breaking news
monthly once
-
ఇక నెలకు ఒకసారే వాణిజ్య గణాంకాలు
న్యూఢిల్లీ: నెలవారీ ఎగుమతులు-దిగుమతుల గణాంకాలను నెలకు ఒకసారి మాత్రమే విడుదల చేసే విధానాన్ని తిరిగి ప్రారంభించాలని వాణిజ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. దేశ వాణిజ్యం గురించి స్పష్టమైన చిత్రాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అక్టోబర్ 2020 నుంచి నెలకు రెండుసార్లు వాణిజ్య డేటా విడుదలవుతోంది. తొలి గణాంకాలు నెల మొదట్లో వెలువడితే, తుది గణాంకాలు నెల మధ్యన వెలువడుతున్నాయి. రెండు గణాంకాల భారీ వ్యత్యాసాలూ నమోదవుతున్నాయి. గడచిన మూడు నెలల్లో తొలుత క్షీణత నమోదుకావడం, తుది గణాంకాల్లో వృద్ధి ధోరణికి మారడం సంభవిస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో అస్పష్టత నివారణ, ఒకేసారి స్పష్టమైన తుది గణాంకాల విడుదల లక్ష్యంగా మంత్రిత్వశాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిప్రకారం రానున్న అక్టోబర్ గణాంకాలు నవంబర్ నెల మధ్యలో విడుదలవుతాయి. గడచిన మూడు నెలలూ ఇలా... తుది, తొలి గణాంకాల్లో భారత్ వస్తు వాణిజ్య లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. గడచిన మూడు నెలలుగా పరిస్థితి చూస్తే, తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. -
నెలలో ఒక రోజు పల్లెనిద్ర
అనంతపురం అర్బన్: ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు నెలలో ఒక రోజు పల్లెనిద్ర చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. అధికారులు కూడా విధిగా నెలలో ఒక రోజు పల్లె నిద్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెనిద్ర సమయంలో సంబంధిత అధికారులు అక్కడున్న సమస్యలు, తీసుకున్న పరిష్కార చర్యలను విజిట్ మేనేజ్మెంట్ యాప్‌లో పొందుపర్చాలన్నారు. ప్రతి కార్యాలయ అధికారి ఈ–ఆఫీసు ద్వారానే ఫైళ్లను పంపాలన్నారు. మాన్యువల్‌గా తీసుకొస్తే వెనక్కి పంపుతామన్నారు. చర్చించాల్సిన ఫైళ్లకూ ఇదే విధానం వర్తిస్తుందన్నారు. ఏపీ రియల్ టైం ఔట్‌కం మానిటరింగ్ సిస్టం ద్వారా ప్రగతి నివేదికల ఫలితాలు తెలుస్తాయన్నారు. వివిధ గ్రీవెన్స్‌ల ద్వారా అందుతున్న ప్రజా ఫిర్యాదులను వందశాతం పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదు చేయాలన్నారు. అనంతరం ఆయా శాఖల పనితీరును అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, సీపీఓ వాసుదేవరావు, అధికారులు పాల్గొన్నారు.