breaking news
multipurpose health assistant
-
1,600 మంది ఎంపీహెచ్‌ఏల తొలగింపు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలో 22 ఏళ్ల వరకూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ) మేల్స్‌గా సేవలు అందించిన ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. దీంతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొందరు దాదాపు ఉద్యోగ విరమణ దశలో..మరికొందరు ఉద్యోగులు ఉన్నారు. 2013లో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన 1207 జీవో ద్వారా ఎంపికైన 1,000 మందిని, అనంతర కాలంలో ఈ జీవోను అనుసరించి మరో 500–600 మందిని ప్రభుత్వం నియమించింది. వీరిని విధుల నుంచి తొలగించాలని జిల్లాల డీఎంహెచ్వోలను ఆదేశిస్తూ గురువారం ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఉత్తర్వులిచ్చారు. డీఎంహెచ్వోలు సైతం తొలగింపు ఉత్తర్వులను సదరు ఉద్యోగులకు పంపారు. తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు వీరిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు వైద్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2002లో ఎంపీహెచ్‌ఏల నియామకంలో అర్హతలపై సుప్రీం, హైకోర్టుల్లో కేసులు పడ్డాయి.కోర్టు ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ఏపీలో 1,200 మందిని తొలగించాల్సి ఉండగా వీరిని 2013లో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం మేరకు జోవో 1207 కింద తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ 1200 మందిలో దాదాపుగా 250 మంది వరకు తెలంగాణకు వెళ్లిపోవాలి. మిగిలిన వారితో (సుమారు 1,000 మంది) కలిపి 2013లో విధుల్లోకి తీసుకున్న దాదాపు 600 మంది కలిపి మొత్తం 1600 మందిని తాజాగా విధుల నుంచి తొలగించారు. వీరందరూ 45–50 ఏళ్లు పైబడిన వాళ్లే. దశాబ్దాల పాటు సేవలు అందించిన తమను మానవతాదృక్పథంతో ప్రభుత్వం విధుల్లో కొనసాగించాలని వీరు కోరుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయడానికి 3 నెలల సమయం ఉందని, వారం కూడా తిరగకుండా హడావుడిగా ప్రభుత్వం విధుల నుంచి తొలగించడంపై మండిపడుతున్నారు.హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి ఆస్కారం ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. 2,3 రోజుల్లో కోర్టు మెమోల ద్వారా 2021–24 సంవత్సరాల్లో విధుల్లో చేరిన మరో 1,500 మందిని కూడా విధుల నుంచి తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం పునరాలోచించాలిఎంపీహెచ్ఏల తొలగింపు విషయాన్ని ప్రభుత్వం పునరా>లోచించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.ఆస్కార్ రావు కోరారు. కోర్టు తీర్పు ప్రకారం 3 నెలల ముందస్తు నోటీస్ ఇచ్చి, 3 నెలల జీతం ఇచ్చిన తర్వాతే తొలగించాలన్నారు. కనీస నియమాలు పాటించకుండా ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. కొందరు ఉద్యోగులు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. -
35 మంది ఎంపీహెచ్‌ఏలకు ఉద్యోగోన్నతి
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుల(ఆర్డీ) కార్యాలయం పరిధిలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫీమేల్)లకు 35 మందికి శుక్రవారం ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్ జరిగింది. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆర్డీ కార్యాలయంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగోన్నతి ఉత్తర్వులు అందజేశారు. గుంటూరు జిల్లాలోని 16, ప్రకాశం జిల్లాలోని 19 ఎంపీహెచ్ఏ ఖాళీలు ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ అయ్యాయి. ఉద్యోగోన్నతుల కోసం ఆర్డీ కార్యాలయం అధికారులు గతేడాది నవంబర్‌లో ఫైల్ పంపగా హైదరాబాద్ వైద్యాధికారులు ఈనెల 7న కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఆరునెలలుగా ఉద్యోగోన్నతి కోసం ఎదురు చూపులు చూశామని, తెలంగాణ గొడవ వల్ల పదోన్నతి ఫైలు ఆలస్యంగా వచ్చినట్లు ప్రభుత్వ ఏఎన్ఎమ్, హెచ్‌వి, పిహెచ్న్, సిహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా సెక్రటరీ నిర్మలాదేవి తెలిపారు. ఆర్డీ డాక్టర్ డి.షాళినిదేవి, డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ జె.విజయలక్ష్మి, సూపరింటెండెంట్లు పూసల శ్రీనివాసరావు, షేక్ బాజిత్, సిబ్బంది కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. సూపరింటెండెంట్స్‌గా మరో ముగ్గురు.. ఆర్డీ కార్యాలయం పరిధిలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ముగ్గురికి శుక్రవారం సూపరింటెండెంట్స్‌గా ఉద్యోగోన్నతి కల్పించారు. ఆర్డీ డాక్టర్ డి.షాళినిదేవి ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట క్లస్టర్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఐ.వి.రాఘరావును ప్రమోషన్‌పై నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ చేశారు. జిల్లాలోని పెదపలకలూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సిహెచ్. సాంబశివరావును, నెల్లూరు జిల్లా కొవ్వూరు క్లస్టర్లో పనిచేస్తున్న ఎం.శైలేష్‌కుమార్‌ను నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీచేశారు.