breaking news
other language heroines
-
శుభ'మస్తు'గా పర భాష హీరోయిన్లు.. తెలుగులోకి పరిచయం
పేరులోనే శుభాన్ని మోసుకొచ్చింది ఉగాది.. ఇది ‘శుభకృత్’ నామ సంవత్సరం.. శుభకృత్ అంటే ‘మంచి చేసేది’ అని అర్థం. మంచే జరుగుతుందనే ఆశావాహ దృక్పథంతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికిన వేళ. తెలుగు చిత్రసీమ కూడా కొత్త కథానాయికలను ‘శుభమస్తు’ అంటూ ఆహ్వానిస్తోంది. కొత్త తెలుగు సంవత్సరంలో పలువురు నాయికలు పరిచయం కానున్నారు. ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ముంబై బ్యూటీలు తెలుగు తెరపై మెరవడం కొత్తేం కాదు. ఇప్పటికే ఎంతోమంది హిందీ భామలు ఇక్కడ నిరూపించుకున్నారు. తాజాగా కొందరు ముంబై సే ఆయా (ముంబై నుంచి వచ్చారు). వీళ్లల్లో ఆల్రెడీ హిందీలో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న దీపికా పదుకొణె తెలుగు తెరకు పరిచయం కానున్నారు. దీపికా అనగానే చాలామంది బాలీవుడ్ హీరోయిన్ అనే అనుకుంటారు. కానీ హీరోయిన్గా ఆమె కెరీర్ మొదలైంది ఉపేంద్ర హీరోగా 2006లో విడుదలైన కన్నడ ఫిల్మ్ ‘ఐశ్వర్య’తోనే. ఈ సినిమా తర్వాత దీపికా హిందీలో చేసిన ‘ఓం శాంతి ఓం’ అద్భుత విజయం సాధించడంతో బాలీవుడ్లోనే సెటిలైపోయారు ఈ మంగుళూరు బ్యూటీ. అయితే 2007లో రజనీకాంత్ చేసిన తమిళ ఫిల్మ్ ‘కొచ్చయాడన్’తో మళ్లీ సౌత్‌లో నటించారు. అయితే అది యానిమేషన్ మూవీ కాబట్టి.. ఎక్కువ రోజులు పని చేయలేదామె. ఎనిమిదేళ్ల తర్వాత సౌత్‌లో ‘ప్రాజెక్ట్ కె’లో భాగమయ్యారు. దీపికా పదుకొణెకు తెలుగులో ఇదే తొలి సినిమా. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఇక 2019లో హిందీలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించిన అనన్య పాండే ‘లైగర్’తో తెలుగువైపు అడుగులు వేశారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఇంకోవైపు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందిన మరో ఫిల్మ్ ‘గని’తో తెలుగు గడప తొక్కారు సయీ మంజ్రేకర్. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ‘గని’ చిత్రంలో సయీ మంజ్రేకర్ ఓ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న రిలీజ్ కానుంది. బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న మిథిలా పాల్కర్ తెలుగుకి వచ్చారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘ఓరి దేవుడా..’ చిత్రంలో తెలుగు తెరపై కనిపించనున్నారామె. తమిళ హిట్ ఫిల్మ్ ‘ఓ మై కడవులే..’కి ఇది తెలుగు రీమేక్. ఒకే సినిమాతో ఇరువురు భామలు ఒకే సినిమా (‘టైగర్ నాగేశ్వరరావు’)తో ఇద్దరు బ్యూటీలు పరిచయం కానున్నారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో కథానాయికలు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రవితేజ హీరోగా పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఉగాది పర్వదినానా (శనివారం) ఆరంభమైంది. ఇంతకీ నూపుర్ సనన్ ఎవరంటే.. ఇప్పటికే నార్త్, సౌత్‌లో స్టార్ అనిపించుకున్న కృతీ సనన్ చెల్లెలు. మరో భామ గాయత్రీ భరద్వాజ్ ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018, సెఫోరా మిస్ గ్లామరస్, జియో మిస్ పాపులర్ ఇలా పలు టైటిల్స్‌ను గెల్చుకున్నారు. ఫ్రమ్ ఫారిన్ తమిళ హీరో శివకార్తికేయన్ కోసం ఉక్రెయిన్ నుంచి వచ్చారు మరియా ర్యాబోషప్క. కేవీ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క నటిస్తున్నారు. ఇక నాగశౌర్య కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు న్యూజిల్యాండ్ బ్యూటీ షిర్లే సేథియా. నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘కృష్ణ వ్రిందా విహారి’ చిత్రంలో షిర్లే సేథియా హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుంది. మాలీవుడ్ టు టాలీవుడ్ మలయాళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన నజ్రియా నజీమ్ సుందరం కోసం తెలుగుకి వచ్చారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అంటే... సుందరానికీ’ చిత్రంలో నజ్రియా కథానాయికగా నటిస్తున్నారు. మరోవైపు మాలీవుడ్‌లో దూసుకెళ్తోన్న సంయుక్తా మీనన్ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘సర్’ (తమిళంలో ‘వాతి’)లో సంయుక్తా హీరోయిన్గా చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. అలాగే కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న టైమ్ ట్రావెల్ ఫిల్మ్‌లో సంయుక్త హీరోయిన్గా కనిపిస్తారు. అంతే కాదండోయ్.. మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ చిత్రంలో ఓ కీ రోల్ చేస్తున్నారీ బ్యూటీ. ఇక మరో పాపులర్ మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మీ సైతం తెలుగులో నిరూపించుకునేందుకు రెడీ అయ్యారు. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేశ్ కాంబినేషన్లో రిలీజ్‌కు రెడీ అయిన చిత్రం ‘గాడ్సే’. ఈ చిత్రంతో ఐశ్వర్యా లక్ష్మీ తెలుగులో తొలి అడుగు వేశారు. వీరితో పాటు అనిఖా కృష్ణన్ కూడా తెలుగుకు హాయ్ చెబుతున్నారు. మలయాళ హిట్ ఫిల్మ్ ‘కప్పెలా’ తెలుగు రీమేక్ ‘బుట్టబొమ్మ’ (వర్కింగ్ టైటిల్)లో అనిఖా నటిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ హీరోలు. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదికి దాదాపు పది మంది కథానాయికలు తెలుగుకి వస్తున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా తెలుగులో పరిచయమై ప్రతిభను నిరూపించుకునేందుకు కథలు వింటున్నారు. -
టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న పరభాషా హీరోలు
టాలీవుడ్‌ది పెద్ద మనస్సు... ఎంతమంది వచ్చినా ఎస్సు అంటుంది. మామూలుగా పరభాషా నాయికలు, విలన్లు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు పరభాషా హీరోలు ఇక్కడ హీరోలుగా పరిచయం కానున్నారు. అంతేనా... పరభాషలో హీరోలుగా దూసుకెళుతున్నవాళ్లు ఇక్కడ సహాయనటులుగా, విలన్లుగా పరిచయం కానున్నారు. ‘రారండోయ్ పరిచయం చేస్తాం’ అంటూ అందరికీ అవకాశం ఇస్తోంది టాలీవుడ్. ఈ పరిచయాలు పెరగడానికి ఓ కారణం పాన్ ఇండియన్ సినిమాలు. ఏది ఏమైనా ఇతర భాషల్లో లేనంతగా తెలుగులో పరభాషలవారికి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన ‘మాస్టర్’, ‘బిగిల్’, ‘సర్కారు’, ‘మెర్సెల్’ వంటి చిత్రాలు తెలుగులో అనువాదమై, మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. మరో తమిళ స్టార్ ధనుష్ అయితే ఒకేసారి రెండు తెలుగు సినిమాలు కమిట్ కావడం విశేషం. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో ఆయన సినిమాలు చేయనున్నారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ‘సర్’ (తమిళంలో ‘వాతి’) సినిమా షూటింగ్ ఈ నెల 5న ప్రారంభం కానుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ మార్చిలో ఆరంభమవుతుందట. ఇక తమిళంలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుని, హీరోగా మారిన శివకార్తికేయన్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రానికి ఇటీవలే సైన్ చేశారు. ‘జాతిరత్నాలు’ వంటి మంచి హిట్ ఇచ్చిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే సంగీతదర్శకుడిగా, ఎడిటర్‌గా నిరూపించుకుని, హీరోగా చేస్తున్న విజయ్ ఆంటోని ఇప్పటివరకూ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించారు. ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకున్నారు. అయితే సోలో హీరోగా కాదు.. మరో హీరోతో కలిసి ‘జ్వాల’లో నటిస్తున్నారు. ఆ మరో నటుడు ఎవరంటే.. ‘బ్రూస్లీ’, ‘సాహో’ చిత్రాల్లో ఓ రోల్ చేసిన అరుణ్ విజయ్ అన్నమాట. ఈ ఇద్దరూ హీరోలుగా ‘జ్వాల’ (తమిళంలో ‘అగ్ని సిరగుగళ్’ టైటిల్) చేస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ దర్శకుడు. అటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. కీర్తీ సురేష్ చేసిన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో ఆకట్టుకున్నారు దుల్కర్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దుల్కర్‌కు హీరోగా తెలుగులో తొలి చిత్రం. ఇక టాలీవుడ్‌కు హాయ్ చెబుతున్నారు మరో మలయాళ నటుడు దేవ్ మోహన్. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’లో దేవ్ మోహన్ మెయిన్ లీడ్‌గా చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు తెలుగుకి పరిచయం కావడానికి రెడీ అవుతున్నారు. అక్కడ హీరోలు... ఇక్కడ క్యారెక్టర్లు! మాతృభాషలో హీరోలుగా చేస్తూ హీరోలుగానే తెలుగులో పరిచయమవుతున్న వారు కొందరైతే... పరభాష హీరోలు కొందరు ఇక్కడ కీలక పాత్రలు చేస్తుండడం విశేషం. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంలో నవాజుద్దిన్ సిద్ధిఖీ ఓ పాత్ర చేయనున్నారనే ప్రచారం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రధానంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. సో.. ‘ఆదిపురుష్’ సినిమాయే సైఫ్‌కి తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రంలోని లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఓ రోల్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. ఇక జూనియర్ ఆర్టిస్టు నుంచి మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు దునియా విజయ్ టాలీవుడ్‌కు వస్తున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో దునియా విజయ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. మరో కన్నడ యాక్టర్ ధనుంజయ ‘పుష్ప’ చిత్రంతో, వశిష్ట సింహా ‘నయీం డైరీస్’తో వచ్చారు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో విలన్‌గా చేసి, తెలుగు ప్రేక్షకులకు స్ట్రయిట్‌గా హాయ్ చెప్పారు మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్. వీరితోపాటు మరికొందరు పరభాషా నటులు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో కనిపించిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, వరుణ్ తేజ్ ‘గని’లో సునీల్ శెట్టి, రవితేజ ‘ఖిలాడి’లో ఉన్ని ముకుందన్ తదితరులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. -
ఆడవారె ఈడవారు
కవర్ స్టోరీ తెలుగుతెర అంతా ‘ఆడ’ పిల్లలే... అదేనండీ పరభాషా నాయికలే అని తరచూ వాపోతూ ఉంటాం. కానీ, ఇవాళ తెలుగు సినిమాలలో పాపులర్ హీరోయిన్లయిన తమిళ, మలయాళ, పంజాబీ, ఢిల్లీ భామల్లో చాలామంది తెలుగుసీమను అక్షరాలా తమ రెండో ఇల్లు చేసుకుంటున్నారు. ఇక్కడే ఫ్లాట్ కొంటున్నారు, జిమ్ పెడుతున్నారు, తెలుగు నేర్చేసు కొని డబ్బింగ్ చెప్పేస్తున్నారు. చిన్న పాత్రకైనా, కురచ దుస్తులకైనా సై అంటున్నారు. అందుకే, ఈ ‘ఆడ’వారు... ఇప్పుడిక ‘ఈడ’ వారు. అనుష్క (34) : తెలుగింటి రుద్రమ బి.సి.ఏ. చదివి, యోగా శిక్షకురాలిగా చేస్తూ, 11 ఏళ్ళ క్రితం హఠాత్తుగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఈ తుళు భామకు నటనలో ఓనమాలు తెలియవు. ఇవాళ తెలుగు, తమిళాల్లో నటిగా ఆమె ఎవరో తెలీనివారు లేరు. ‘బిల్లా’లో బికినీ వేసినా, ‘సైజ్ జీరో’ కోసం లావైనా, ‘వేదం’లో వేశ్యపాత్ర వేసినా అనుష్క గట్స్ వేరు. స్నేహం కోసం స్పెషల్ సాంగ్కైనా (‘స్టాలిన్’, ‘కింగ్’), అతిథి పాత్రలకైనా ఎవర్ రెడీ. అందుకే, ఇండస్ట్రీలో ఆమె గురించి అంతా మంచే చెప్తారు. ‘మనమ్మాయే’ అంటారు. ఫస్ట్ : నాగార్జున - పూరీల ‘సూపర్’ ( 2005) బెస్ట్ : ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ స్పెషాల్టీ : మంచితనం, యూనిట్ సభ్యులతో సహకారం, కలుపుగోలుతనం హీరోయిన్లలో స్వీటీని స్పెషల్‌గా నిలబెట్టాయి. పోజులు కొట్టకుండా, సామాన్య వ్యక్తిలా అందరితోనూ కనెక్టయిపోతారు. చక్కటి తెలుగు మాట్లాడతారు. ఉంటే బెంగుళూరు, లేదంటే హైదరాబాదే. నాగ్ కుటుంబానికి సన్నిహితురాలు. లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఇవాళ దర్శక, నిర్మాతలకు ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ అనుష్కే. పారితోషికం : రూ. 1.5 నుంచి 2 కోట్లు తమన్నా (27) : పాల నురగల తళుకు బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతూ, డబ్బింగ్ కూడా చెప్పే స్థాయికి (నాగార్జున ‘ఊపిరి’) చేరిన ఈ పాల మెరుగుల సుందరి పంజాబీ గుడియా అంటే నమ్మలేం. 15 ఏళ్ళకే హిందీలో ఎంట్రీ ఇచ్చి, ఆపైన దక్షిణాదికి వచ్చి, తెలుగు, తమిళాల్లో దున్నేస్తున్నారు. డైమండ్ వ్యాపారి కూతురైన తమ్మూ దక్షిణాదిలో జ్యువెలరీ ఎండార్సమెంట్స్లో టాప్. గత ఏడాది సొంతంగా ‘వైట్ ఎన్ గోల్డ్’ అనే రిటైల్ జ్యువెలరీ బ్రాండ్ కూడా మొదలెట్టారు. ఫస్ట్ : తెలుగులో ‘శ్రీ’ (2005) బెస్ట్ : ‘హ్యాపీడేస్’, ‘బాహుబలి’, ‘ఊపిరి’ స్పెషాల్టీ : నవతరం హీరోయిన్స్ లో మంచి డ్యాన్సర్. సాక్షాత్తూ చిరంజీవి సైతం నర్తించడానికీ, నటించడానికీ ఇష్టపడుతున్న హీరోయిన్. స్పెషల్ సాంగ్స్ (‘అల్లుడు శీను’), అతిథి పాత్ర (‘రెడీ’)లకూ సై! కొన్ని ఆడకపోయినా, హిందీ వైపు చూడడం మానని నటి. స్టార్ స్టేటస్ తెచ్చిన తెలుగు సీమ అంటే తెగ ఇష్టం. భేషజం లేకుండా నవ్వుతూ మాట్లాడే ఈ మిల్కీ బ్యూటీ అలా మన తెలుగమ్మాయిలా కలిసిపోయారు. పారితోషికం: రూ. 1.5 కోట్ల దాకా సమంత (29) : చిన్న వయసు... పెద్ద మనసు... తెలుగునాట వెన్నెల కాస్తున్న చెన్నై చంద్రమ. కొత్తతరం ప్రేమకు ప్రతినిధిగా పవన్‌కల్యాణ్, చిన్న ఎన్టీఆర్, బన్నీ - ఇలా అందరి సరసనా ఆమే. సిద్ధార్థతో బ్రేకప్ లవ్‌స్టోరీ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఐటవ్ు సాంగ్ దాకా ఆమెకు సంబంధించి ప్రతిదీ హాట్ న్యూసే. బ్రాండ్ ఎండార్సమెంట్లు, 3 భాషల్లో సినిమాలతో ఎప్పుడూ యమ బిజీ. ఫస్ట్ : నాగచైతన్య- గౌతమ్ మీనన్‌ల ‘ఏ మాయచేశావె’ (2010) బెస్ట్ : ‘ఏ మాయ చేశావె’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’ స్పెషాల్టీ: కళ్ళల్లో చిలిపితనం... సమాజం పట్ల ప్రేమ ధనం... చారిటీకి మూలధనం కలిస్తే - సమంత. ఫ్యాషన్ దుస్తులు, మీడియాలో ట్వీట్లతో రోజూ పేపర్లో ఉంటారు. టాప్ హీరోయినైనా చెన్నై మధ్యతరగతి మనస్తత్వాన్ని వదులుకోని మంచి మనిషి. నవ్వుతూ, చక్కటి తెలుగు గలగలా మాట్లాడతారు. నెలకు ఇరవై రోజులైనా హైదరాబాద్‌లోనే మకాం. ఉంటున్న స్టార్ హోటల్‌నే దాదాపు ఇంటిని చేసుకున్నారు. తెలుగు, తమిళాల్లో హీరోలకు ఇవాళ ఫస్ట్ చాయిస్. త్వరలోనే నిజజీవితంలో అక్షరాలా తెలుగు సినీసీమకు పెద్దింటి కోడలు కానున్నారట. పారితోషికం: రూ. 1.5 కోట్ల దాకా రకుల్ (25) : ఇప్పుడు వీస్తున్న గాలి... అడుగుపెట్టిన ఆరేళ్ళలోనే అందరినీ ఆకర్షించిన పంజాబీ పిల్ల. ప్రస్తుతం చేతిలో 6 సిన్మాలతో నంబర్ వన్ హీరోయిన్ రేసులో గట్టి పోటీదారు. పెదవులపై చిరునవ్వు, ప్రొఫెషనలిజమ్ ఆభరణాలు. ఫస్ట్ : తెలుగులో ‘కెరటం’ (2011) బెస్ట్ : ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లౌక్యం’, ‘పండగ చేస్కో’ ,‘సరైనోడు’ స్పెషాల్టీ : గోల్ఫ్ ఆడడంలోనే కాదు... అనుకున్న గోల్ సాధించే ఏకాగ్రతా ఉన్న నవతరం అమ్మాయి. ఇప్పుడు యువ హీరోలు అందరూ కోరి తెచ్చుకుంటున్న కొత్త హీరోయిన్. బాగా తెలుగు మాట్లాడడమే కాదు... చిన్న ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’లో తెలుగు డబ్బింగ్ కూడా చెప్పిన అమ్మాయి. మూడు నెలల క్రితమే గచ్చిబౌలీలో సొంతంగా జిమ్ (‘ఎఫ్45’) కూడా పెట్టారు. ఇల్లు కొనుక్కొని, అచ్చంగా ‘ఈడ’ పిల్లగా మారిన ‘ఆడ’ పిల్ల. పారితోషికం: రూ. 1 - 1.25 కోట్లు (బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా సినిమాకు ఏకంగా రూ. 1.5 కోట్లు) శ్రుతీహాసన్ (30) : అందం... అభినయాల సమశ్రుతి ఆళ్వార్‌పేట నుంచి ఆంధ్రదేశం దాకా పరుచుకున్న వెండివెన్నెల వెలుగు - ఈ చెన్నపట్నం చిన్నది. తల్లి (సారిక), తండ్రుల సినిమా జీన్స బాల్యంలోనే తెర మీదకు తెచ్చాయి. కాలక్రమంలో తండ్రి (కమల్‌హాసన్) చాటు బిడ్డలా కాక... సొంత కాళ్ళపై నిలబడిన నవ తరం అమ్మాయి. అందాల ప్రదర్శనకు వెనుకాడని ప్రొఫెషనల్. తెలుగు, తమిళ, హిందీ సిన్మాలు, ఆల్బమ్ లు, పాటలు, ఫ్రెండ్స, పార్టీలు - అన్నింటితో బిజీ బిజీ. ఫస్ట్ : తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ (2011) బెస్ట్ : ‘గబ్బర్‌సింగ్’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’ స్పెషాల్టీ : సాధారణ సినీ సంప్రదాయానికి భిన్నంగా హీరో కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్. మొదట్లో చేసిన సినిమాలేవీ ఆడనప్పుడు ‘ఐరన్‌లెగ్’ అన్న నోళ్ళే ఇప్పుడీ అమ్మడిని ‘గోల్డెన్ లెగ్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. శ్రుతి ముఖంలో మాత్రం చెరగని నవ్వే. పవన్ కల్యాణ్, మహేశ్, రామ్ చరణ్, బన్నీ - పెద్ద హీరో ఎవరైనా సరే శ్రుతి డేట్స్ ఖాళీ ఉంటే, ఆమెకే ఓటు. తెలుగు బాగా మాట్లాడడం, భలేగా పాడడం శ్రుతీహాసన్‌కు ఉన్న ప్లస్. మనవాళ్ళు మెచ్చే దక్షిణాది సహజ సౌందర్యం ఆమెకున్న ఎడ్వాంటేజ్. పారితోషికం : రూ. 1.25 కోట్లు నిత్యామీనన్ (28) : హుందాతనానికి చిరునామా కర్ణాటకలో పెరిగిన ఈ మలయాళీ అమ్మాయి ఇవాళ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలన్నిట్లో క్రేజీ స్టార్. పదేళ్ళ వయసులోనే బాలనటిగా చేసినా, చదివిన డిగ్రీకి తగ్గట్లే జర్నలిస్ట్ అవుదామనుకొన్నారు. తీరా కన్నడ, మలయాళ చిత్రాలతో హీరోయినయ్యారు. తొలి సినిమాతోనే అందరూ ఫ్లాటై పోయారు. నిత్య హుందాతనం, మల్టీ టాలెంట్ పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్నీ అబ్బురపరిచాయి. ప్రతి ఒక్కరూ నిత్యను ప్రేమించేలా చేశాయి. ఫస్ట్ : తెలుగులో నందినీరెడ్డి దర్శకత్వంలో ‘అలా మొదలైంది’ (2011) బెస్ట్ : ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘ఓకే బంగారం’ స్పెషాల్టీ : జీవితంలోనైనా, కెరీర్‌లోనైనా కొత్త సవాళ్ళంటే కళ్ళు చక్రాల్లా తిప్పుతూ ఉత్సాహపడిపోతారు. స్క్రిప్ట్, పాత్ర నచ్చితే అతిథి పాత్ర (‘జబర్దస్త్’), చిన్న హీరో అయినా రెడీ. లేదంటే, ఎంత పెద్ద ప్రాజెక్ట్‌కైనా ‘నో’ చెప్పేస్తారు. పుట్టు మలయాళీ అన్న మాటే కానీ, నిత్యకు దక్షిణాది భాషలన్నీ కొట్టినపిండి. అచ్చ తెలుగమ్మాయిల కన్నా అందంగా తెలుగు మాట్లాడతారు. ఎంత బాగా మాట్లాడతారో అంతకన్నా బాగా పాటా పాడతారు. చలాకీతనం, హుందాతనం కలగలిసిన నిత్యను మనమ్మాయే అనేది అందుకే. పారితోషికం : రూ. 40 నుంచి 75 లక్షల మధ్య (సినిమా స్థాయి, పాత్రను బట్టి) రాశీఖన్నా (25) : యువ హీరోలకు రాశి... ఢిల్లీలో చదువుకున్న ఈ పంజాబీ అమ్మాయి ముచ్చటగా మూడేళ్ళలోనే తెలుగునాట జెండా పాతింది. యువ హీరోలకు, మీడియవ్‌ు రేంజ్ సినిమాలకూ బెస్ట్ ఆప్షన్ అయింది. ఉత్తరాది సౌందర్యం, సోషల్‌గా ఫ్రీగా ఉండే ప్రవర్తన బాగానే అవకాశాలు తెస్తోంది. ఫస్ట్ : తెలుగులో ‘ఊహలు గుసగుసలాడె’ (2014) బెస్ట్ : ‘ఊహలు గుసగుసలాడె’, ‘జిల్’, ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’ స్పెషాల్టీ : హైదరాబాద్ వాతావరణం, సినీ జనం తెగ నచ్చేసిన రాశీఖన్నా ఇప్పుడు హైదరాబాద్‌లోనే మకాం పెట్టేశారు. ఇక్కడే మణికొండలో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. గోపీచంద్, రావ్‌ు, సాయిధరవ్ుతేజ్ లాంటి యువ హీరోలకు ఆమె కలిసొచ్చిన చాయిస్. పారితోషికం: రూ. 50 లక్షల పైగా. లావణ్యా త్రిపాఠీ (25) : సొట్టబుగ్గల సుందరి ఉత్తరప్రదేశ్‌లో పుట్టి, ఉత్తరాఖండ్‌లో పెరిగి, ‘మిస్ ఉత్తరాఖండ్’గా నిలిచి, మోడలింగ్ ర్యాంప్ నుంచి టీవీ షోల మీదుగా వెండితెర పైకి నడిచొచ్చిన నటి.హిందీ టీవీ సిరీస్ ‘ష్...కోయీ హై’తో నటిగా పరిచయమయ్యారు. తెలుగుతోనే సినీ రంగప్రవేశం. ఫస్ట్ : ‘అందాలరాక్షసి’ (2012) బెస్ట్ : ‘‘అందాల రాక్షసి’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ స్పెషాల్టీ : చేస్తున్న సంస్థ, హీరోను బట్టి అవసరమైతే అతిథి పాత్రలకు కూడా సిద్ధమనే పట్టు విడుపులున్న నవతరం నాయిక ( నాగార్జున ‘మనం’ (2014)లో చేసిన గెస్ట్ రోల్ గుర్తుందిగా). స్నేహశీలత, కెమేరా ముందు బిడియం లేకపోవడం లావణ్యను పరిశ్రమలో నలుగురి ఎదుట స్పెషల్‌గా నిలబెడుతున్నాయి. టావ్ుబాయ్ స్టయిల్, సొట్టబుగ్గల సౌందర్యం ఆమెని సన్నిహితం చేస్తున్నాయి. ‘హైదరాబాద్ నా రెండో ఇల్లు’ అంటున్న లావణ్య ఇప్పుడు కొత్త దర్శక, నిర్మాతలకు మరో చాయిస్. పారితోషికం : రూ. 50 లక్షల పైగా. క్యాథరిన్ (26) : సోగకళ్ళ అమ్మాయి... ఈ మలయాళీ రోమన్ సిరియన్ క్యాథలిక్ అమ్మాయి పుట్టింది దుబాయ్‌లో కానీ, దుమ్ము రేపుతోంది మాత్రం దక్షిణాది అంతా. బెంగుళూరులో పెరిగిన ఈ అమ్మాయికి పాట, ఆట, పియానో - మనసు పెడితే రానిదేదీ లేదు. 14 ఏళ్ళ వయసుకే మోడల్‌గా తొలి అడుగులు వేసి, ప్రసాద్ బిడప్ప లాంటి ప్రసిద్ధుల ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు. బోలెడన్ని యాడ్స చేశారు. కన్నడంలో మొదలుపెట్టి, మలయాళం మీదుగా తెలుగులోకి దూసుకు వస్తున్నారు. ఫస్ట్ : తెలుగులో ‘చమ్మక్ చల్లో’ (2013) బెస్ట్ : ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రుద్రమ దేవి’, ‘సరైనోడు’ స్పెషాల్టీ : హీరోయిన్‌గానైనా, స్పెషల్ ఎప్పీయరెన్సకైనా రెడీ అనడం. పారితోషికం: రూ. 25 నుంచి 30 లక్షల దాకా. 'తమిళ కోటలో... తెలుగు బావుటా! కన్నాంబ... సావిత్రి... జమున... శారద... వాణిశ్రీ... జయప్రద... ఇలా ఎందరో నాయికల్ని పరాయిభాషలకు ఎగుమతి చేసిన ఘనత మనది. కానీ, ఇప్పుడు మన తెరపై కనిపిస్తున్నదంతా ఉత్తరాది భామలు! తమిళ పొన్నులు! మలయాళ కుట్టీలు! మనవాళ్ళు లేరా? ఉన్నా, వాళ్ళకు చాన్సుల్లేవా? ఇది పెద్ద చర్చే! అమ్మాయిల్ని హీరోయిన్లుగా ప్రోత్సహించని తల్లితండ్రుల దగ్గర నుంచి నటవారసులుగా కొడుకుల్నే తప్ప కూతుళ్ళను ప్రోత్సహించని టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీల దాకా తవ్వితీస్తే - తెలుగు సమాజంలోని ఈ స్నేహరహిత వాతావరణానికి సవాలక్ష కారణాలున్నాయి. ఈ పరిమితుల మధ్యనే అంజలి, స్వాతీ రెడ్డి, వేద, మధుశాలిని లాంటి కొద్దిమంది తెలుగ మ్మాయిలు మాత్రం అడపాదడపా మెరుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే, మన తెలుగమ్మాయిల్లో కొందరు హీరోయిన్లుగా తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లో మంచి అవకాశాలు దక్కించుకుం టున్నారు. రచ్చ గెలిచాకనైనా, ఇంట గెలుస్తామనే నమ్మకంతో అక్కడి సినిమాల్లో పాత్రలకు జీవం పోస్తున్నారు. అడపా దడపా తెలుగులో మెరుస్తున్న రాజోలు అమ్మాయి అంజలి ఇప్పుడు దాదాపు అరవ హీరోయినే. ఎక్కువ సిన్మాలు అక్కడే చేస్తున్నారు. ‘అష్టాచమ్మా’, ‘కార్తికేయ’ లాంటి హిట్లున్నా, ఇక్కడ అవకాశాలు తక్కువైన స్వాతీరెడ్డి తమిళ, మలయాళాల్లో మంచి పాత్రలకు కేరాఫ్ అడ్రస్. అక్కడి ప్రేక్షకులకు సుపరిచితం. ఆ భాషల్లోనూ బాగా మాట్లాడేస్తున్నారు. మదనపల్లె అమ్మాయి బిందుమాధవి మొదలెట్టింది తెలుగులో అయినా, స్థిరపడింది తమిళంలోనే! ఈ నేటివ్ బ్యూటీ ప్రతిభను తమిళులే గుర్తించారు. ‘బస్‌స్టాప్’, ‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ల్లో అభినయంతో ఆకట్టుకున్న ఒకప్పటి బాల నటి శ్రీదివ్య కూడా ఇప్పుడు ఇక్కడి కన్నా తమిళంలోనే ఫేమస్. మూడేళ్ళ క్రితం మొదలుపెట్టి తాజా ‘పెన్సిల్’ దాకా తమిళంలో చాలా ప్రయాణమే చేశారు. భాష, ప్రాంతం హద్దులు చెరిపేసి, రచ్చ గెలిచిన ఈ తెలుగమ్మాయిలకు ఇంట కూడా సముచిత స్థానం ఇవ్వాల్సింది మనమేగా! అప్పుడెప్పుడో ఏయన్నార్ కుటుంబం నుంచి ఆయన మనుమరాలు సుప్రియ, కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన కూతురు మంజుల కెమేరా ముందుకొచ్చి, వచ్చినంత వేగంగానే వెనక్కీ వెళ్ళిపోయారు. తాజాగా ‘మెగా’ ఫ్యామిలీ నుంచి చిరంజీవి సోదరుడైన నాగబాబు కుమార్తె నీహారిక కొణిదెల నాయికగా వస్తున్నారు. ఒత్తిళ్ళనూ, బంధువుల అభ్యంతరాలనూ పక్కనపెట్టి, ఇంట్లో వాళ్ళను సైతం ఒప్పించి మరీ, హీరోయిన్గా ప్రూవ్ చేసుకొనేందుకు ‘ఒక మనసు’ సినిమాతో తొలి ప్రయత్నం చేస్తున్నారు.