ఇస్లాం మతాన్ని అనుసరించడం మానండి: చైనా
హాంకాంగ్: ఇస్లాం మతాన్ని అనుసరించడం మానుకొని.. చైనా అధికార విధానమైన 'మార్క్సిస్ట్ నాస్తిక' వాదానికి కట్టుబడి ఉండాలని ఆ దేశ అధినాయకత్వం దేశ ప్రజలకు సూచించింది. ముఖ్యంగా కల్లోలిత జింజియాంగ్ ప్రొవిన్సులో ఇస్లాం మతాన్ని అనుసరించడం మానుకోవాలని పేర్కొంది.
మతంపై జాతీయ సదస్సులో భాగంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, దేశ అధ్యక్షుడు గ్జి జింగ్పింగ్ చేసిన ఈ వ్యాఖ్యలను చైనా మీడియా విస్తృతంగా ప్రసారం చేసింది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలను తెలుపుతున్న విఘర్ అతివాద సంస్థను ఉద్దేశించి జింగ్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న జింజియాంగ్ ప్రొవిన్స్‌లోని చాలా ప్రాంతాల్లో ఇటీవల అతివాదం పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి తీవ్రతను చైనా ప్రభుత్వం కూడా గుర్తించింది.
జింజియాంగ్ ప్రొవిన్స్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇస్లామిక్ అతివాద భావజాలమంతా సరిహద్దుల దాటి చైనాలోకి ప్రవేశిస్తున్నదని గుర్తించిన కమ్యూనిస్టు పార్టీ ఈ విషయంలో పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలే జారీ చేసింది. తమ దేశంలోకి అతివాద భావాలు పాక్ నుంచి తరలిరాకుండా అడ్డుకట్ట వేయాలని సూచించింది. అయినా ఫలితం లేకపోవడంతో తాజాగా మతం విషయంలో జింగ్పింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.