NIIMS hospital
-
మంచినీళ్లు అడిగితే పురుగుల మందు ఇచ్చారు!
నాగర్‌కర్నూల్ రూరల్/తెలకపల్లి: ప్రియురాలి కోసం వచ్చిన యువకుడిని పట్టుకుని ఎందుకొచ్చావంటూ నిలదీసి దాడి చేశారు. దీంతో అక్కడ్నుంచి దెబ్బలతో వచ్చిన యువకుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చగా పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించగా.. ప్రణాళిక ప్రకారమే తమ కొడుకును చంపేశారని తలిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈనెల 5న జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలోని దాదామోని శివ(18) కొంతకాలంగా అచ్చంపేట మండలం చవుట పల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కాగా, ఈనెల 5న తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లిలోని చిన్నమ్మ ఇంటికి ప్రియురాలు వెళ్లింది. ప్రియురాలి కోసం శివ అదే రాత్రి ఇంటికి వెళ్లాడు.దీంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ‘మా అమ్మాయి వద్దకు మళ్లీ ఎందుకొచ్చా వు..’ అంటూ దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ పడి శివ అక్కడ్నుంచి ఇంటికి రాగా అతడి కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ లోని జనరల్ ఆస్పత్రికి తరలిం చారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసు కెళ్లారు. అక్కడే చికిత్స పొందు తూ ఈనెల 9న మృతి చెందాడు. ఈ ఘటనపై శనివారం అతని తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఎస్ఐపై చర్య తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు శివను పథకం ప్రకారమే ప్రియురాలి బంధువులు హత్య చేశారని యువకుడి తల్లిదండ్రులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అంతటి నాగన్న, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ఆరోపించారు. న్యాయం చేయాలని తెలకపల్లి పోలీసులను ఆశ్రయించిన యువకుడి తల్లిదండ్రులను అక్కడి ఎస్ఐ బెదిరించారని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎస్పీ మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. దాడి చేశారని కేసు పెట్టేందుకు వెళ్లిన శివపైనే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానని ఎస్ఐ బెదిరించినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాడిలో దెబ్బలకు తాళలేక మంచినీళ్లు ఇవ్వాలని కోరిన శివకు ప్రియురాలి బంధువులు పురుగుమందు తాగించారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకుడు పృథ్వీరాజ్, జనసేన యూత్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా లక్ష్మణ్‌గౌడ్, శివ కుటుంబ సభ్యులు, తెలకపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ రేంజ్లో నిమ్స్
లక్డీకాపూల్ (హైదరాబాద్) : నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలను అందించేందుకు నిమ్స్ ఆస్పత్రిలో మరిన్ని మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రూ.154 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నట్టు వెల్లడించారు. రూ. 18 కోట్ల విలువైన రోబోటిక్ సర్జరీ వైద్య పరికరాన్ని సమకూర్చాల్సిందిగా ఆంకాలజీ విభాగం వైద్యులు కోరారని, ఆ దిశగా చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. హై రిస్క్ గర్భిణుల కోసం ప్రత్యేక గైనిక్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు 200 పడకలతో వార్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో మరో 200 ఐసీయూ పడకలు, 120 వెంటిలేటర్లను సమకూరుస్తామన్నారు. దీంతో ఐసీయూ పడకలు 355కు, వెంటిలేటర్లు 209కు చేరుకుంటాయని చెప్పారు. మంగళవారం నిమ్స్‌లో రూ. 12 కోట్లతో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల అధునిక వైద్య పరికరాలు, సరికొత్త పరీక్ష కేంద్రాలను ఆయన ప్రారంభించారు. నిమ్స్ ఆస్పత్రిపై ఆయా విభాగాధిపతులతో సమీక్ష చేశారు. నగరంలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిమ్స్‌లో ఇప్పటికే 85 శాతం మేర రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని, 15 శాతం మేరకే పేయింగ్ రోగులు చికిత్స పొందుతున్నారని మంత్రి చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు తీసిపోని విధంగా అవయువ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ఒకేసారి 8 మందికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స చేసే సామర్థ్యం నిమ్స్ సొంతం చేసుకుందని అన్నారు. బోన్ లోపాలు ముందే తెలుసుకునేందుకు బోన్ డెన్సిటోమీటర్, జన్యు లోపాలపై సరైన వైద్యం పొందేందుకు జెనెటిక్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారందరికి ఆరోగ్య శ్రీ భోజనాన్ని వడ్డించాలని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. మనోహర్‌ను ఆదేశించారు. రోగుల సహాయకులకూ రూ. 5 భోజనం అందుబాటులోకి తేవాలన్నారు. నగరంలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, టిమ్స్ పేరుతో వాటిని నిర్వహిస్తామని తెలిపారు. 100% వ్యాక్సినేషన్‌పై సెలెబ్రిటీలు ప్రచారం చేయాలి రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ను సాధించేందుకు సినిమా, క్రీడా, రాజకీయ మ్రుఖులు ప్రచారం చేయాలని మంత్రి కోరారు. ఒమిక్రాన్ నేపథ్యంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రోజూ 30 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని, వాటిని లక్షకు పెంచనున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతానికి 94 శాతం మంది మొదటి డోస్, 48 శాతం రెండో డోస్ తీసుకున్నారని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి 70 లక్షల మందికి పైగా రెండో డోస్ తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ప్రతి బెడ్‌కూ ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తామని, ఇప్పటికే 25 వేల బెడ్స్‌కు ఆక్సిజన్ సదుపాయం ఉందని చెప్పారు. మరో 2 వేల బెడ్స్‌కు వారంలో ఈ సదుపాయం కల్పించనున్నామన్నారు. -
తెలంగాణలో ప్రతి గడపలో టెస్టులు: ఈటల
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌ను తెలంగాణలోనే అత్యున్నత ఆస్పత్రిగా తీర్చిదిద్దడంలోనూ ముందున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో మాత్రమే ఉన్న మాలిక్యూలర్ ల్యాబ్‌ను స్టెమ్ సెల్స్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడే వారి కోసం ఇక్కడ ప్రారంభించామన్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడే వారికి ఇక్కడ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో కెల్లా ఉన్నత వసతులు నిమ్స్‌లో ఉన్నాయని చెప్పారు. కోవిడ్ ప్రభావం తగ్గుతున్ననేపథ్యంలో అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకోని వస్తున్నామని చెప్పారు. ఐసీఎంఆర్ చెప్పిన అన్ని మార్గదర్శకాలను పాటించి, ప్లాస్మా థెరపీ పేరిట చేసిన దోపిడిని అరికట్టమన్నారు. గతంలో వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా ఉండేదో కరోనాతో కూడా అలానే ఉందని, తెలంగాణలో ప్రతి గడపలో టెస్టులు చేస్తున్నామని చెప్పారు. నిమ్స్‌లో ఓపీ పెంచేందుకు కృషి చేస్తున్నామని కొత్త అవుట్ పేషెంట్ బ్లాక్ కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
కొద్దిగా మెరుగుపడిన జగన్ ఆరోగ్యం
-
కొద్దిగా మెరుగుపడిన జగన్ ఆరోగ్యం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం ఆదివారం సాయంత్రానికి కొద్దిగా కుదుట పడింది. ఏడు రోజుల దీక్షను భగ్నం చేస్తూ, శనివారం ఫ్లూయిడ్స్ ఎక్కించిన నిమ్స్ వైద్యులు ఆదివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిమ్స్ వైద్య బృందం డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ శ్రీభూషణ్‌రాజులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చక్కెర నిల్వలు కొద్దిగా పెరిగాయని, రక్తపోటు(బీపీ) కూడా నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. కీటోన్స్ కూడా తగ్గుముఖం పట్టాయని, అయితే సోడియం నిల్వలు ఇంకా రికవరీ కావాల్సి ఉందని తెలిపారు. ఏడు రోజులుగా దీక్ష చేయడంవల్ల శరీరంలో ఉన్న కొవ్వులు పూర్తిగా కరిగిపోయాయని, ఈ కారణంగానే కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. జగన్ ఇప్పటికీ నీరసంగానే ఉన్నారని, సాధారణ స్థితికి చేరుకోవాలంటే బలమైన ఆహారం తీసుకోవాల్సి ఉందని సూచించారు. ఆదివారం కూడా జగన్‌కు అవసరమైన మేరకు ఫ్లూయిడ్స్ ఎక్కించామని, రానున్న రెండ్రోజులు కూడా ఈ తరహా ఫ్లూయిడ్స్ ఇస్తామని తెలిపారు. ఫ్లూయిడ్స్‌తో పాటు ఆయన ఏదైనా పళ్ల రసాలు లేదా ఆహారం తీసుకుంటే మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు. జగన్ ఆదివారం కొద్దిగా పుచ్చకాయ రసం తీసుకున్నట్టు వైద్యులు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం కుదుటపడేవరకూ వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని నిమ్స్ వైద్య బృందం తెలిపింది. నిమ్స్ వైద్య బృందంలో ప్రముఖులైన డాక్టర్ శేషగిరిరావు (కార్డియాలజీ), డాక్టర్ శ్రీభూషణ్‌రాజు (నెఫ్రాలజీ), డాక్టర్ వైఎస్ఎన్ రాజు (జనరల్ మెడిసిన్)లు ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. నిమ్స్‌తరహా ఆస్పత్రి జిల్లాకొకటి ఉండాలి: జగన్ తనలాగే సాధారణ పేషెంట్లకూ నిమ్స్ తరహా సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యులతో అన్నారు. ఆదివారం జగన్‌ను పర్యవేక్షిస్తున్న వైద్యులతో ఆయన కొద్దిసేపు మాట్లాడినట్టు తెలిసింది. సుదూర ప్రాంతాల నుంచి అందరూ నిమ్స్‌కు రాలేరని, నిమ్స్ స్థాయి ఆస్పత్రులను జిల్లాకొకటి తీర్చిదిద్దితే లక్షలాది రోగులకు ప్రయోజనం ఉంటుందని సూచించారు. దీంతోపాటు నిమ్స్‌కు వచ్చే ఆరోగ్యశ్రీ రోగులకు అందుతున్న సేవలపైనా వాకబు చేశారు. కిడ్నీ బాధిత రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కోరారు. ముఖ్యంగా యువకుల్లో వచ్చే రుగ్మతలపైన దృష్టిసారించి ఆయా జబ్బులను ప్రాథమిక దశలోనే నివారించేందుకు కృషి చేయాలని కోరారు. కోర్టు అనుమతి మేరకు జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఆదివారం కూడా నిమ్స్‌కు వచ్చి జగన్ వద్దే ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకే నిమ్స్‌కు చేరుకున్న ఆమె సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉన్నారు.