పక్క‘దారి’ పనులు..!
∙తలుపుమ్మలోవలో చిరుద్యోగుల ఇష్టారాజ్యం
∙ఈఓకు తెలియకుండా రూ.14 లక్షల పనులు ప్రారంభం
సాక్షి ప్రతినిధి–కాకినాడ :
తలుపులమ్మలోవ దేవస్థానంలో కొండపైకి వెళ్లే రహదారి అభివృద్ధి పనులు హడావుడిగా సాగుతున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహిస్తున్నారు. యథావిధిగా ఆలయ ఈఓ తన విధులు నిర్వహించడానికి కొండపైకి వెళ్తుండగా అక్కడ జరుగుతున్న పనులు చూసి ఆశ్చర్యపోయారు. తనకు తెలియకుండా ఈ పనులు ఎవరు చేస్తున్నారంటూ అక్కడి పనివారిని అడగ్గా మీరే చేయమన్నారని చెబితే చేస్తున్నామన్న సమాధానం విని ఆయన అవాక్కయ్యారు. ఇదంతా ఎలా జరిగిందని ఆరా తీస్తే తనకు తెలియకుండా తనతో సంతకం చేయించుకుని మరీ ఆ పనులు చేపట్టినట్లు గుర్తించిన ఆయన సిబ్బంది నిర్వాకానికి తలపట్టుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే తలుపులమ్మలోవ దేవస్థానంలో రాజకీయ అండతో పాతికేళ్లుగా పాతుకుపోయిన చిరుద్యోగులు ఉన్నతాధికారులకు తెలియకుండా రూ.లక్షల విలువైన పనులు నిర్వహిస్తూ నిధులు పక్కదారిపట్టిస్తున్నారు. లోవ దేవస్థానం కొండకు వెళ్లే ఘాట్‌రోడ్డు విస్తరణ, అభివృద్ధి పేరుతో రూ.14 లక్షల విలువైన పనులను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటికే 25 ట్రాక్టర్ల వరకు మట్టిని తోలేసి పనులు నిర్వహిస్తున్నారు. ఆలయానికి సంబంధించి ఏ పని నిర్వహించాలన్నా ఈఓ ఆయా పనుల ప్రపోజల్స్‌ను ఇంజనీరింగ్ సిబ్బందికి పంపించాల్సి ఉంది. కానీ ఈఓకు సంబంధం లేకుండా ఈ పనులను ఔట్సోర్సింగ్ ఉద్యోగి కాంట్రాక్టరు వద్ద డబ్బు తీసుకుని నేరుగా పనులు అప్పగించేశాడు. రాజకీయ అండతో ఆలయంలో చక్రం తిప్పుతున్న సదరు ఉద్యోగి ఆలయ ఇతర సిబ్బందిని తన గుప్పెట్లో పెట్టుకుని ఈఓ పరోక్షంలో ఈ పనులు చేపట్టాడు. ఈ పనులకు అనుమతులు తీసుకోవడానికి ఆ ఉద్యోగి ఈఓకు తెలియకుండా ఆయన చేతే ఇతర పనుల్లో భాగంగా సంతకాలు తీసుకుని ఈపనులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఈ విషయమై సదరు ఉద్యోగిని ఈఓ నిలదీయడంతో రాజకీయ నాయకులతో ఈఓపై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఆలయ ఈఓను వివరణ కోరగా రహదారి నిర్మాణం విషయం తన దృష్టికి వచ్చిందని విచారణ జరుపుతున్నామని తెలిపారు.