breaking news
noor jahan khatun
-
విషాదం: షారుక్ సోదరి మృతి
ముంబై : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వరుసకు సోదరి అయిన నూర్ జెహాన్ (52) మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. జెహాన్ తండ్రి షారుక్‌కు పినతండ్రి అవుతారు. నూర్ జెహాన్ పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్ సమీపంలోని మొహల్లా షా వాలి కతాల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. కొంతకాలంగా జెహాన్ నోటి క్యాన్సర్‌తో బాధపడుతోందని ఆమె భర్త ఆసిఫ్ బుర్హాన్ పేర్కొన్నారు. నూర్ మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు మన్సూర్ అహ్మద్ సైతం ధృవీకరించారు. అదే విధంగా షారుక్ కుటుంబంతో నూర్ జెహాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి భారత్‌లో కూడా చాలామంది బంధువులు ఉన్నారు. కింగ్‌ఖాన్ తన తల్లిదండ్రులతో కలిసి పెషావర్‌లోని నూర్ కుటుంబాన్ని రెండుసార్లు(1997,2011) సందర్శించారు. నూర్ మరణంతో షారుఖ్, నూర్ జెహాన్తో కలిసి దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా పాకిస్తాన్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జెహాన్ జిల్లా, పట్టణ కౌన్సిలర్‌గా పనిచేశారు. అనంతరం జూలై 2018 సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేసి తరువాత ఉపసంహరించుకున్నారు. కాగా నటుడితో పాటు జీరో సినిమాతో షారుఖ్ ఖాన్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బార్డ్ ఆఫ్ బ్లడ్ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ను నిర్మిస్తుంది. ఇక షారుక్ తన నెక్ట్స్ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీతో చేయనున్నారని వార్తలు వెలువడగా, షారుక్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారీటీ ఇవ్వలేదు. -
ఆస్తి కోసమేనా...
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట వద్ద మంగళవారం రాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఆస్తి కోసం ఆమెను అయిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డీఎస్పీ అమర్నాథ్నాయుడు, ఇన్చార్జి సీఐ దైవప్రసాద్ తెలిపిన మేరకు.. శిరివెళ్ల మండలం మహదేవుపురం గ్రామానికి చెందిన హుసేన్‌సా, నూర్జహాన్‌ఖాతున్(52) దంపతులు దాదాపు 30 ఏళ్ల క్రితం నంద్యాలకు కట్టుబట్టలతో వలస వచ్చారు. అయ్యలూరు మెట్ట సెంటర్లో హోటల్ ఏర్పాటు చేసుకొని బాగా కూడబెట్టారు. సంతానం లేకపోవడంతో భర్తకు మరో మహిళ బీబీతో పునర్వివాహం చేసింది. అయితే ఏడాదికే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె పుట్టింటికి చేరుకుంది. ఆ తర్వాత హుసేన్ అనే బాలుడిని నూర్జహాన్‌ఖాతున్ దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసింది. తల్లి ప్రేమను పంచడంతో పాటు ఓ ఇంటి వాడిని చేసింది. కొడుకు పుట్టిన తర్వాత హుసేన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కోడలు పర్వీన్‌కు పునర్వివాహం చేసి కొడుకును తనే పెంచుకుంటూ ఆదర్శంగా నిలిచింది. దాదాపు ఏడాది క్రితం అనారోగ్యంతో భర్త హుసేన్‌సా మృతి చెందాడు. వయసు మీద పడుతుండటంతో ఓ తోడు ఉంటే మేలనుకున్న ఆమె.. దత్తపుత్రుడి సమీప బంధువు, భార్యను కోల్పోయిన షేక్ హుసేన్ఖాన్ను 8 నెలల క్రితం వివాహమాడింది. ఆస్తి కోసమే అంతమొందించారా? నూర్జహాన్, మొదటి భర్త హుసేన్సాల పేరిట అయ్యలూరు మెట్టలో రెండు షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెండు ఇళ్లు, గంగవరంలో ఆరు ఎకరాల పొలం ఉంది. వీటి విలువ దాదాపు రూ.3కోట్లపై మాటే. హుసేన్‌సా మృతి చెందాక ఆస్తి నూర్జహాన్ఖాతున్కు దక్కింది. అయితే హుసేన్‌సా బంధువులు తమకు ఆస్తిలో వాటా ఇవ్వాలని పట్టుబట్టారు. చివరకు విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. సివిల్ కేసు కావడంతో పోలీసులు సర్దిచెప్పారు. అప్పటి నుంచి వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆమె దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగంతకులు ఆమె గొంతు కోసి పరారయ్యారు. పొలం పనులు పూర్తి చేసుకుని రాత్రికి ఇల్లు చేరుకున్న హుసేన్ఖాన్ జరిగిన ఘోరాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అతని ఫిర్యాదు మేరకు డీఎస్పీ అమర్నాథ్నాయుడు, ఇన్చార్జి సీఐ దైవప్రసాద్, ఎస్ఐలు రాముడు, వెంకటసుబ్బయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆస్తి కోసమే నూర్జహాన్ మొదటి భర్త బంధువులు చంపి ఉంటారని హుసేన్ఖాన్ అనుమానిస్తున్నాడు.