breaking news
Om Puri death
-
ఓంపురి మృతిపై షాకింగ్ నిజాలు!
ముంబై: విలక్షణ నటుడు ఓం పురి(66) మరణం వెనక కొన్ని అనుమానాలు లేకపోలేదు. ఆయనది సహజ మరణంలా కనిపిస్తున్నా.. ఈ కోణంలో పూర్తిస్థాయిగా నమ్మకం లేదని పోలీసులు అంటున్నారు. ఓంపురికి మిత్రుడు, డ్రైవర్ అయిన ఖాలిద్ కిద్వావ్ పోలీసులకు తెలిపిన వివరాలతో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ముంబైలోని తన నివాసంలో గత శుక్రవారం(జనవరి 6న) ఉదయం గుండెపోటుకు గురై ఓంపురి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే వంటగదిలో నేలపై కుప్పకూలిపోయిన ఆయనకు గాయం కావడం.. ఓంపురి మిత్రుడు చెప్పిన వివరాలకు కాస్త లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓం పురి చనిపోయిన ముందురోజు(గురువారం) ఏం జరిగిందంటే.. తన కుమారుడు ఇషాన్‌ను కలిసుకునేందుకు త్రిశూల్ బిల్డింగ్‌కు ఆయన వెళ్లారు. తన మాజీ భార్య నందితతో కలిసి కుమారుడు ఇషాన్ ఓ పార్టీకి వెళ్లినట్లు కొద్దిసేపటి తర్వాత ఓంపురికి తెలిసింది. భార్య నందితకు ఫోన్ చేసి కుమారుడితో సహా త్వరగా వచ్చేయమని చెప్పాడు. ఈ క్రమంలో వీరిమధ్య ఫోన్లో కాస్త వాగ్వివాదం జరిగిందని ఓంపురి మిత్రుడు కిద్వాయ్ తెలిపాడు. దాదాపు గంటసేపు వేచిచూసినా వారు రాలేదు. ఆ తర్వాత కారులో కూర్చుని కొద్దిసేపు మద్యం సేవించి ఓంపురితో సహా తాను వెళ్లిపోయానని చెప్పాడు. ఆ అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు.. కానీ తెల్లవారేసరికి మిత్రుడి మరణవార్త వినాల్సి వచ్చిందని నటుడి డ్రైవర్ కమ్ ఫ్రెండ్ ఖాలిద్ కిద్వావ్ వివరించారు. కాగా, ప్రమాదం వల్ల ఓం పురి మరణించినట్లు(ఏడీఆర్) పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
ఆ సినిమాకు ఆస్కార్ రావల్సింది...
న్యూఢిల్లీ: మొహం నిండా మచ్చలు. కళ్లలో నుంచి దూసుకొస్తున్న తీక్షణమైన చూపులు. కరకు కంఠం. చెమట కారుతున్న అంగీ. రోడ్డు పక్కన లాగుడు రిక్షాను ఆపి, ఆ పక్కనే ఉన్న బండిపై టీ తాగుతున్న వ్యక్తి. అచ్చం 1980వ దశకంలో మరో సినిమాలకు ప్రాణం పోసి ప్రపంచ ఖ్యాతి నార్జించిన ఓంపురిలా ఉన్నాడు. ఆ వ్యక్తి గురించే ఆ పక్కనే ఉన్న ఓ ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారు. ‘అరే అచ్చం ఓంపురిలాగే ఉన్నాడు కదా!’ అంటూ ఓ మిత్రుడు తోటి మిత్రుడిని ప్రశ్నించగా, ‘అవును కొంత అలాగే కనిపిస్తున్నాడుగానీ, ఓంపురి కలకత్తాకు ఎందుకు వస్తాడు? వస్తే, ఇలా రోడ్డు పక్కన మనలాగా టీ ఎందుకు తాగుతాడు, పైగా లాగుడు రిక్షాతో ఎందుకు కనిపిస్తాడు?!’ అని ఆ మిత్రుడు వ్యాఖ్యానించారు. ఈ మాటలను శ్రద్ధగా విన్న ఆ వ్యక్తి ‘అవును నేను ఓంపురినే’ అంటూ ఆ మిత్రుల సందేహాన్ని తీర్చేందుకు ప్రయత్నించారు. అయితే నమ్మనట్లుగానే ఆ ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి కదిలారు. ‘బేచార, ఎంతటి వాడు ఎలా అయిపోయాడు. ఆక్రోష్, అర్ధసత్య, అల్బర్ట్ పింటో కో గుస్సా క్యోం ఆతా హై, జానేబీ దో యారో సినిమాలతో పాటు తమస్ లాంటి టీవీ సీరియళ్లను తీసిన ఓంపురి ఇప్పుడు కోల్‌కతాలో లాగుడు బండి లాగుతున్నాడు. ఎంతటి ఖర్మ!’ అంటూ ఆ టీ బండి వ్యక్తి తన కస్టమర్లతో వ్యాఖ్యానిస్తుండగా ఓంపురి తనలో తాను నవ్వుకుంటూ ఆ లాగుడు రిక్షాను పట్టుకొని తన మానాన తాను వచ్చేశాడు. 1992లో విడుదలైన ‘సిటీ ఆఫ్ జాయ్’ ఇంగ్లీష్ సినిమా షూటింగ్ కోసం కోల్‌కతా వచ్చిన ఓంపురి లాగుడు రిక్షా నేర్చుకోవడం కోసం వారం రోజుల పాటు కోల్‌కతా వీధుల్లో ఇలా కసరత్తు చేస్తుండగా ఓ రోజు ఆయనకు ఈ అనుభవం ఎదురైంది. దాని గురించి ఆయన భార్య నందితా పురి, ఓంపురి ఆత్మకథలో రాశారు. రోలాండ్ జఫే దర్శకత్వం వహించిన ఈ ‘సిటీ ఆఫ్ జాయ్’ సినిమాలో ఓంపురితోపాటు ప్యాట్రిక్ సాయజ్ అనే హాలివుడ్ నటుడు కూడా ప్రధాన పాత్రలో నటించారు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా నడవకపోయినా అప్పుడు ‘న్యూయార్స్ టైమ్స్’ పత్రిక మాత్రం సినిమాలో ఓంపురి నటన గురించి విశేషంగా ప్రశంసించింది. ‘ఈ ఏడాది ఎవరికైనా ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సి వస్తే మొట్టమొదట ఓంపురికి ఇవ్వాలి’ అని ఆ పత్రిక కొనియాడగా, ఓంపురికి ఆస్కార్ వచ్చి తీరుతుందని తోటి నటుడు ప్యాట్రిక్ సాయజ్ నాడు విలేకరుల సమావేశం వ్యాఖ్యానించారు. ఆస్కార్ అవార్డు రాకపోయినా కనీసం నామినేషన్ వస్తుందని భావించానని ఆ తర్వాత ఓంపురి ఓ సందర్భంలో చెప్పారు. ఆతర్వాత ‘మై సన్ ఆఫ్ ఫెనటిక్, ఈస్ట్ ఈజ్ ఈస్ట్, శ్యామ్ అండ్ మీ’ లాంటి హాలివుడ్ చిత్రాల్లో నటించారు. ‘ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయే మహానటుడు ఓంపురి, అలాంటి నటులు మళ్లీ పుట్టడం మహా అరదు’ అని బాలివుడ్ దర్శకుడు కుందన్ షా వ్యాఖ్యానించారు.