breaking news
Muktavaram Parthasarathi
-
దయ గురించి రాస్తే దయ పుట్టదు!
రచనా ప్రక్రియ అమెరికన్ కథా, నవలా రచయిత్రి ఫ్లానెరీ ఓ కానర్ (1925-1964)కు కథా ప్రక్రియ గురించి కొన్ని స్పష్టమైన అభిప్రాయాలున్నాయి: ‘‘కథంటే ఒక పరిపూర్ణ నాటకీయత కలిగిన కథనం. మంచి కథలో యాక్షన్ ద్వారా పాత్ర చిత్రణ జరుగుతుంది. పాత్రలే యాక్షన్ను కంట్రోల్ చేస్తాయి. ఫలితంగా, కథ ఒక అనుభవైకవేద్యమైన అనుభూతిగా మిగిలిపోతుంది. పాత్రంటే ఒక వ్యక్తి. లక్షల మందిలో అతడొకడైనప్పటికీ కథకు సంబంధించినంతవరకూ అతడో ప్రత్యేకమైన వ్యక్తి. కథా గమనంలో ఆ ప్రత్యేక వ్యక్తిలోని అనిర్వచనీయత, మిస్టరీ పాఠకునికి అవగతమవుతుంది. కానీ, కొందరు రచయితలు వ్యక్తుల్ని గురించి గాక, సమస్యల గురించి రాయాలని తహతహలాడుతారు. తమకు తెలిసిన లౌకిక జ్ఞాన సారమంతా పాఠకులకు కథలుగా చెప్పాలనుకుంటారు. అసలు విషయమేమిటంటే, వాళ్ల దగ్గర జ్ఞానం వుంటే వున్నదేమోగాని కథ మాత్రం లేదు. ఉన్నా రాసే ఓపిక లేదు. కథలు రాసేటప్పుడు మన నమ్మకాలు, మన నైతిక విలువలు మనకు మార్గదర్శకంగా, కరదీపికలుగా వుంటాయి. అయితే, ఆ విలువలు వెలుగుగా పనికొస్తాయిగాని వస్తువులు మాత్రం కావు. వెలుగు సాయంతో లోకాన్ని చూడాలి. కాని వెలుగే లోకం కాదు. దయ గురించి రాసి దయనూ, సానుభూతి గురించి రాసి సానుభూతినీ , ఉద్రేకం గురించి రాసి వుద్రేకాన్నీ పాఠకుల్లో కలిగించలేమని రచయితలు గ్రహించాలి. ఈ దయ, సానుభూతి, వుద్రేకం వున్న సజీవ వ్యక్తుల్ని- బరువూ, ఒడ్డూ, పొడుగూ, కొంత నిర్ణీత జీవితకాలమూ వున్న వ్యక్తుల్ని సృష్టించాలి.కథా రచన అనే ప్రక్రియకు మూలం కథ చెప్పడం కాదు, జరిగింది చూపించడం’’. (రెండు నవలలూ, 32 కథలూ, ఎన్నో వ్యాసాలూ రాసిన ఫ్లానెరీ ఓ కానర్ నలభై ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు.) ముక్తవరం పార్థసారథి 9177618708 -
పులి
కథ నదిలోకి దిగింది ఫాతిమా. పొద్దుగూకుతున్నది. బంగారు పూత పూసినట్టుగా తళుక్కుమంటున్నది చల్లటి నీరు. ఒళ్లు జలదరించింది. ఒడ్డు పట్టుకుని, అడుగు తీసి అడుగువేస్తూ మొలలోతు నీటిలో కొంత దూరం నడిచింది. తడి చీర ఒంటికి అతుక్కుపోయింది. మలయా స్త్రీలందరిలాగే కాస్త బొద్దుగా, గోధుమవర్ణంలో అందంగా వుంది ఫాతిమా. ఆమె నిండు గర్భిణి. ప్రసవ సమయం సమీపించినప్పుడు స్త్రీలలో కనిపించే భయం కళ్లలో ప్రతిఫలించింది. శరీరం భారంగా వుంది. ఆమె ఆలోచనల్లో మునిగింది. మెరిసే, నల్లటి పొడవాటి జుత్తు ఆమె పిరుదుల దాకా సాగింది. ఆచ్ఛాదన లేకపోవటంతో గాలి గిలిగింతలు పెడుతున్నట్టుగా వుంది. దూరంగా చెట్లు, పొదలు, తీగలతో ఆ ప్రాంతం అడవిలాగే వుంది. మగవాళ్ల చూపుల నుండి కాపాడటానికి, అదనంగా గడ్డి కూడా ఏపుగా పెరిగింది. ఆ ఊరి స్త్రీలంతా యిక్కడే స్నానాలు చేస్తుంటారు. అంతలో ఒక నీటి కొంగ అరుపుతో ఆ ఏకాంత నిశ్శబ్దం భగ్నమైంది. రెక్కలు రెపరెప కొట్టుకుంటూ మరికొన్ని పక్షులు పెకైగిరాయి. ఎలుకలు కలుగుల్లోకి పరుగులు పెట్టాయి. ప్రాణభయంతో చిన్న జంతువులు గడ్డిమాటున నక్కాయి. నాచు, కాలుజారే బురదా, అడివి పువ్వుల వాసనలతో వాతావరణం మత్తుగా వుంది. అలవాటైన ప్రదేశమే అయినా, ఆ క్షణాన ఫాతిమాకు భయమేసింది. ఈ భగవంతుని సృష్టిలో, ఇంత జీవజాలం మధ్య తను ఒంటరి. ఎవరైనా రావచ్చు ఏమైనా జరగొచ్చు. ప్రమాదాలు చెప్పిరావు కదా. నది ఎగువన ఒక గాండ్రింపు వినిపించింది మొదట, అది తన భ్రమ కాబోలు ననుకున్నది ఫాతిమా. కాని చారలతో, నిప్పుకణికల్లా మెరుస్తున్న కళ్లతో, ‘ఒంటరిగా చిక్కావులే’ అన్నట్టుగా తనవైపే చూస్తున్నది పులి. తనకూ దానికీ మధ్య యిరవై గజాలకన్నా ఎక్కువ దూరం లేదు. ముసురుకుంటున్న చీకట్లతో రూపం మరింత భయంకరంగా వుంది. తల పెకైత్తి ఎర్రటి నాలుకా, పచ్చటి కోరలూ ప్రదర్శిస్తూ మరోసారి గాండ్రించింది. మృత్యువు కళ్లముందు సాక్షాత్కరించినప్పుడు పారిపోవడానికి కూడా కాళ్లు సహకరించవు. ఇంద్రజాలంతో హిప్నాటైజ్ అయినట్టుగా చేష్టలుడిగి చూసింది ఫాతిమా. అప్పటిదాకా ఎన్నెన్నో ఆలోచనలతో నిండిన మనసు నిశ్చలమైంది.పులి నుండి కళ్లు కదల్చలేకపోయింది. అనుకోకుండా మనిషి కనిపించడంతో బహుశా పులి కూడా అదే స్థితిలో వుండి వుంటుంది. ఫాతిమాలాగే పులి కూడా భయపడే వుంటుంది. గాండ్రించిందే తప్ప ముందుక్కదల్లేదు. మనుషులు అంత రుచికరమైన ఆహారం కాదని కూడా అనుకుని వుండవచ్చు. ముందరి కాళ్ల పంజాలతో గడ్డిని పెకలిస్తూ తలతిప్పి అటూ యిటూ చూసింది. కనిపిస్తున్న మనిషి మీద దానికి ఆసక్తి తగ్గినట్టే వుంది. చీకటి పడింది. తూర్పున కొండలు నల్లటి దయ్యాల్లా విస్తరించాయి. నీటిలో ప్రతిబింబాలు కనిపించడం లేదు. మంచు తుంపర్లతో వాతావరణం మరింత చల్లబడింది. కీటకాల రొద, గుడ్లగూబ అరుపు రాత్రికి స్వాగతం పలికాయి. కదలనంత మాత్రాన పులి నుండి ప్రమాదం తప్పిందని కాదు. భయ తీవ్రత తగ్గినా ఒంట్లో సత్తువ వుడిగినట్లుగా వుంది. చలి పెరిగింది. పులి కదలదు. రెండు చేతులతో పొట్ట తుడుముకుంది ఫాతిమా. పులి కదిలిందంటే రెండు ప్రాణాలు పోతాయి. అది తల పక్కకు తిప్పినప్పుడు, నీటిలో మునిగి నదీ గర్భంలో ఈత కొట్టింది. ఆ తీరప్రాంతవాసులందరికీ ఈత పుట్టుకతో వచ్చిన విద్య. ఎటువైపు ఈదితే గ్రామం చేరుకోవచ్చో ఆమెకు తెలుసు. నీటిలో వున్నా ఉపరితలం మీది కదలికలు ఆమెకు తెలుస్తూనే వున్నాయి. గాండ్రింపు యిప్పుడు దూరంగా వినిపించింది. పైకి వచ్చి పరికించింది. గ్రామంలోని దీపాలు కనిపించాయి. ఒడ్డుకు ఈదింది. అయితే, మధ్యాహ్నమెప్పుడో స్నానానికి వెళ్లిన తన కూతురు చీకటిపడినా తిరిగి రాలేదని నెత్తీనోరూ బాదుకుంటూ వూళ్లో ఇంటింటికీ వెళ్లి చెప్పింది ఫాతిమా తల్లి. ఆ ప్రాంతంలో పులులు తిరుగుతాయని అందరికీ తెలుసు. ఎన్నిసార్లు ఎన్నింటిని చంపినా మళ్లీ మళ్లీ వస్తూనే వుంటాయవి. కర్రలూ, బరిసెలూ, దివిటీలు పట్టుకుని వేటకు బయల్దేరారు మగాళ్లు - ఒక్క మనిషిని రక్షించాలని కాదు. తమ తమ పశువులు, మేకలు, గొర్రెలు ఏమవుతాయోనని భయం. కుక్కిమంచాల మీద కూర్చుని, తమలపాకులు నముల్తున్న ముసలాళ్లు ఆ హడావుడి ఎందుకో అర్థంకాక ‘‘పొయ్యేకాలం’’ అంటూ గొణుక్కున్నారు. ఫాతిమాను చాపమీద పడుకోబెట్టారు. అందరూ గుమిగూడి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. ఇదే అదనుగా ఫాతిమా తల్లి వున్నవీ లేనివీ కల్పించి చెప్పి తన పరపతి పెంచుకోవడానికి ప్రయత్నించింది. ఈ ముసల్దాని కాకిగోల భరించలేక గ్రామ పెద్ద నోర్మూసుకొమ్మని కసురుకున్నాడు. ఫాతిమాకు మాట్లాడే ఓపిక లేదు. అయినా అడిగిన ప్రశ్నలన్నింటికీ నెమ్మదిగా జవాబిచ్చింది. అయితే, పులి గురించి ఎక్కువగా చెప్పడం ఆమెకిష్టంలేదు. జనం దాన్ని వెంటాడి చంపుతారు. అందువల్ల అదెక్కడ కనిపించిందో స్పష్టంగా చెప్పలేదు. గ్రామ పెద్దకు కోపం వచ్చింది. పులిజాడ తెలియకపోతే దాన్ని వేటాడటమెలా? ఫాతిమా చేసిన ‘సాహస కార్యం’ వల్ల తననే అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు అనుకుంది తల్లి. ‘‘అంతా అల్లా దయ. ఇలాంటి ప్రమాదాల్నుంచి మానవమాత్రులెవరూ రక్షించలేరు. అల్లా! అల్లా! అంటూ చేతులెత్తి ప్రార్థించింది. అసలే విసిగిపోయివున్న గ్రామ పెద్ద ‘‘అల్లా రక్షించాడని నాకూ తెలుసు. కాని మరోసారి యిలాగే జరిగితే ఆయన రక్షించకపోవచ్చు. పులులు మనిషి వాసన పసిగట్టగలవు. దాన్ని వెంటనే చంపకపోతే ఈ వూళ్లో ఎవరికీ క్షేమం కాదు’’ అంటూ దృఢకాయులైన యువకులందర్నీ పోగుచేశాడు. పులి వేటంటే ప్రాణాలతో చెలగాటమే. ముఖ్యంగా, రాత్రి వేళ మరీ ప్రమాదం. అడవి దట్టంగా వుంటుంది. వ్యూహాత్మకంగా కూడా, వేటలో పులిదే పైచేయి అవుతుంది. ‘‘ఏం చేద్దాం?’’ అందరూ ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. పిరికిపందల్లారా!’’ అనే మాటా నోటిదాకా వచ్చింది గ్రామపెద్దకు. అంతలోనే మామూద్ అనే యువకుడు తుపాకీ పట్టుకుని ముందుకొచ్చాడు. ‘‘మన ఫాతిమాకేమైంది? పులి దాడిచేసిందా? నమ్మలేకపోతున్నాను.’’ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు గ్రామపెద్ద. ‘‘ఇంకెందుకాలస్యం. దాన్ని వెంటనే చంపాలి.’’ అసహనంగా కుడిచేతి వేళ్లతో డబుల్ బ్యారెల్ గన్ను పట్టుకుని దయ్యం పూనిన వానిలా వూగిపోయాడు మామూద్. పులిని వేటాడే అవకాశం రావడం తన అదృష్టం. ‘‘పులి ఈ ప్రాంతంలో తిరిగినంత సేపూ స్త్రీలకు, పిల్లలకూ రక్షణ వుండదు. వాళ్లకేప్రమాదమూ రాకుండా చూడడమే మగవాళ్ల డ్యూటీ. నా వెంట ఎవరొస్తారో చెప్పండి. ఎవరూ రాకపోయినా నేనొంటరిగా పోగలను. నేను మా అమ్మకు పుట్టి వుంటే ఆ పులి కళేబరంతో తప్ప మళ్లీ వూళ్లో అడుగు పెట్టను.’’ అంటూ శపథం చేశాడు మామూద్. మొదట కాస్త సందేహించినా, ఓ డజనుమంది అతణ్ణి అనుసరించారు. మామూద్ తుపాకీ గురి తప్పదని వాళ్లకు తెలుసు. ఆ తర్వాత తలుపు మూసి, గడివేస్తూ ‘‘ఫాతిమా, ఇక మనం భయపడాల్సిందేమీ లేదు. అది పులి. వీడు బెబ్బులి.’’ అంది తల్లి. ఫాతిమా నెమ్మదిగా లేచి కిటికీ తెరిచింది. చెట్ల ఆకుల మీద, నీటిగుంటల మీద మెరుస్తున్నది కరిగిన వెండిలాంటి వెన్నెల. కొబ్బరిచెట్ల మీద కొబ్బరికాయ గుత్తులు నిండుగా కనిపిస్తున్నాయి. వేటకు బయల్దేరిన మనుషులు ఒకరినొకరు సైగలు చేసుకుంటున్నారు. ఫాతిమా మొహంలో విషాదం అలముకుంది. మనుషులు చెట్ల వెనక కనుమరుగైనారు. గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. నదిలోని నీటి గలగల తనతో సంభాషిస్తున్నట్టుగా వుంది. సాయంత్రం తాను నదిలోకి దిగిన చోటే తిరుగుతూ వుండి వుంటుంది పులి. అది ఈ మనుషుల కంటపడకుండా వుండాలని కోరుకుంది ఫాతిమా. రోట్లో పోకకాయలు దంచుతూ, ‘‘అల్లా, వేటకు వెళ్లిన కుర్రాళ్లను రక్షించు. వంద నక్కలకన్నా జిత్తులమారి ఆ పులి. చీకట్లో చూడగల శక్తి దానికుంది, తెల్లారేలోగా ఏ దుర్వార్త వింటానో, ఎవరు దానికి బలి అవుతారో!’’ అంటూ శోకాలు పెట్టింది తల్లి. ‘‘దాని మానాన దాన్ని వదిలేయొచ్చుగా!’’ అంది ఫాతిమా. ‘‘నీకు పిచ్చెక్కిందేవ్. అది మనల్ని చంపేలోగా మనం దాన్ని చంపాలి. తెలిసిందా!’’ అంది తల్లి. ‘‘దానంతటదే తిరిగి అడవిలోకి వెళ్లిపోతుంది. మనమెందుకూ దానివెంట పడడం?’’ ‘‘మనుషులను చూసిన పులి చంపకుండా ఎలా వుంటుంది?’’ ‘‘ఏమో. అది చంపగలిగే స్థితిలో లేదనిపించింది.’’ ‘‘నాకు యిరవై గజాల దూరంలోనే వున్నా అది నా మీదికి దూకలేదు. ఎందుకంటావు? అది నన్ను చూసింది. నేను దాన్ని చూశాను. అల్లా సృష్టిలో అన్ని జీవులూ వుంటాయి. తనలాగే నేనూ. దాని కళ్లలో కోపం కనిపించలేదు.’’ ‘‘మీ నాన్నలాగే నీకూ వేపకాయంత వైందేవ్. ఆ మహానుభావుడు చచ్చి స్వర్గంలో వున్నాడు కూడా- యిలాగే పిచ్చి పిచ్చిగా, గాలి పాటలు పాడుతుందని చెప్పేవాడు.’’ ఫాతిమా కిటికీ దగ్గర నిల్చుని కళ్లార్పకుండా చూసింది. శవం మీద కప్పిన చద్దర్ లాగుంది చీకటి. గర్భిణి గనక, కాళ్లూ చేతులు కూడా లావెక్కి గాలివూదిన బొమ్మలాగుంది ఫాతిమా. ఎక్కడైనా శబ్దం వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించి వింది. వక్కల్ని దంచుతున్న రోకలి చప్పుడు లాగే ఆమె గుండె కూడా కొట్టుకుంటున్నది. ఇహ భరించలేక రెండు చేతులతో పొత్తికడుపును అదుముకున్నది. ‘‘ఏమైంది?’’ ‘‘ఏమీ లేదు’’ అంటూ పంటితో పెదవిని నొక్కి పట్టింది. ‘‘ఎంతసేపలా నిల్చుంటావు. పడుకుందువు గాని, రా.’’ కిటికీ వద్ద నుండి కదల్లేదు ఫాతిమా. అలలు అలలుగా వస్తున్నది నొప్పి. అడవిలో, పులి ఏ పరిస్థితిలో వుందో? అది పరిగెత్తగలదా? అది కూడా బాధను అనుభవిస్తుందా? రైఫిల్ పేలిన చప్పుడైంది. మరోసారి. బుల్లెట్ తన గర్భంలో దూసుకుపోయినట్టుగా గిలిగిలా కొట్టుకుంది గుండె. గాండ్రింపు కూడా వినిపించింది. అయితే, అది ఎవరి మీదికో దూకుతున్న భీకరమైన గాండ్రింపు కాదు. మృత్యువు వేదనలో కూడా ‘నేను స్వేచ్ఛాజీవిని’ అని ప్రకటించినట్టుగా వినిపించింది. ఆ గాండ్రింపులో దైన్యం వుంది. ప్రతిఘటన వుంది. ఆ క్షణంలో ఎలుగెత్తి రోదించగలిగితే ఫాతిమా కూడా అలాగే ఏడుస్తుంది. నొప్పులు భరించలేదు. ఒళ్లంతా చెమట పట్టింది. ‘‘అల్లా-అల్లా. ఏమవుతున్నదే. రా తల్లీ. చాప మీద పడుకో!’’ అంటూ అరిచింది తల్లి. ‘‘నొప్పులొస్తున్నాయమ్మా!’’ ముసలావిడ, నడిపించుకుంటూ వెళ్లి కూతుర్ని పడుకోపెట్టింది. ఫాతిమా కేకలతో గది ప్రతిధ్వనించింది. ‘‘హమ్మయ్య, అంతా అల్లా దయ. మగపిల్లవాడు పుడతాడు. నువ్వు కదలకు తల్లీ. వేడినీళ్లు తెస్తాను. తాగుదువుగాని. ఇంకా మంత్రసానిని పిలుచుకు రావాలి. ఈ రాత్రి ఎవరొస్తారు? ముసల్దాన్ని నేను దానికోసం అంతదూరం నడవగలనా?’’ అంటూ బిగ్గరగా తనలో తాను మాట్లాడుకుంది ముసలావిడ. చాపమీద కళ్లు మూసుకుని పడుకుంది ఫాతిమా. వంటింట్లో నీళ్లు మరగబెడుతున్న ముసలావిడ- ‘‘అదిగో, వాళ్లు తిరిగి వస్తున్నారు’’ అంటూ కేకేసింది. ఇంటి బయట కొందరు విజయోత్సాహంతో అరుస్తున్నారు. ఒకరిద్దరు తుపాకులు పైకి లేపి గాలిలో కాల్పులు జరిపారు. ముసలావిడ తలుపు తెరిచింది. ఇంటి ముందర పోగయ్యారు జనం. ‘‘మామూద్ వున్నంత వరకూ మనకు భయం లేదు పెద్దమ్మా. టపటపమంటూ రెండు రెండు సార్లు కాల్చి దాన్ని మట్టుబెట్టాడు మన వీరుడు. అది చాలా పెద్ద మృగం. మొదట మమ్మల్ని చంపుతానని భయపెట్టిందిలే. తుపాకీ కాల్చిన తరువాత వెళ్లి బరిశలతో పొడిచి నిజంగా చచ్చిందని నిర్ధారించారు’’ అంటూ గర్వంగా చెప్పాడో యువకుడు. ఫాతిమా కళ్లు తెరిచి ఆ కుర్రాణ్ణి చూసింది. ‘‘ఆ తర్వాతేమైంది?’’ కాస్త సందేహించి, ‘‘పులిని చంపిన తర్వాత కూడా ఏవో శబ్దాలు వినిపించాయి. హరికేన్ లాంతర్ల వెలుగులో చచ్చిన తల్లి పక్కనే యింకా కళ్లు తెరవని మూడు పులికూనలు కనిపించాయి. అవి నేలమీద పడి గంట కూడా అయివుండదు. కాని తల్లి తన పిల్లల కోసం ఎలా పోరాడిందనుకున్నావు. పులికూనల్ని అమ్మితే మంచి ధర వస్తుందన్నాడు మామూద్’’ అంటూ తన కథనం ముగించాడు యువకుడు. భరించలేని బాధతో మూల్గింది ఫాతిమా. పసుపు పచ్చని చెమట ముత్యాలు మెరిశాయా బాలింత చర్మం మీద. ఎవరితో పంచుకోగలదు తన దుఃఖం. ‘‘అమ్మా!’’ అంటూ అరిచింది. ‘‘త్వరగా వెళ్లండి. మంత్రసానిని పిలుచుకురండీ’’ అంటూ జనాన్ని పంపించి తలుపేసింది ముసలావిడ. తెలుగు: ముక్తవరం పార్థసారథి ఎస్.రాజరత్నం ప్రఖ్యాత మలయా (మలేసియా) కథా రచయిత, జర్నలిస్ట్, రాజకీయవేత్త. బి.బి.సి లండన్లో పని చేశారు. ఆ తర్వాత సింగపూర్లో పాత్రికేయుడిగా పని చేస్తూ రాజకీయాలలో చేరి సింగపూర్ డిప్యూటి ప్రైమ్ మినిస్టర్ (1980-85)గా ప్రజల ఆదరణ పొందారు. ‘ది స్పెక్టేటర్స్’ ఆయన కథాసంపుటి పేరు. 2006లో మరణించారు. ‘మృగాల’లలో కూడా ఉన్న తల్లి అంశను వ్యక్తపరిచే ఈ అద్భుత కథను ‘మదర్స్ డే’ సందర్భంగా సాక్షి పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.