breaking news
peoples rights
-
‘కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు’
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల కనీస హక్కులను సీఎం కేసీఆర్ కాలరాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆయన గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిరసనలను నిషేధించారని తెలిపారు. ఫిబ్రవరి 22వ తేదీన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తదితరులు ఇందిరాపార్కు వద్ద ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందరినీ అరెస్టు చేసి ఆందోళనను భగ్నం చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీజేఏసీ కీలకభూమిక పోషించిందని వివరించారు. ఇందిరాపార్కు వద్ద వివిధ దశల్లో చేపట్టిన ఆందోళన కారణంగానే రాష్ట్ర సాధన సాధ్యమైందని, అనంతరం ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఇప్పుడు నిరసనలను సహించలేకపోతున్నారని చెప్పారు.రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించటానికి ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలను తీసుకోలేదని, దీనిపై చేపట్టే ఆందోళనలను ఆయన అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం పాల్పడే అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని నారాయణ చెప్పారు. -
హక్కుల పరిరక్షణకు సైనికుల్లా పనిచేయండి
సాక్షి, బెంగళూరు: ప్రజల హక్కులు, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు సైనికుల్లా పనిచేయాలని యువ న్యాయవాదులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ)లో ఆదివారం నిర్వహించిన 24వ స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నాతకోత్సవంలో ప్రణబ్ మాట్లాడుతూ ‘ప్రభుత్వ, పాలనా వ్యవహారాల్లో విద్యార్థులు భాగస్వాములు కావడం ద్వారా వ్యవస్థలో మార్పునకు కృషి చేయాలి. అప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయి’ అని పేర్కొన్నారు. అవినీతిపై మాట్లాడుతూ ‘ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే, ఇవ్వం అని ధైర్యంగా చెప్పండి ’ అని చెప్పారు. దేశంలో మహిళలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.