breaking news
Marri Channa Reddy Human Resource Development Center
-
ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టినప్పుడే: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రస్ఠాయి సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సహయం చేస్తామని చెప్పి మభ్యపెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని, బాధితులను రక్షించడంలో ఎన్జీఓలతో కలిసి ముందుకు వెళ్లాలని పోలీసులకు సూచించారు. మానవ అక్రమ రవాణా ఎలా చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు.. అనే అంశాన్ని పోలీసులు ముందుగానే గుర్తించి ఇలాంటివి జరగకుండా చూడాలని, అప్పుడే చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేసిన వారవుతామని డీజీపీ పేర్కొన్నారు. బాధితులను రక్షించడం, పునరావాసం కల్పించడం, ప్రాసిక్యూషన్ వంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని డీజీపీ సూచించారు. మానవ అక్రమ రవాణాలో బాధితులు ఖండాతరాలు దాటి వస్తున్నారని, నిందితులకు శిక్షపడేలా ప్రాసిక్యూషన్ జరగాలని అన్నారు. అక్రమ సంపాదన కోసమే వ్యభిచారానికి అలవాటు పడుతున్నారని, కాబట్టి అక్రమ సంపాదన, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టినప్పుడే ఈ వ్యవస్థ ఆగుతోందని ఆయన తెలిపారు. ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, హ్యూమన్ ట్రాఫికింగ్‌పై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టామని, నిందితులకు న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చూస్తున్నామని తెలిపారు. చిన్నారులను వెట్టి చాకరీ చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ, ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరుతో చాలా మంది చిన్నారులను రక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజ్వల ఫౌండేషన్ స్థాపకులు సునీత కృష్ణన్ మాట్లాడుతూ.. ముంబైలో అక్రమ రవాణా నుంచి 112 మంది అమ్మాయిలని రక్షిస్తే అందులో ఆరుగురు తెలుగు అమ్మాయిలు ఉన్నారని పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం ఈ స్వచ్ఛంద సంస్థను నగరంలో ప్రారంభించారని, దేశంలో ఎక్కడ అత్యాచార ఘటనలు జరిగినా భయమేసేదని అన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మానవ అక్రమ రవాణాను తగ్గిందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం 16 ఏళ్ల బాలిక ఫేస్బుక్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు ట్రాఫికింగ్ అయిందని, ప్రస్తుతం టెక్నాలజీతో ట్రఫికింగ్ జరుగుతుందన్నారు. తెలంగాణలో జీరో ట్రాఫికింగ్ దిశగా మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పోలీసు ఉన్నతాధికారులు హాజరైయ్యారు. -
ఇక పల్లె ప్రణాళిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వరుస ఎన్నికలు.. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ఇన్నాళ్లూ కార్యాలయాలకే పరిమితమైన అధికారగణం ఇక పల్లెబాట పట్టనుంది. గ్రామాల్లో అవసరాలను, ప్రాధామ్యాలను మదింపు చేయనుంది. ప్రజలతో మమేకమై పల్లె సర్వోతముఖాభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’ పేరున సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈనెల 17వ తేదీలోపు గ్రామాల ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించింది. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో జిల్లా కలెక్టర్లు, కీలకశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన కలెక్టర్ ఎన్.శ్రీధర్ సమావేశ వివరాలను ‘సాక్షి’కి వివరించారు. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకూ గ్రామాలవారీగా పర్యటించి ప్లాన్లు తయారుచేస్తామని చెప్పారు. 22వ తేదీలోపు మండల స్థాయి, 27వ తేదీలోపు జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని సర్కారు ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తామని, దీనిపై ఆగస్టులో జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశంలో చర్చించి నిధులు కేటాయించనున్నట్లు సీఎం స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామాల అవసరాలను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగం చర్చించి ఐదేళ్ల కార్యాచరణ రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. గతంలో నిధుల కేటాయింపునకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసేవారమని, ఇకపై ప్రణాళికబద్ధంగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీధర్ వివరిం చారు. జిల్లాలో ఆయా సంస్థలకు కేటాయించిన భూముల్లో 10,900 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించామని, అలాగే మరో 8వేల ఎకరాల భూమి కూడా పరిశ్రమలకు తక్షణ కేటాయింపులకు వీలుగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపినట్లు శ్రీధర్ స్పష్టం చేశారు.