే కరెక్ట్. ఆయన పక్కన కోవై సరళ కొత్తగా ఉంటుందనిపించింది. నిజంగానే మా అంచనా ఫలించింది. బ్రహ్మానందగారి యాక్షన్‌కి కోవై సరళ ఇచ్చిన రియాక్షన్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా ఆవిడ ఎక్స్ప్రెషన్స్. తెలుగు పూర్తిగా రాకపోవడం వల్లనేమో ఆమె డైలాగ్ డెలివరీలో ఏదో కామెడీ టింజ్ కనిపిస్తుంది. బ్రహ్మానందంను కోవై సరళ వెంటబడి మరీ... చితకబాదే ఎపిసోడ్ సినిమాకే హైలైట్. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఓ తమాషా అనుభవం. బ్రహ్మానందం, కోవై సరళ రెండు టేక్‌లు చేసినా సరైన ఎఫెక్ట్ రాలేదు. దాంతో ‘ఎడిటర్’ మోహన్‌గారు నన్నూ, నా ఫ్రెండ్ ఫణిప్రసాద్ని చేసి చూపించమన్నారు. మేం చేసి చూపిస్తే అందరూ పగలబడి నవ్వారు. అప్పుడే అనుకోకుండా షూటింగ్ లొకేషన్కొచ్చిన రామానాయుడుగారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఆ తర్వాత బ్రహ్మానందం, కోవై సరళ రెచ్చిపోయి చేశారు. ఇప్పటికీ ఈ సినిమా ప్రస్తావన వస్తే, అందరూ ఈ ఎపిసోడ్ గురించే చెబుతుంటారు. - రాజా వన్నెంరెడ్డి, దర్శకుడు