breaking news
Pagidipala Anjaneyulu
-
నగరంలో ఆంగ్లో ఇండియన్స్
200 ఏళ్లుగా నగర జీవనంతో మమేకం క్రమేపీ తగ్గుతున్న జనాభా నగరంలో ‘ఆంగ్లో ఇండియన్స్’కు ఓ ప్రత్యేకత ఉంది. భాష, ఆహార్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో సమ్మిళిత సంస్కృతికి ప్రతినిధులు వీరు. జీవన విధానంలో ఒక వైవిధ్యం కనిపిస్తుంది.. వారు ఎక్కడ ఉంటే అక్కడ ‘లిటిల్ ఇంగ్లండ్’ ఆవిష్కారమవుతుంది. రెండు భిన్న జాతుల సహజీవనానికి ప్రతీకలుగా 200 ఏళ్లకు పైగా తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఒకప్పటి బ్రిటన్ పూర్వీకులకు వారసులుగా ఇక్కడే పుట్టి పెరిగిన వీరు.. భాగ్యనగర జీవనంలో అంతర్భాగమయ్యారు. గ్రేటర్ ఎన్నికల వేళ ఆంగ్లో ఇండియన్స్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - పగిడిపాల ఆంజనేయులు ఒక సికింద్రాబాద్-ఒక ఇంగ్లండ్: నిజమే.. ఇది ఇప్పటి సంగతి కాదు. వందల ఏళ్ల నాటి చరిత్ర. నిజాం సంస్థానంలో సైనిక పటాలాలు, పరిపాలన కార్యాలయాలు, నివాస సముదాయాలను ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డ ఆంగ్లేయులతో సికింద్రాబాద్ ఇంగ్లండ్‌ను తలపించేది. ఆంగ్లేయుల పేరుతో వెలసిన ‘జేమ్స్ స్ట్రీట్’ వంటి బస్తీలు, ప్యారడైజ్‌లు, ప్యాట్నీలు ఆ సంస్కృతికి ప్రతిబింబాలు. తెల్లవాళ్ల విలక్షణమైన జీవన విధానం, భాష, దుస్తులు, అలంకరణ ఇక్కడి వారిని బాగా ప్రభావితం చేసింది. ఇక్కడి ప్రజల జీవన విధానంతో బ్రిటీష్ వారు కూడా ప్రభావితమయ్యారు. అలా సికింద్రాబాద్ ఒక సమ్మిళిత సంస్కృతికి కేంద్రబిందువైంది. బొల్లారం నుంచి మెట్టుగూడ వరకు, అల్వాల్ నుంచి లాలాగూడ వరకు కంటోన్మెంట్, పౌర ప్రభుత్వ కార్యాలయాలు వెలసిన ప్రతి చోటా కొత్త సంస్కృతి కూడా వెల్లివిరిసింది. భిన్న సంస్కృతి ఇలా.. ఆంగ్లేయులు ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకొని స్థిరపడ్డారు. అలా స్థిరపడిన వారి సంతతి ఆంగ్లో ఇండియన్స్. ఈస్టిండియా కంపెనీ కూడా ఈ సాంస్కృతిక సహజీవనాన్ని బాగా ప్రోత్సహించింది. భారతీయ మహిళలను వివాహం చేసుకునేవారికి ఆ రోజుల్లో 5 రూపాయల ప్రోత్సాహక బహుమతి కూడా ఇచ్చేవారు. అలా నగరంలోని సైనిక్‌పురి, దక్షిణ లాలాగూడ, మెట్టుగూడ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలు ఆంగ్లో ఇండియన్లకు నిలయమయ్యాయి. ‘ఒక్క శాతం’తో మొదలై.. ఆంగ్లో ఇండియన్లకు బ్రిటన్ ప్రభుత్వం సముచితమైన స్థానమిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఈ సమూహం ఆర్థికంగా స్థిరపడింది. రైల్వేలు, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్, క్రీడలు, సైన్యం, విద్య, వైద్యం వంటి రంగాల్లో చాలా మంది స్థిరపడ్డారు. 1956 నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఆంగ్లో ఇండియన్ ప్రముఖులు రాజకీయాల్లో రాణించారు. శాసన సభ్యులుగా నియమితులయ్యారు. తొలి దశాబ్దాల్లో జాన్ ఫెర్నాండెజ్, మెజోరి గాడ్‌ఫ్రె, క్లారిస్ మోరిస్, ఆస్వాల్డ్ పెడ్రో వంటి వారు ఆ తరువాత, ఇటీవల కాలంలో క్రిస్టీనా లాజరస్, డెల్లా గాడ్‌ఫ్రె, ప్రస్తుతం ఎల్విస్ స్టీఫెన్సన్ వంటివారు రాజకీయ రంగంలో ఉన్నారు. అభివృద్ధికి దూరంగా.. ఒకప్పుడు ఆంగ్లేయులు కల్పించిన రిజర్వేషన్ సదుపాయం వల్ల ఆంగ్లో ఇండియన్స్ కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ క్రమంగా ఉద్యోగావకాశాలకు దూరం కావడం, ఉన్నత చదువులు కూడా లేకపోవడంతో చాలా మంది సాంకేతిక నిపుణులుగా ఐటీఐ, వెల్డింగ్, మిషన్ రంగాల్లో అనుభవాన్ని ఆర్జించి ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాలకు తరలి వెళ్లారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినా, ఇక్కడే స్థిరపడ్డా ఇంగ్లిష్ భాష ఒక్కటే వారికి జీవనాధారంగా నిలిచింది. హైదరాబాద్‌లోని కాల్‌సెంటర్స్‌లో పనిచేసేవారిలో చాలామంది ఆంగ్లో ఇండియన్లే. భాష, కమ్యూనికేషన్ స్కిల్స్ వారిని ఈ రంగంలో నిలబెట్టాయి. చాలా మంది విదేశాలకు తరలి వెళ్లడం వల్ల, ఆంగ్లో ఇండియన్ అమ్మాయిలు ఇతర హిందూ, హిందూయేతర వర్గాలకు చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల వీరి జనాభా క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో లక్షా 50 వేల మంది ఆంగ్లో ఇండియన్లు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య వేలకుపడిపోయింది. అవకాశాలు పెరగాలి.. అనేక శతాబ్దాలుగా భారతీయ సాంస్కృతిక జీవనంలో కలిసిపోయి, ఓటు హక్కుతో సహా అన్ని రకాల హక్కులను అనుభవిస్తున్న ఆంగ్లో ఇండియన్లను మైనారిటీ కమ్యూనిటీగా గుర్తించాలని ది ఆల్ ఇండియా ఆంగ్లో ఇండియన్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. -
పాలెం స్వర్ణోత్సవ సౌభాగ్యం
అదొక మహా విప్లవం. అద్భుత గ్రామస్వరాజ్యం. యాభై ఏళ్ల క్రితమే ఒక మారుమూల కుగ్రామం దేశంలోనే సమగ్రాభివృద్ధిని సాధించిన ఐదు గ్రామాల్లో ఒకటిగా వెలుగొందింది. అది... పేదరికం, కరువు కాటకాలు, వలసలు, ఆకలిదప్పులు తప్ప అభివృద్ధి ఎరుగని పాలమూరు జిల్లాలోని ‘పాలెం’. ఆ అద్భుతానికి సృష్టికర్త పాలెం సుబ్బయ్యగా మన్ననలందుకున్న తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ. ఆ ఊరు సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యా, వైజ్ఞానిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలన్నింటిలో సమగ్ర వికాసం సాధించేలా చేసిన కృషీవలుడు. భూస్వామ్య సంస్కృతి రాజ్యమేలుతోన్న తరుణంలో పాలెం ప్రగతి కోసమే పుట్టాడేమోనన్నట్లుగా సుబ్బయ్య ఊళ్లో బడి, గుడి, కళాశాల, ఆసుపత్రి నిర్మింపజేశారు. విద్యార్ధులకు వసతి గృహాలు, ఉపాధ్యాయులకు, వైద్య సిబ్బందికి నివాస ఏర్పాట్లు చేశారు, ఆయన స్థాపించిన బడిలో, కళాశాలల్లో చదువుకుని ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యనిపుణులు, పరిపాలనా దక్షులు, అధ్యాపకులు, పరిశోధకులు, రచయితలు, కవులు, కళాకారులుగా దేశవిదేశాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఒకప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, పీవీ, జలగం, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి వాళ్లెందరో ఆ ఊరిని సందర్శించి కీర్తించారు. యాభైఏళ్ల క్రితం ఇలాంటి అభివృద్ధి ఊహింపశక్యం కానిది. పాలమూరు జిల్లా నాగర్‌కర్నూలుకు సమీపంలోని బిజినేపల్లి మండలం పాలెం గ్రామం ఈ నెల 29న స్వర్ణోత్సవ వేడుకలు చేసుకుంటోంది. విద్య, వైద్య గ్రామాభ్యుదయం 1958 నాటికే సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సుబ్బయ్య వితరణతో ఊళ్లో ఆసుపత్రిని కట్టించారు. ఆ రోజుల్లో రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఒక మారుమూల పల్లెటూర్లో ఆసుపత్రి లేదు. ఆ తదుపరి వెటర్నరీని ఆసుత్రిని సైతం పూర్తి చేశారు. ఊరిలోని పురాతన వెంకటేశ్వరాలయాన్ని నిర్మించి పాలెంకు రెండవ తిరుపతి పేరు తెచ్చారు. పెద్దగా చదువుకోని సుబ్బయ్య ఆ ఊరి పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం పరితపించారు. ‘ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ’ని స్థాపించి హైస్కూలు చదవులు అందుబాటులోకి తెచ్చారు. వేంకటేశ్వరాలయం ఆదాయాన్ని పిల్లల చదువు కోసమే వెచ్చించేలా చేశారు. 1963లో శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కూడా ప్రారంభమైంది. పాలెం పిల్లలే కాదు, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ సహా అనేక ప్రాంతాలకు అది విద్యాకేంద్రమైంది. కాలేజీ భవనాలు, ప్రయోగశాలల నిర్మాణానికి, నిర్వహణకు, అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాల తదితర ఖర్చుల కోసం 16 ఎకరాల సొంత భూమిని అమ్మేశారు. ఆ కళాశాలలోని మొదటి పీయూసీ బ్యాచ్ 80 శాతం ఉత్తీర్ణతను సాధించింది. దీంతో నల్లగొండ, కర్నూలు, కడప, అనంతపురం, తదితర జిల్లాల విద్యార్ధులు కూడా పాలెం బాట పట్టారు. 1964లో సుబ్బయ్య శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్, శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలను ఒకేసారి ప్రారంభించారు. మరో 25 ఎకరాల భూమిని అమ్మేశారు. ఆ పిదప నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆ విద్యాసంస్థలను మరింత అభివృద్ధి చేశారు. సమగ్రాభివృద్ధి పథం గ్రామ సమగ్రాభివృద్ధి కోసం అహరహం శ్రమించిన సుబ్బయ్య 1960లలోనే పాలెంకు తాగు నీటి నల్లాల సౌకర్యాన్ని కల్పించారు. ఆనాడు అలాంటి సదుపాయం నగరాలు, జిల్లా, తాలూకా కేంద్రాలకే పరిమితం. 1971-72 సంవత్సరంలో హరిజనుల కోసం ఆయన కట్టించిన 60 పక్కా ఇళ్లకు నాటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు ప్రారంభోత్సవం చేశారు. పాలెం అభివృద్ధిని కళ్లారా చూసి పీవీ ముగ్ధుడయ్యారు. సుబ్బయ్యను ఎమ్మెల్సీ పదవి చేపట్టాలని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. 1967లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ పాలెంలో ఏర్పాటైంది. రైతులకు చౌకగా రుణపరపతి సౌకర్యాలు విస్తరించాయి. సుబ్బయ్య కృషి ఫలితంగా 1969లో పాలెంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఏర్పాటైంది. అక్కడి శాస్త్రవేత్తల పరిశోధనల కోసం ఆయన తన 20 ఎకరాల భూమిని ఇచ్చేశారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా పాలెంలో పౌల్ట్రీ, పాడి పరిశ్రమలు కూడా అప్పట్లోనే ఏర్పడ్డాయి. మహిళల కోసం కుటీర, చిన్న తరహా పరిశ్రమలు సైతం రూపుదిద్దుకున్నాయి. జిల్లాలోనే మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ పాలెంలోనే ఏర్పాటైంది. ఊరు ఎదిగిన కొద్దీ ఆయన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. ప్రజల సేవ కోసమే పుట్టానని భావించిన సుబ్బయ్య బతికినంత కాలం ప్రజా సేవలోనే గడిపారు. ఏ రాజకీయ పదవులు, సామాజిక హోదాలు ఆశించక సామాన్యునిగానే బతుకుతూ అనితర సాధ్యమైన సేవలను అందించారు. గ్రామాభివృద్ధి కోసం సర్వస్వం ధారపోసిన సుబ్బయ్య చివరకు అనేక కష్టాలను అనుభవించారు. ఏమైతేనేం ఆయన స్వప్నం పాలెం సర్వోతోముఖాభివద్ధిని తన జీవిత కాలంలోనే సాకారం చేసుకోగలిగారు. పగిడిపాల ఆంజనేయులు (డిసెంబర్ 29న పాలెం స్వర్ణోత్సవాలు)