breaking news
nandi ramaiah
-
మోదీ ప్రభుత్వం పేదల పక్షమా.. కార్పొరేట్ పక్షమా?
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య ఖానాపూర్ : కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పేదల పక్షమా.. ప్రైవేటు, కార్పొరేటు, పారిశ్రామిక రంగాల పక్షమా తేల్చి చెప్పాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2005లో ప్రారంభంమైన ఉపాధి హామీ పథకం 2008 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతోందని అన్నారు. పథకంలో పలు లోపాలున్నా, పేదలందరికీ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. ఈ చట్టాన్ని ఎత్తివేయాలని భూస్వాములు, కార్పొరేటు శక్తులు, పెట్టుబడిదారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజలకు మంచి రోజులు తెస్తాం అని ప్రచారం చేసిన మోదీ, ఇప్పుడు క్రమేణా రెక్కాడితే కాని డొక్కాడని పేదల కడుపు కొట్టేలా ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏకకాలంలో రద్దు చేస్తే తిరుగుబాట్లు వస్తాయని, వివిధ సాకులతో దశలవారీగా ఎత్తివేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే జిల్లాలోని 52 మండలాలకు గాను కేవలం 10 మండలాలు మినహా 42 మండలాలకు ఉపాధి పనులు ఎత్తివేస్తున్నారని పేర్నొన్నారు. 29న కూలీలతో ఆందోళన ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేయాలని యోచించడాన్ని నిరసిస్తూ ఈ నెల 29న ఉపాధిహామీ కూలీలతో కలిసి స్థానిక ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు నంది రామయ్య తెలిపారు. ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
సీఎం కాగానే మాట మార్చిన కేసీఆర్
ఖానాపూర్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో రూ.లక్షలోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్న కేసీఆర్ సీఎంగా కాగానే మాటా మార్చారని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. నాయకులు దేవన్న, సర్దార్, భూమేశ్వర్, అంకుశ్రావు, ఎల్లయ్య తదితరులున్నారు. పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాలి.. పంట రుణాలన్నింటినీ మాఫీ చేసి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. పట్టణ ఉపాధ్యక్షుడు షేక్ అజ్జర్, నాయకులు శ్రీపాద శేషాద్రి, కడపత్రి తిలక్‌రావు, బాశెట్టి నర్సింగ్‌రావు తదితరులున్నారు. -
ఉపాధి అక్రమాలపై కూలీల ఆగ్రహం
ఖానాపూర్, న్యూస్‌లైన్ : మండలంలోని వెంకంపోచంపాడ్ పంచాయతీ పరిధి పోచంపల్లిలో ఉపాధిహామీ పనుల్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయంటూ గ్రామానికి చెందిన కూలీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సోమవారం ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధి పనులు, ఖర్చు వివరాలు తెలపాలని సమాచారం హక్కు చట్టం కింద సంబంధిత అధికారులను అడిగి నెల రోజులు గడుస్తోందని పేర్కొన్నారు. అయితే వారు మాత్రం పూర్తి సమాచారం ఇవ్వకుండా అసంపూర్తిగా కేవలం కూలీల వివరాలే ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళనకు ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ మాలవత్ రోహిదాస్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, మండల అధ్యక్షుడు మాన్క దేవన్న మద్దతు తెలిపి వారితో పాటు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఏపీడీ, ఏపీవోల నిలదీత గ్రామస్తులు మాట్లాడుతూ, పోచంపల్లిలో 2006 నుంచి 2013 వరకు 200 మందికి పైగా కూలీలు పనిచేశారని పేర్కొన్నారు. రూ.95,29,170 పనులు జరిగాయని, అయితే అధికారులు మాత్రం రూ.4,70,410 మాత్రమే చెల్లించారని మిగతా డబ్బులు చెల్లించలేదని తెలిపారు. ఈ విషయమై గ్రామానికి చెందిన యువకుడు మాలవత్ ప్రవీణ్ తోటి యువకులతో కలిసి వేలాది రూయపాలు వెచ్చించి జిల్లా కేంద్రం నుంచి సమాచారం సేకరించడంతో అక్రమాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఇందులో చనిపోయిన వారి పేరుపై కూడా బిల్లులు చెల్లించినట్లు ఉందని తెలిపారు. కేవలం 2012లోనే రూ.30 లక్షల వరకు నిధులు మంజూరైనట్లు ఉందని అదికారులు దీనిపై పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకొన్న ఏపీడీ ప్రకాశ్, ఏపీవో దివ్యలను గ్రామస్తులు నిలదీశారు. దీంతో వారం రోజుల్లో పూర్తి సమాచారం అందించడంతో పాటు సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్‌కు దేహశుద్ధి ఉపాధి అక్రమాలపై గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్న క్రమంలో ఎర్వచింతల్ ఫీల్డ్ అసిస్టెంట్ పీర్యా మధ్యలో కలుగజేసుకొని పనులు చేసిన డబ్బులు ఎప్పుడో చెల్లించామని, కావాలనే ఆందోళన చేస్తున్నారనడంతో.. గ్రామస్తులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. తీవ్ర ఆగ్రహంతో ఎఫ్ఏను చితకబాదారు. తామంతా 50 కిలోమీటర్ల పైచిలుకు దూరం నుంచి వచ్చి ఉపాధి అక్రమాలపై అధికారులను ప్రశ్నిస్తే తమ గ్రామానికి సంబంధం లేని ఎర్వచింతల్ ఫీల్డ్ అసిస్టెంట్ తమదే తప్పనడం ఎంత వరకు సబబని అధికారులను ప్రశ్నించారు. ఎర్వచింతల్‌లో అతడు భారీగా అక్రమాలకు పాల్పడ్డాడని, అందుకే అవినీతిని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాడని, అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ఎఫ్‌ఏపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని గొడవ వద్దని ఏపీడీ ప్రకాశ్ సముదాయించారు. గ్రామస్తులు ప్రవీణ్, రమేశ్, దినేశ్, గోవింద్, కుమార్, గణేశ్, సంతోష్, గోపాల్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.