breaking news
maosits party poster
-
రాకేశ్వర్ ఫోటో ను విడుదల చేసిన మావోయిస్టులు
-
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: రాకేశ్వర్ క్షేమం, ఫొటో విడుదల
చత్తీస్‌గఢ్: మావోయిస్టులు బందీగా తీసుకెళ్లిన సీఆరీ్పఎఫ్ కోబ్రా జవాన్ రాకేశ్వర్‌సింగ్ క్షేమంగానే ఉన్నారు. ఈ మేరకు ఆయన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూ మావోయిస్టులు రాకేశ్వర్ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఫొటోలో ఆయన సాధారణంగానే ఉన్నారు. ఎలాంటి భయం, దిగులు లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని తెర్రెం పోలీస్‌స్టేషన్ పరిధి జొన్నగూడెం అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందగా.. ఒక జవాన్‌ను మావోయిస్టులు బందీగా తీసుకెళ్లిన విషయం విదితమే. అనంతరం ఆయన తమవద్ద క్షేమంగా ఉన్నారని.. ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ప్రకటించారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు చెబితే జవాన్‌ను అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ మంగళవారం లేఖ విడుదల చేశారు. అయితే, ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జవాన్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఆ బాధ్యత మీదే: రాకేశ్వర్ భార్య మీనూ జవాన్ ఒక్కరోజు ఆలస్యంగా డ్యూటీకి వెళితే యాక్షన్ తీసుకునే ఆర్మీ.. అదే జవాను విధుల్లో అదృశ్యమైతే ఏం యాక్షన్ తీసుకుంటోందని రాకేశ్వర్‌సింగ్ భార్య మీనూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాకేశ్వర్‌సింగ్ విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు. రాకేశ్వర్ ఓ తల్లికి కొడుకు, తన భర్త అనే విషయాలు పక్కనబెట్టాలని.. మీ జవాన్‌ను సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యత మీదే అని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, పాక్‌కు బందీగా చిక్కిన పైలెట్ అభినందన్‌ను విడిపించినట్టే.. రాకేశ్వర్‌ను విడుదల చేయించాలని అతని సోదరుడు విజ్ఞప్తి చేశారు. రాకేశ్వర్‌ని విడుదల చేయాలి: ప్రొ.హరగోపాల్ మావోయిస్టుల ఆధీనంలో ఉన్న రాకేశ్వర్‌సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. ఆయన్ను విడుదల చేస్తామన్న మావోయిస్టులు తమ మాట నిలబెట్టుకోవాలని కోరింది. ఈ విష యంలో ప్రభుత్వాలు ముందడుగు వేయాలని వేదిక తరఫున ప్రొ.జి.హరగోపాల్, కనీ్వనర్, కోకనీ్వనర్లు ప్రొ.జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్ ఓ ప్రకటనలో కోరారు. చదవండి: మావోయిస్టుల కీలక ప్రకటన: రాకేశ్వర్‌ను విడిచిపెడతాం -
సిద్ధిపేటలో పోస్టర్ కలకలం
సిద్ధిపేట: మెదక్ జిల్లా సిద్ధిపేటలో మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టు నేత జగన్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు జిల్లాలోని సిద్దిపేట ఆర్డీవో కార్యాలయానికి వాల్ పోస్టర్ అతికించడంతో ఈ కలకలం రేగింది. ఆ పోస్టర్ లో మొత్తం 10 డిమాండ్లను రాసి కార్యాలయ గోడకి అంటించారు. ' మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా రైతులకు ఉచితంగా ట్రాక్టర్లలో మట్టి పోయాలి. బీడీ కార్మికులందరికి పీఎఫ్‌తో నిమిత్తం లేకుండా జీవనభృతి కల్పించాలి. ప్రస్తుతం పనిచేయని బీడీ కార్మికులకు కూడా భృతి చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ప్రభుత్వ సబ్సిడీలు రాజకీయ నాయకులు, అధికారులకే సొంతమవుతున్నాయి. రియల్టర్లు, బ్రోకర్లతో కలిసి వీరు రైతుల భూములు తక్కువ ధరలకే లాగేసుకుంటున్నారు. ఇలా అనేక మోసాలకు పాల్పడుతున్న వారు చివరికి మూల్యం చెల్లించక తప్పదు' ని వారు అందులో హెచ్చరించారు. కలకలం రేపుతున్న ఈ పోస్టర్ దిగువన 'పీపుల్స్ వార్' అని రాసి ఉండడం పలు సందేహాలను రేపుతోంది. -
సరిహద్దులో కలకలం
పట్టపగలు పోస్టర్లు వేసి వెళ్లిన మావోయిస్టులు భద్రాచలానికి కూతవేటు దూరంలోనే.. మరో రెండు గ్రామాల్లో కూడా.... తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో 27 డిమాండ్లతో తెల్లకాగితంపై చేతిరాతలు కొరియర్లా? కొత్తగా పార్టీలో చేరిన వారా? నెలరోజుల క్రితమే ఒకేరోజు 100 పోస్టర్లు మిలటరీ ప్లాటూన్‌కు భూంకాల్మిలీషియా సభ్యులు కొత్త రిక్రూట్మెంట్ చేయాలని ఒడిశా సరిహద్దు సమావేశంలో నిర్ణయం! సాక్షి ప్రతినిధి, ఖమ్మం భద్రాచలం పట్టణానికి కూతవేటు దూరంలో మంగళవారం వెలసిన మావోయిస్టు పార్టీ పోస్టర్ పెద్ద కలకలమే రేపింది. గతానికి భిన్నంగా పట్టపగలే మావోయిస్టులు పోస్టర్ వేయడం అటు పోలీసు వర్గాల్లో, ఇటు ప్రజానీకంలో చర్చనీయాంశమయింది. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో పార్టీ ఉత్తర తెలంగాణ కమిటీ పేరిట 27 డిమాండ్లతో భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలోని ఎటపాక గ్రామంలో మావోయిస్టులు చెట్టుకు పోస్టర్ వేశారు. ఆ తర్వాత అదే మండలంలోని లక్ష్మీపురంలో శబరి ఏరియా కమిటీ పేరుతో మరో పోస్టర్ పడింది. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లిలో కూడా అలాంటి పోస్టరే కనిపించింది. దీంతో ఒక్కసారిగా సరిహద్దు ఉలిక్కిపడింది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు ఏదో కార్యక్రమాలు చేస్తుండడం....ఉన్నట్టుండి ఒకేరోజు మూడు చోట్ల మావోయిస్టులు పట్టపగలే పోస్టర్లు వేయడం చూస్తే సరిహద్దులో మళ్లీ ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో అనే చర్చ నడుస్తోంది. రోడ్డుపాయింట్లే లక్ష్యం గత వ్యూహాలకు భిన్నంగా ముందుకెళుతున్న మావోయిస్టులు పోలీసులతో కయ్యానికి కాలుదువ్వే సంకేతాలు పంపుతున్నారు. గతంలో పోస్టర్లు వేసినప్పుడు మావోయిస్టులు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కేవలం రాత్రివేళల్లో మాత్రమే... అది కూడా ఊరిచివర, కల్వర్టుల దగ్గర వేసి వెళ్లేవారు. పోస్టర్లు వేసేందుకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకునేవారు. ఇదే తరహాలో నెలరోజుల క్రితం దుమ్ముగూడెం మండలంలో ఒకే రోజు 100 నుంచి 150 పోస్టర్ల వరకు వెలిశాయి. రాత్రి 10 గంటల సమయంలో మండలంలోని అంజిబాక, దుమ్ముగూడెం క్రాస్‌రోడ్డు, కాటాయిగూడెం, వీరభద్రారం గ్రామాల్లో మావోయిస్టు పార్టీ పేరిట పోస్టర్లు వేశారు. ఆదివాసీలపై బైండోవర్ కేసులు ఎత్తివేయాలని, అమాయక గిరిజన మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని, ఇన్ఫార్మర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆ పోస్టర్లలో డిమాండ్ చేశారు. అంతకు ముందు చర్ల మండలంలోని తాలిపేరు బ్రిడ్జి వద్ద కూడా 10 పోస్టర్లు వేసి వెళ్లారు. పెదినలబెల్లి నుంచి గౌరారం వరకు వేస్తున్న రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆ పోస్టర్లలో రాశారు. కానీ, ఇప్పుడు మాత్రం తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో ఏకంగా పట్టపగలే భద్రాచలం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు పోస్టర్లు వేయడం కలకలం రేపుతోంది. మారుమూల పాయింట్లను వదిలి రోడ్డు పాయింట్లను లక్ష్యంగా చేసుకుని పోస్టర్లు వేయడం వారి కార్యకలాపాలు సరిహద్దుల్లో ముమ్మరమవుతున్నాయనేందుకు సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా రిక్రూట్ అయిన వారి పనేనా? ఏజెన్సీలో మావోయిస్టు కార్యకలాపాలు ఉధృతమవుతున్నాయనే భావన కొంతకాలం నుంచి వ్యక్తమవుతోంది. ఇటీవలే మావోలు దుమ్ముగూడెం మండలంలోని పెదార్లగూడెంలో ఎయిర్టెల్ టవర్‌ను పేల్చివేశారు. ఇన్ఫార్మర్ల పేరుతో ఇద్దరు, ముగ్గురిని చంపివేశారు. కోడిపందేలకు వెళ్లిన ఓ వ్యక్తిని హతమార్చారు. మిలిటరీ ప్లాటూన్ కమాండర్ సుఖ్‌దేవ్ నేతృత్వంలోని బృందం ఏజెన్సీలో సంచరిస్తున్నట్లు పోలీసు వర్గాలకు సమాచారం ఉంది. కానీ, పట్టపగలు పోస్టర్లు ఎవరు వేసి ఉంటారా అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే, రెండు నెలల క్రితం ఒరిస్సా సరిహద్దు అటవీప్రాంతంలో మావోయిస్టుల కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. మిలటరీ ప్లాటూన్, పార్టీ ఏరియా కార్యదర్శులతో సమావేశమైందని సమాచారం. ఈ సమావేశం సందర్భంగా మిలటరీ ప్లాటూన్‌లో సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని, భూంకాల్ మిలీషియా సభ్యులను కొందరిని ప్లాటూన్‌కు పంపాలని అగ్రనాయకులు ఆదేశించారని, ఈ మేరకు కొందరు ప్లాటూన్‌లో రిక్రూట్ అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిలీషియాలో పనిచేసేందుకు మరికొందరు సభ్యులు అవసరం అయినందున పార్టీ ఏరియా కార్యదర్శులు అనువైన గ్రామాలను ఎంచుకుని అక్కడి యువతను పార్టీలో రిక్రూట్‌చేసుకోవాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏజెన్సీతో పాటు ఆవలి ప్రాంతంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతోందని సమాచారం. దీంతోపాటు కొరియర్ వ్యవస్థ బలోపేతం అయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కొరియర్ల సహకారంతోనే మావోయిస్టులు పట్టపగలే పోస్టర్లు వేశారని, కొత్తగా పార్టీలో రిక్రూట్ అయిన వారే ఈ చర్యకు పాల్పడ్డారనే చర్చ జరుగుతోంది. కానీ పోలీసు వర్గాలు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నాయి. మావోయిస్టులకు పట్టపగలు అంత లోపలికి వచ్చేంత అనుకూల పరిస్థితి లేదని, వారికి కొరియర్లుగా పనిచేస్తున్న వారే పోస్టర్లు కూడా వేసి ఉంటారని అంటున్నారు.