breaking news
Personal relationships
-
ప్రేమ పెళ్లిళ్ల పంచాయతీ
ప్రేమించి పెళ్లాడే జంటలకు ఇప్పుడు సమాజంలో తల్లిదండ్రులు మొదలుకొని కులం, మతం, ఆర్థిక స్థోమత వంటి అడ్డంకులెన్నో వుండగా... ఇవి చాలవన్నట్టు రాజ్యం కూడా ఆ పాత్ర పోషించడానికి ఉవ్విళ్లూరుతున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు మంగళవారం ఎన్నదగిన తీర్పునిచ్చింది. యుక్తవయసొచ్చినవారికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వుంటుందని, అందుకు అడ్డుపడటం జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. చిత్రమేమంటే... ఈ తీర్పు వెలువడిన కాసేపటికే ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ‘పెళ్లి కోసం మతం మారడాన్ని’ నిరోధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌లో ఎక్కడా ‘లవ్‌జిహాద్’ ప్రస్తావన లేకపోయినా, దీని ప్రధాన ఉద్దేశం మతాంతర వివాహాలను అడ్డుకోవడమే. ఉత్తరప్రదేశ్ మాదిరే తాము కూడా చట్టాలు తీసుకొస్తామని హరియాణా, మధ్యప్రదేశ్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రకటించాయి. పెళ్లికి ముందు మతం మార దల్చుకున్నవారు రెండు నెలలముందు జిల్లా మేజిస్ట్రేట్‌కు వర్తమానం ఇవ్వాలని, అనుమతివచ్చాకే మతం మారాలని ఆర్డినెన్స్ ముసాయిదా చెబుతోంది. పెళ్లయినవారికి ఇది వర్తించదు. పెళ్లి ముసుగులో హిందూ యువతులను ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని కొన్నేళ్లుగా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దానికి ‘లవ్ జిహాద్’ అన్న పేరు కూడా పెట్టాయి. మూడేళ్లక్రితం కేరళకు చెందిన వైద్య విద్యార్థిని హదియా కేసు సమయంలో ఈ లవ్ జిహాద్ బాగా ప్రచా రంలోకొచ్చింది. హదియా తల్లిదండ్రులు కేరళ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హదియా, ఆమె ప్రియుడు పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం కలిగించింది. ఆ పెళ్లి చెల్లదని కేరళ హైకోర్టు ప్రకటించింది. దానిపై అప్పీల్కెళ్లినప్పుడు సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పు చెల్లదని ప్రకటించడమేకాక, అసలు ‘లవ్ జిహాద్’ ఉందో లేదో తేల్చాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ఆదేశాలిచ్చింది. దాని ఆచూకీ ఏం దొరకలేదని ఆ సంస్థ మరికొన్నాళ్లకు తేల్చి చెప్పింది. మన దేశంలో పెద్దలు కుదిర్చి చేసే పెళ్లిళ్లే అధికం. సంఖ్యాపరంగా తక్కువే అయినా...వాటికి సమాంతరంగా ప్రేమ వివాహాలూ వుంటున్నాయి. ఈ వివాహాల్లో అత్యధికం కులాంతరమైనవి గనుక ఆ ప్రేమికులకు కష్టాలు తప్పడం లేదు. మతాంతర వివాహాలైతే చెప్పనవసరం లేదు. ఈ మాదిరి వివాహాలను గుర్తించేందుకు 1954లోనే ప్రత్యేక వివాహ చట్టం వచ్చినా వాటికి ఆటంకాలు తప్పడం లేదు. ‘లవ్ జిహాద్’ సృష్టికర్తలెవరోగానీ రెండు పొసగని విషయాలతో పదబంధం కూర్చారు. అరబిక్ పదమైన జిహాద్‌కు ఖురాన్లో ఉన్నతాశయం కోసం చేసే పోరాటమన్న అర్థం వుంది. అది తనపై తాను చేసుకునే పోరాటం కూడా కావొచ్చు. ఆ జిహాద్ పదానికి ప్రేమతో ముడిపెట్టి దాన్ని నేరపూరిత చర్యగా అందరూ భావించేలా చేయడం లవ్‌జిహాద్ సృష్టికర్త ఆంతర్యం. ఒక యువతికి మాయమాటలు చెప్పి, ఆమెను మభ్యపెట్టి, ఆమె ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకుంటే అది భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 366 కింద నేరం అవుతుంది. అందుకు పదేళ్ల శిక్ష పడుతుంది. కానీ యుక్తవయసు వచ్చినవారు ప్రేమించుకుంటే, వారిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారైనంతమాత్రాన దాన్ని ‘లవ్ జిహాద్’గా ఎలా పరిగణిస్తారు? ‘గజం మిథ్య... పలాయనం మిథ్య’ అన్నట్టు ఈ లవ్ జిహాద్‌ను నిరూపించే కేసు దేశంలో ఒక్కటీ లేదు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పునకు మూలకారణమైన ఉదంతంలో యువతి ప్రియాంక ఖర్వార్ తండ్రి ఆమె పెళ్లాడిన సలామత్ అన్సారీపై చిన్నపిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి వర్తింపజేసే అత్యంత కఠినమైన పోక్సో చట్టంకింద, మరికొన్ని సెక్షన్లకింద కేసులు పెట్టాడు. ఈ పెళ్లి దురుద్దేశపూరితమైనదని, మోసపూరితమైనదని ఆయన అభియోగం. వీటిని కొట్టేయాలన్న జంట వినతిని హైకోర్టు అంగీ కరించింది. తాము ఎవరితో కలిసివుండాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛ యువజంటకు వుంటుందని తేల్చిచెప్పింది. ఈ వ్యక్తిగత సంబంధంలో జోక్యం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో 2014లోనూ, మొన్న సెప్టెంబర్‌లోనూ ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పులు సరైనవి కాదని ధర్మాసనం చెప్పడం ఇక్కడ గమనార్హం. ప్రియాంక, సలామత్‌లను తాము హిందూ, ముస్లిం మతాలకు చెందిన వారిగా చూడటం లేదని... ఎదిగిన ఇద్దరు వ్యక్తులుగా, స్వేచ్ఛాయుతంగా నిర్ణయం తీసుకున్నవారిగా పరిగణిస్తున్నామని చెప్పింది. హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లలో ఖాప్ పంచాయతీలు అనాగరిక తీర్పులకు పెట్టింది పేరు. ఆడపిల్లల వస్త్రధారణ మొదలుకొని కులాంతరవివాహాలవరకూ అవి తీర్పులిస్తుంటాయి. అడపా దడపా మరణశిక్షలు విధించిన చరిత్రకూడా వాటికుంది. ఆ పంచాయతీలను ప్రభుత్వాలు చూసీచూడనట్టు వదిలేయడం సరికాదని, వాటి అదుపునకు చట్టం తీసుకురావాలని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు చెప్పింది. ఆ చట్టం రాలేదు సరికదా... ఇప్పుడు మతాంతర వివాహాల నియంత్రణకు ఏకంగా రాజ్యమే ఖాప్ పంచాయతీ అవతారమెత్తింది. చట్టాలు సమాజశ్రేయస్సుకూ, దాని పురోగతికి తోడ్పడాలి తప్ప రాజ్యాంగబద్ధంగా తమకు నచ్చిన జీవితాన్ని ఎంపిక చేసుకునేవారిని నేరస్తులుగా పరిగణించకూడదు. తమ ఇష్టానికి భిన్నంగా పెళ్లి చేసుకున్న సంతానంపై తల్లిదండ్రులు అలకబూనటాన్ని, కోపగించటాన్ని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ స్వయంగా రాజ్యమే అందులోకి జొరబడి, ఆ పిల్లల ఇష్టాయిష్టాలను నియంత్రించాలనుకోవడం, వాటిని నేరపూరితం చేయడం సామాజికంగా తిరోగమనం తప్ప మరేమీ కాదు. పౌరుల్లో రాజ్యాంగ నైతికతను పెంచాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా ప్రవర్తించడం అంతర్జాతీయంగా మన ప్రతిష్టను పెంచదు. -
వర్క్ మధ్యలోనే భాగస్వామితో ఏకాంతం!
గంటపాటు అనుమతివ్వాలంటూ కౌన్సిలర్ ప్రతిపాదన ప్రస్తుత ఆధునిక సమాజంలో భార్యాభర్తల మధ్య పెద్దగా సన్నిహిత అనుబంధం ఉండటం లేదు. పని ఒత్తిడి, సెల్ ఫోన్, సోషల్ మీడియా వంటి వాటి వ్యాపకంతోనే సమయమంతా గడిచిపోతోంది. భార్యాభర్తల మధ్య ప్రణయ ఏకాంతానికి తీరికే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో స్వీడన్‌కు చెందిన ఓ కౌన్సిలర్ ఒక అరుదైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఉద్యోగులకు పనివేళలో ఒక గంటపాటు పెయిడ్ బ్రేక్ (వేతన విరామం) ఇస్తే.. ఆ సమయంలో వారు ఇంటికి వెళ్లి తమ భాగస్వాములతో శృంగారంలో పాల్గొనేందుకు వీలుంటుందని ఆయన ప్రతిపాదించారు. శృంగారం ఎంతో ఆరోగ్యకరమైనదని అనేక అధ్యయనాలు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్టు 42 ఏళ్ల పెర్ ఎరిక్ మస్కోస్ తెలిపారు. ప్రస్తుతం జంటలు ఒకరితో ఒకరు సన్నిహితంగా ఎక్కువ సమయం గడపడం లేదని, ఈ నేపథ్యంలో వారి మధ్య సన్నిహిత అనుబంధం ఉండటం ఎంతో మంచిదని ఆయన తన ప్రతిపాదన తీర్మానాన్ని కౌన్సిల్లో ప్రవేశపెడుతూ పేర్కొన్నారు. ఉద్యోగులు తమకు కేటాయించిన పెయిడ్ బ్రేక్‌ను భాగస్వాములతోనే గడుపుతున్నారా? లేక వేరే పనులకు ఉపయోగిస్తున్నారా? అన్నది గుర్తించడానికి ఎలాంటి మార్గం లేదని, అయినా ఉద్యోగులపై నమ్మకం ఉంచి కంపెనీలు ఈ విరామం ఇస్తే మంచిదని ఆయన సూచించారు. తన తీర్మానం తప్పకుండా కౌన్సిల్ ఆమోదం పొందుతుందని మస్కోస్ ధీమాతో ఉన్నారు -
బీజేపీని వీడేది లేదు: శత్రుఘ్న సిన్హా
పట్నా: బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదని ఆ పార్టీ ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. శనివారం బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో శత్రుఘ్న భేటీ నేపథ్యంలో ఆయన పార్టీ వీడతారనే ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఆదివారం ఈ విషయంపై సిన్హా స్పందించారు. ‘ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు బీజేపీలో చేరాను.. క్లిష్ట సమయాల్లోనూ పార్టీలోనే ఉన్నాను. జేడీయూలో చేరే ప్రశ్నే లేదు’ అని పేర్కొన్నారు. ‘భవిష్యత్తును ఎవరు చెప్పగలరు. రేపు ఎవరైనా నన్నే పార్టీ నుంచి గెంటేయవచ్చు.. దాని గురించిన ఆలోచనే నాకు లేదు’ అని అన్నారు. నితీశ్‌తో సమావేశంపై మాట్లాడుతూ... ఆయనతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, పట్నా వచ్చిన ప్రతిసారీ ఆయనను కలుస్తానని తెలిపారు.