breaking news
Midnight raid
-
మందేసి..చిందేసి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలులో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. నగరంలోని ఒక ప్రదేశంలో ఒక ఎరువుల కంపెనీ తమ డీలర్లకు విందును ఏర్పాటు చేసి ముగ్గురు యువతులతో ఆశ్లీల నృత్యాలు చేయించింది. ఈ పార్టీలో గతంలో నగరంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్లో పని చేసిన సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న షీ టీమ్ పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. అయితే సదరు సీఐతో సహా అధికారులు తప్పించుకొని పారిపోయారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి దాడి.. గతంలో కర్నూలులో రేవ్ పార్టీలు, ఆశ్లీల నృత్యాలు చేసిన దాఖలాలు లేవు. అయితే ఒక్కసారిగా ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీపై షీటీమ్ పోలీసులు దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. నగరంలోని ఓ అపార్ట్మెంట్లో ఓ ఎరువుల కంపెనీ తమ డీలర్లకు విందు పార్టీని ఏర్పాటు చేసింది. ఇందులో నృత్యాలు చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన పార్టీ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. రాత్రి 9 గంటల నుంచి యువతులు ఆశ్లీలంతో నృత్యాలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దాదాపు 25 మంది ఉన్న పార్టీలో అందరూ తాగి తూగుతూ ఆశ్లీలంగా యువతులతో కలసి నృత్యాలు చేస్తున్నారు. ఇంతలోనే విషయం షీ టీమ్ ఎస్ఐ విజయలక్ష్మీకి ఫోన్ ద్వారా చేరింది. వెంటనే ఆమె రాత్రి 11 గంటల ప్రాంతంలో దాడి చేయగా.. సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారుల గుట్టు రట్టయింది. పోలీసులను చూడగానే ఆ సీఐ వారిపైనే దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. చివరకు పోలీసులను భయభ్రాంతులకు గురి చేసి వారిని తోచుకుంటూ సీఐతో సహా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇంతలోనే టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీఐ డేగల ప్రభాకర్ విందు పార్టీ చేసిన హాల్లో ఉన్న సీసీ ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు.అంతేగాక ప్రసాదరెడ్డి, పాండు, భానుచందర్‌రెడ్డి, ఎస్కే షంషద్ బేగం, మహేందర్‌రెడ్డి, ఎరువుల కంపెనీ మేనేజర్లు సురేష్, సుబ్బారావు, పవన్ కల్యాణ్‌రెడ్డి, కొమ్ము వెంకటేశ్వర్లు, ముగ్గురు యువతులను అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు యువతులపై తప్ప మిగిలిన 9 మందిపై కేసులు నమోదు చేశారు. సీఐపై కేసుకు వెనుకాడుతున్న పోలీసులు రేవ్ పార్టీలో పోలీసులు సీసీ ఫుటేజిని స్వాధీనం చేసుకోవడం కీలకంగా మారింది. అరెస్టు చేసేందుకు వెళ్లిన షీ టీమ్ పోలీసులను పక్కకు తోచి పారిపోయిన సీఐతోసహా వ్యవసాయాధికారుల వ్యవహారం కీలకంగా మారింది. అయితే సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకొని దాదాపు 30 గంటలకుపైగా అయినా ఇంకా చూస్తున్నామని పోలీసులు చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీఐను కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి. సదరు సీఐ జిల్లాలోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధిని ఆశ్రయించి పోలీసులపై కేసు లేకుండా ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డిపార్టుమెంట్ పరువు వీధిన పడకుండా చూసేందుకు కొందరు పోలీసులు అధికారులు కూడా రంగంలోకి దిగి సీఐపై కేసు నమోదు కాకుండా చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు సదరు సీఐ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ఎరువుల కంపెనీ పార్టీకి వీఆర్‌లో ఉన్న సీఐ ఎందుకెళ్లాడనేది అంతుచిక్కని ప్రశ్న. ఈ విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరపాల్సి ఉంది. -
ముదురుతున్న ‘మిడ్నైట్ రైడ్’ వివాదం
న్యూఢిల్లీ:ఆఫ్రికన్ జాతీయులపట్ల ఈ నెల 16న అర్ధరాత్రి కొందరు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కారకులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ చేతనాసింగ్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సోమనాథ్ భారతీతోపాటు కొందరు ఆప్ నేతలు గురువారం అర్ధరాత్రి దక్షిణ ఢిల్లీలో ఆఫ్రికన్ జాతీయులపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. కారకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. భారత శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో సెక్షన్ 451(అక్రమంగా ఇంట్లోకి చొరబడడం), 427(అభ్యంతరకరంగా ప్రవర్తించడం), 506 (నేరాలకు పాల్పడినందున శిక్షించడం)లపై కేసులు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించిందని సంబంధిత పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇదిలాఉండగా ఇద్దరు నైజీరియన్లు, ఇద్దరు ఉగాండాకు చెందిన యువతులు శనివారం చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వివేక్ గోలియాను కలిశారు. నగర రాజకీయాలకు తాము బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం తమపై దాడిచేసిన వారిని శిక్షించాలని, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అభ్యర్థించారు. అయితే గోలియా వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ పోలీసులను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అక్కడి నుంచి విషయం కోర్టుకు రావడంతో ఆదివారం న్యాయమూర్తి.. దాడికి కారకులైనవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. నివేదిక ఇవ్వండి: ఎన్హెచ్ఆర్సీ దక్షిణ ఢిల్లీలో నైజీరియా, ఉగాండా దేశీయులమీద గురువారం అర్ధరాత్రి దాడి జరిందన్న విషయాన్ని మీడియా కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఢిల్లీ ప్రభుత్వానికి, హోం మంత్రిత్వశాఖకు, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎన్హెచ్ఆర్సీ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం... కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. నివేదిక ఇవ్వడానికి మూడు రోజులు గడువునిచ్చింది.