breaking news
Quid danda
-
రూ.50 వేలు కొట్టు.. కేసు ఉంటే ఒట్టు !
సాక్షి, గుంటూరు : వ్యాపారాలు అక్రమంగా చేసే వారికి తెనాలి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. అడిగినంత మొత్తం ఇచ్చేస్తే చూసీ చూడనట్టు వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసులు సైతం ఉండకుండా అధికారులను సైతం కిందిస్థాయి సిబ్బంది ‘మేనేజ్’ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. తెనాలి పట్టణంలోని ఒక్క పోలీస్‌స్టేషన్ పరిధిలోనే రూ. రెండు లక్షల వరకు అక్రమ వ్యాపారుల నుంచి పోలీసు సిబ్బంది గుంజుకున్నట్టు తెలిసింది. ముత్తెంశెట్టిపాలెంలోని ఓ వ్యక్తి నిషేధిత గుట్కాల్ని విక్రయిస్తాడన్న పేరుంది. ఇటీవల ఓ రోజు రాత్రి ఆయన దుకాణం వద్ద గుట్కా ప్యాకెట్ల లోడు దించుతున్న సమయంలో పోలీసులు వెళ్లారు. ఆ వ్యాపారి రూ. 50 వేలు ఇవ్వడంతో తమకేం తెలియనుట్ట పోలీసులు వెళ్లిపోయారని సమాచారం. రామలింగేశ్వరపేట పాత డిపో వద్ద మరో దుకాణ నిర్వాహకుడి వద్దకు వెళ్లిన ముగ్గురు పోలీసులు విజిలెన్స్ అధికారుల మంటూ సోదాల పేరిట రూ. 50 వేలు తీసుకున్నారు. ఆ ముగ్గురిలో స్థానికేతరుడైన హోంగార్డు ఉన్నట్టు సమాచారం. మార్కెట్లోని దుకాణ నిర్వాహకుడు, చేబ్రోలుకు చెందిన వ్యాపారి నుంచి రూ. 50 వేలు చొప్పున వసూలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తుంటే, సిబ్బంది మాత్రం వసూలు రాజాలుగా మారి, అక్రమ వ్యాపారులకు కొమ్ముకాస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు సిబ్బంది చేతి వాటం గురించి డీఎస్పీ ఎం.స్నేహితను వివరణ కోరగా, బాధిత వ్యాపారులు తనను సంప్రదిస్తే న్యాయం చేస్తానని చెప్పారు. ఓ వైపు తాము పొగాకు ఉత్పత్తుల విక్రయంపై ఉక్కుపాదం మోపుతుంటే, వాటి విక్రయాలను సమర్థిస్తూ అవినీతికి పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
గుట్టుగా గుట్కా దందా..!
సాక్షి, నిజామాబాద్ :జిల్లాలో గుట్కా దందా గుట్టుగాసాగుతోంది. ప్యాకింగ్‌లో మా ర్పులు చేసి విక్రయిస్తున్నారు. సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో గుట్కా నిల్వలను తీసుకువచ్చి జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు, శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని గుట్కా నిల్వలను డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి రిటైల్ వ్యాపారులకు రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. హోల్‌సేల్ కిరాణాషాపులకు, పాన్‌షాపులకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి, ఆర్మూ ర్, బోధన్, బాన్సువాడ తదితర పట్టణాలకు కూడా గుట్కా ప్యాకెట్లు రవాణా అవుతున్నాయి. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా విక్రయాలపై నిషేధం విధించింది. ఆరోగ్యానికి ఎంతో హాని చేసే ఈ గుట్కా తింటూ అనేక మంది గొంతు క్యాన్సర్ తదితర వ్యాధుల భారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ గుట్కా మహమ్మారి బారిన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా విక్రయాలకు చెక్‌పెట్టాలని నిర్ణయించింది. ఇదే అక్రమార్కులకు కలిసొస్తోంది. ఒకసారి గుట్కాకు అలవాట పడిన వ్యక్తి మానడం చాలా కష్టం. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు దండుకుంటున్నారు. నిషేధం ఉందంటూ గుట్కా రేట్లను అమాంతం పెంచేసి అమ్ముతున్నారు. జిల్లాలో ప్రతిరోజు లక్షల రూపాయల్లో ఈ గుట్కా వ్యాపారం కొనసాగుతోందని అంచనా. నగరానికి చెందిన ఓ వ్యాపారి కొందరు యువకులను నియమించుకుని జిల్లాలో పలుచోట్లకు గుట్కా నిల్వలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో గుట్కాలపై నిషేధం లేనప్పుడు జిల్లాలో పలుచోట్ల ఏకంగా గుట్కా తయారీ పరిశ్రమలే వెలిశాయంటే ఏమేరకు ఈ దందా కొనసాగేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిషేధం అమలులోకి రావడంతో ఈ యూనిట్లు మూతపడ్డాయి. కానీ దందా మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. చిరు వ్యాపారులపైనే కేసులు.. పోలీసులు అడపాదడపా కిరాణాషాపులు, పాన్‌షాపుల్లో తనిఖీలు చేసి గుట్కా పాకెట్లను పట్టుకుంటున్నారు. చిరువ్యాపారులపై కేసులు నమోదు చేసి, వేల రూపాయల్లో జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అయితే వీటిని సరఫరా చేస్తున్న బడా వ్యాపారులపై, గుట్కా రాకెట్‌పై దృష్టి పెట్టకపోవడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. నేతల అండదండలుండటంతోనే గుట్కా దందా చేస్తున్న వ్యాపారుల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు గుట్కా స్థావరాలపై నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు.