breaking news
Mughal Emperor
-
చక్రవర్తులందరూ పన్నులను వడ్డించినవారే!
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ క్రూరుడూ, హిందూ వ్యతిరేకీ కాబట్టి, మహారాష్ట్రలో ఉన్న అతని సమాధిని తవ్వి తీసిపారెయ్యాలని డిమాండ్ చేస్తూ, నాగపూర్‌లో, వారం కిందట, కొన్ని హిందూ సంస్థలు సభలూ, నిరసన ప్రదర్శనలూ జరిపాయి. ఔరంగజేబు సమాధిని తీసెయ్యనక్కరలేదనీ, అతను అంతిమంగా మరాఠా ప్రజల చేతుల్లో ఓడిపోయాడు గనక, అతని సమాధి, మరాఠా ప్రజల వీరత్వానికి గుర్తుగా ఉంటుందని చీలిన శివసేనలోని ఒక పక్షం వాదన. తీసేస్తే తీసెయ్యండి, కానీ మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి– అని కూడా ఒక విమర్శ. ఇటీవల వచ్చిన, హిందీ సినిమా ‘ఛావా’లో చూపించినట్టు... ఔరంగజేబు క్రూరుడు కాదనీ, ఎన్నో మంచిపనులు కూడా చేశాడనీ, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒక ముస్లిం సభ్యుడు అన్నాడు. వివాదం పెరిగి పెద్దదై, నాగపూర్‌లో చిన్న స్థాయి మతకలహాల వంటివి జరిగి షాపులూ, ఇళ్ళూ, వాహనాలూ ధ్వంసం అయ్యాయి. 50మందికి గాయాలయ్యాయట! ఇంగ్లీషూ, హిందీ టీవీ చానళ్ళలో ఈ వివాదంపై చర్చలు చూపించారు. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప ప్రజానుకూల చక్రవర్తో వాదించిన వారున్నారు. ఔరంగ జేబ్ సైన్యంలో కీలకమైన పదవుల్లో హిందూ సైనికాధి కారులున్నారని వాళ్ళ జాబితా ఇచ్చిన వారున్నారు. అలాగే, శివాజీ సైన్యంలో కూడా, అతనికి ఎంతో నమ్మకస్తులైన ముస్లిం ఉన్నత సైనికాధికారులున్నారని వాళ్ళ పేర్లు చెప్పారు. ఈ చర్చల్లో ముస్లిం చక్రవర్తుల్ని ప్రజా వ్యతిరేకులుగానూ, హిందూ చక్రవర్తుల్ని ప్రజలకు అనుకూలురుగానూ వాదించు కోవడమే ఎక్కువగా కనిపించింది. పత్రికల్లోగానీ, టీవీ డిబేట్లలో గానీ, అసలు ప్రపంచ చరిత్రలో చక్రవర్తులనేవారు, వాళ్ళు ఏ మతస్థులైనా, పాలకవర్గ ప్రతినిధులనీ, పాలకవర్గం ఎప్పుడూ ప్రజలకు అనుకూలంగా ఉండజాలదనీ వివరించే వర్గ సిద్ధాంత దృష్టితో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పిన వారు లేరు. ఆ దృష్టికోణాన్ని పట్టించుకోకపోతే, సత్యానికి కళ్ళు మూసినట్టవుతుంది. చక్రవర్తులంటే, అనేక చిన్నా పెద్దా భూభాగాల మీద పరిపాలన చేసే వాళ్ళు గదా? ఉదాహరణకి, ఔరంగజేబ్ (1618–1707) అయినా, శివాజీ (1630–1680) అయినా, చక్రవర్తులుగా విశాలమైన భూభాగాలను వారి కాలంలో పాలించారు. వారు ఎవరితో కలిసి ఎవరిని ఓడించారో, ఎన్నెన్ని ప్రాంతాలను ఆక్రమించారో, ‘ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫియతులూ’ ఇక్కడ చెప్పు కోలేము. అదంతా రకరకాల చరిత్ర పుస్తకాలలో దొరుకుతుంది. వారి ప్రభుత్వాలలో కూడా ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, సైనిక శాఖ, ఇతర అనేక రకాల శాఖలూ ఉన్నాయి. ఏకాలంలో అయినా, ఏ ప్రభుత్వమైనా పరిపాలన చెయ్యాలంటే, తప్పనిసరిగా కావలిసినవి పన్నులే. చరిత్రనించీ, మార్క్స్ గ్రహించి చెప్పినది ఇదే: ‘అధికార గణానికీ, సైన్యానికీ, మత గురువులకూ, కోర్టులకూ, క్లుప్తంగా చెప్పాలంటే, మొత్తం కార్యనిర్వాహక అధికార యంత్రాంగపు మనుగడకీ ఆధారం... రాజ్యానికి అందే పన్నులే! పన్నులు అంటే, ప్రభుత్వపు యంత్రాంగపు ఆర్థిక పునాది తప్ప, మరేమీ కాదు’. అయితే, పన్నులు ఏ పేర్లతో వచ్చినా, ఏ రూపంలో చెల్లించినా, వాటి మూలం ఎక్కడుంది? ఏ కాలం గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ కాలానికి చెందిన శ్రామిక జనాల శ్రమలోనే ఉంది! అదెలాగో చూద్దాం. ఔరంగజేబు ప్రభుత్వమైనా, శివాజీ ప్రభుత్వమైనా ఆ కాలంలో రకరకాల పద్ధతుల్లో పన్నులు వసూలు చేసేవి. వసూళ్ళకు ఒక యంత్రాంగం ఉండడం తప్పనిసరి. మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు చక్రవర్తులూ పన్నులు ఎవరి దగ్గర్నించి ప్రధానంగా వసూలు చేశారు? వ్యవసాయ రంగం నించీ. అలాగే, ఆనాటి పరిమితుల్లో ఉండిన పరిశ్రమలనించీ, సరుకులతో వ్యాపారం జరిపే వర్తకుల నించీ! అసలు, ఒక రాజ్యంలో ఉండే భూములు ఎవరి అధీనంలో ఉంటాయి? వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎవరు? పంటలు పండించేది ఎవరు? (1) జమీందారులనీ, మిరాసీదారులనీ, రకరకాల పేర్లతో ఉండే పెద్ద భూస్వాములు. వీళ్ళసలు ఒళ్ళు వంచరు. అంతా కౌలు రైతులు ఇచ్చే కౌలు మీదే ఆధారపడతారు. ఏ శ్రమా చెయ్యకుండా, కౌలు రైతులనించి గుంజిన కౌలులో నించే, చక్రవర్తికి శిస్తుగానీ, కప్పం గానీ, రకరకాల పన్నులు గానీ కడతారు. (2) సొంత శ్రమల మీదే, ప్రధానంగా ఇంటిల్లిపాదీ, కష్టపడి జీవించే ‘స్వతంత్ర రైతులు’. వీళ్ళు కట్టే శిస్తులు గానీ, పన్నులు గానీ అన్నీ వీళ్ళ సొంత శ్రమ వల్లనే కడతారు. (3) సొంత శ్రమ మీదే కాక, కొంత ఇతరుల శ్రమల మీద కూడా ఆధార పడి జీవించే రైతులు వీళ్ళు. వీళ్ళు కట్టే పన్నులు కూడా, వీరి సొంత శ్రమలో నించీ కొంతా, ఇతరుల నించీ వచ్చిన అదనపు శ్రమ నించీ కొంతా. (4) వ్యవసాయ శ్రామికులు. వీళ్ళు లేకుండా వ్యవసాయంలో ఏ దశలోనూ, ఏ పనీ జరగదు. వీళ్ళని పనిలో పెట్టుకునే వారు, వారు పేద రైతులైనా, కొంత మెరుగైన స్థితిలో ఉన్న వారైనా, కౌలు రైతులైనా, ఈ కూలీల శ్రమ మీద ఆధారపడే వారే! వీళ్ళకి ‘కూలి’ అనేది డబ్బు రూపంలో ఇచ్చినా, ధాన్యం రూపంలో ఇచ్చినా, వాళ్ళకి అందేది వాళ్ళ శ్రమ శక్తి విలువే. మొత్తం శ్రమ విలువ కాదు. శ్రమ శక్తి విలువ అంటే, మర్నాడు వచ్చి పని చెయ్యడానికి శ్రామికులకి కావలిసిన జీవితావసరాలకు తగ్గ జీతం అన్నమాట. శ్రమ విలువ అంటే, తాము జీతం రూపంలో తీసుకునే విలువా, యజమాని లాభంగా మిగుల్చు కునే అదనపు విలువా కూడా కలిసినదే. వ్యవసాయ రంగం నించీ వచ్చే పన్నులు ఎక్కువ భాగం ఈ అదనపు విలువలో నించీ తీసి ఇచ్చేవే!ఆ కాలపు రెవెన్యూ చరిత్ర ప్రకారం, ఈ ఇద్దరు చక్రవర్తులకీ ప్రధానమైన ఆదాయం వ్యవసాయ రంగం నించే వచ్చేది. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ‘శిస్తు’ అనీ, ‘చౌత్’ అనీ, ‘జప్త్’ అనీ, ‘సర్దేశ్ ముఖీ’ అనీ, ఇంకేవో పేర్లు. అవన్నీ మనకి అనవసరం. భూమి వైశాల్యాన్ని బట్టో, సారాన్ని బట్టో, వచ్చిన పంట మొత్తాన్ని బట్టో కొంత భాగం పన్ను కట్టాలి. వీటిని చెల్లించే వారిని రైతులనీ, జమీందారులనీ, మిరాశీ దారులనీ, కౌల్దారులనీ... ఏ పేరుతో మనకి చెప్పినా, అసలు సంగతి కాయకష్టం చేసే రైతుల శ్రమని దోచడమే! ఈ ఆర్థిక సత్యాన్ని పట్టించుకోకుండా, ఈ చక్రవర్తి గొప్పా, ఆ చక్రవర్తి గొప్పా అనే తగువు అర్థం లేనిది. వ్యక్తిగత స్వభావాల్లో కొన్ని తేడాల వల్ల, కొందరు చక్రవర్తులు కొంత గంభీరంగానూ, కొందరు కొంత సాత్వికంగానూ, కొందరు కటువు గానూ, మరికొందరు కర్కశంగానూ, క్రూరంగానూ ఉంటారు. ‘ఏ రాయి అయితేనేమీ పళ్ళూడగొట్టుకోవడానికి?’ అనే నానుడిలో ఉన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే... చక్రవర్తులందరూ శ్రమ దోపిడీదారులే! మనం మాట్లాడుకునే చక్రవర్తుల కాలంలో చిన్న స్థాయిలో అయినా రకరకాల పరిశ్రమలు ఉండేవి. వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడిగానీ, ఇతరత్రా గానీ సరుకులు తయారయ్యేవి. ఉప్పూ, దూదీ, దారం, నేతా, నూనెలూ, చర్మంతో తయారు చేసే వస్తువులూ, నివాసాల సామగ్రీ... ఇలా ఎన్నో రకాల పరిశ్రమలూ, వర్తకాలూ ఉండేవి. పరిశ్రమల యజమానులైనా, వర్తకులైనా, కట్టే పన్నులు, వాళ్ళ దగ్గిర పనిచేసే శ్రామికులు ఇచ్చే అదనపు విలువలోనించే తీసి కడతారు. అంటే, మళ్ళీ శ్రమ దోపిడీ ద్వారానే! ఈ విషయాలు ప్రజలు గమనంలో ఉంచుకుంటే మత ఘర్షణలు తలెత్తవు. ప్రజల అనైక్యత నుంచి ఎన్నికల ప్రయో జనం పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం గమనార్హం.బి.ఆర్. బాపూజీ వ్యాసకర్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవిశ్రాంత ఆచార్యులు -
అక్బర్ మహిళల్ని వేధించేవాడు
జైపూర్: రాజస్తాన్ బీజేపీ చీఫ్ మదన్‌లాల్ సైనీ సరికొత్త వివాదానికి తెరలేపారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ మారువేషంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆయన ఆరోపించారు. మేవార్ రాజు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా గురువారం జైపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘అక్బర్ మహిళలు మాత్రమే పనిచేసే మీనా బజార్లను ఏర్పాటు చేశాడని ప్రపంచమంతటికీ తెలుసు. అందులోకి పురుషులకు ప్రవేశం నిషిద్ధం. కానీ అక్బర్ మాత్రం మారువేషంలో మీనాబజార్లలోకి ప్రవేశించి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే బికనీర్ రాణి కిరణ్‌దేవిని కూడా వేధించడంతో ఆమె అక్బర్ గుండెలపైకి కత్తి దూసింది. వెంటనే అక్బర్ తన ప్రాణాల కోసం వేడుకున్నాడు. అక్బర్ కంటే మహారాణా ప్రతాప్ చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన తన మతం, సంస్కృతి, గౌరవం కోసం పోరాడాడు. ఇతరుల భూములను లాక్కోలేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, సైనీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అర్చనా శర్మ తీవ్రంగా మండిపడ్డారు. సైనీ చేసిన వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాణా ప్రతాప్ ధైర్యసాహసాలను దేశమంతా గౌరవిస్తోందనీ, కానీ చరిత్రకు ఇలాంటి తప్పుడు వక్రీకరణల కారణంగా సమాజంలో విద్వేషాలు వేళ్లూనుకుంటాయనీ, అంతిమంగా దేశసమగ్రతకు నష్టం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. -
సత్వం: ఛత్రపతి
మరాఠా వీరులు కనబరిచినంతటి యుద్ధనైపుణ్యాన్ని ఏ యుద్ధంలోనూ, ఏ దేశంలోనూ చూసి ఎరగం! అలాంటి మరాఠాల ‘ఆది గురువు’ శివాజీ. హనం ఏనాడూ కనబరచని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సహనం అంతకంతకు నశిస్తోంది. తమ దగ్గర ఒక మామూలు జాగీర్దారుగా పనిచేసినవాడి కొడుకు రోజురోజుకూ విస్తరిస్తున్నాడు. తననే సవాల్ చేస్తున్నాడు! శివాజీ ఎంత శక్తిమంతుడో అంత యుక్తిగలవాడు. ‘వేడివేడి అంబలి మధ్యలో ఆత్రంగా చేయిపెట్టి వేళ్లు కాల్చుకోవడం కాదు; అంచుల వెంబడి చుట్టూతా చల్లబడిన భాగాన్ని తింటూ క్రమంగా మధ్యలోకి రావా’లనే తత్వాన్ని బాగా ఒంటబట్టించుకున్నవాడు. పదహారేళ్ల ప్రాయంలో తండ్రినుంచి వారసత్వంగా చిన్న జాగీరు పొందాడు శివాజీ. అబ్బురపరిచే గెరిల్లా రణనీతిని అనుసరిస్తూ చిన్న చిన్న కోటల్ని జయించుకుంటూ వచ్చాడు. కొద్దిమంది నిప్పుకణికల్లాంటి యోధుల్ని వెంటబెట్టుకెళ్లడం, కోటను వశం చేసుకోవడం! అలా పూణె ప్రాంతం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకోగలిగాడు. అందుకే, ముందుముందు చరిత్రకారులు ఇలాంటి అభిప్రాయానికి రానున్నారు: మరాఠావీరులు కనబరిచినంతటి యుద్ధనైపుణ్యాన్ని ఏ యుద్ధంలోనూ, ఏ దేశంలోనూ చూసి ఎరగం! అలాంటి మరాఠాల ‘ఆది గురువు’ శివాజీ. 1659లో బీజాపూర్ సుల్తాన్ తరఫున ఇరవై వేల సేనతో వచ్చిన అఫ్జల్ ఖాన్‌ను తెలివిగా తప్పుదోవ పట్టించాడు శివాజీ. బలహీనపడ్డట్టుగా నమ్మించి, ఏమరుపాటుగా ఉన్న శత్రువును అంతమొందించాడు. గుర్రాలనూ, ఆయుధ సంపత్తినీ స్వాధీనం చేసుకున్నాడు. దీంతో తన ఇరవై తొమ్మిదవ ఏట తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు శివాజీ. ఇదే ఔరంగజేబు అసహనానికి కారణం. అందుకే శివాజీని అణచడానికి 1665లో లెక్కకు మిక్కిలి సైన్యాన్ని పంపాడు. జైసింగ్ సారథ్యంలోని సుమారు లక్ష మంది ఔరంగజేబు సేన శివాజీని ఓడించగలిగింది; ఆగ్రాలోని రాజాస్థానానికి తీసుకెళ్లింది; మొఘల్ పాదుషా ముందు జీ హుజూర్ అనిపించడానికి. మనకంటే చిన్నవాణ్నయినా గౌరవించవచ్చుగానీ, మనకంటే మించిపోతాడని భయం ఉన్నప్పుడు గౌరవించడం కష్టం. అదే ఇక్కడ జరిగింది. అందుకే శివాజీకి దర్బారులో సముచిత స్థానం ఇవ్వకుండా మిగిలిన సేనానాయకులతో కలిపి నిలబెట్టించాడు ఔరంగజేబు. కోపంతో బుసకొట్టిన శివాజీని గృహనిర్బంధంలో ఉంచాడు. అయితే, శివాజీ మళ్లీ వ్యూహం పన్నాడు. జబ్బు పడ్డట్టుగా అందరినీ నమ్మింపజేశాడు. జబ్బు తగ్గడానికి అప్పటి సంప్రదాయాల ప్రకారం సాధువులకు పూలూ, పళ్లూ, ఫలహారాలూ పంచిపెట్టే మిషమీద కాపలదారుల కళ్లుగప్పాడు. పెద్ద పెద్ద బుట్టల్ని ఇద్దరు మనుషులు కావడిలాగా మోసుకుంటూ వెళ్లేవారు. వాటిల్లో కూర్చుని తప్పించుకున్నాడు. బయటికి వచ్చాక క్షవరం చేయించుకుని, తన పెద్ద మీసాలు, పొడవు వెంట్రుకలను తొలగించుకుని, బూడిద పూసుకున్న ఒక సాధువులాగా వందల కిలోమీటర్లు ప్రయాణించి తన రాజధాని రాయగడ్ చేరుకున్నాడు. ఇది కాదు విశేషం! బలం పుంజుకుని, మొఘలులకు కోల్పోయిన ప్రతి స్థావరాన్నీ తిరిగి గెలుచుకున్నాడు. వందల కోటలు నిర్మించాడు. శివాజీ దగ్గర నలభై వేల అశ్వికదళం ఉద్యోగులుగా ఉండేవారు. మరో డెబ్బై వేల అశ్వికులు యుద్ధాలప్పుడు కిరాయిదార్లుగా పనిచేసేవారు. పదాతిదళం రెండు లక్షలు! అంతేకాదు, రేవుల్ని అభివృద్ధి పరిచి, సైనిక శక్తికి వినియోగించుకున్నాడు. ‘ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ’ అనిపించుకున్నాడు. 1674లో ‘ఛత్రపతి’ రాచమర్యాదతో తనను తాను సింహాసనం మీద అధికారికంగా ప్రతిష్టించుకుని, ఛత్రపతి శివాజీ మహరాజ్ అయ్యాడు. మహా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. పరమత సహనం చూపాడు. 1680లో 53 ఏళ్ల వయసులో శివాజీ అనారోగ్యంతో మరణించినా ఆయన వారసులు అదే స్ఫూర్తితో పాలించారు. దక్షిణాన హైదరాబాద్, మైసూర్, తూర్పున బెంగాల్ రాజ్యాలు మినహా ‘దాదాపుగా’ భారతదేశం మొత్తం మరాఠాల పాలనలోకి వచ్చింది. అందుకే శివాజీ కేంద్రబిందువుగా నడిచే మరాఠాల చరిత్ర లేనిదే భారతదేశ చరిత్ర సంపూర్ణం కాదు. (19 ఫిబ్రవరిని శివాజీ జయంతిగా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది.)