breaking news
Mantena venkataramaraju
-
‘ఉండి’ టికెట్ రగడ.. భీమవరంలో ఉద్రిక్తత
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఉండి నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. భీమవరం పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు సీటుపై తెలుగుదేశం నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కార్యాలయం వద్ద నుంచి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వరకు భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ నాయకులు.. సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సీటు మంతెన రామరాజుకే ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సెట్టింగ్ సీటును రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తున్నట్లు తెలియడంతో రామరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ సంకట స్థితిలో పడింది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ ఆశించి భంగపడి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆనందం పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. ఇప్పుడు రామరాజును కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించారన్న సమాచారంతో ఆ నియోజకవర్గ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించకపోయినా తీవ్రస్థాయిలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. అందరూ సహకరిస్తే ఇండిపెండెంట్‌గా తాను బరిలో ఉంటానని మరోవైపు రామరాజు చెబుతున్నారు. పదిహేను రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా నరసాపురం ఎంపీ టికెట్ ఆశించి కూటమి చేతిలో భంగపడ్డ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ హామీ రావడంతో రామరాజు వర్గం తేరుకోలేకపోతోంది. చంద్రబాబు నుంచి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో రామరాజు వర్గం ఐదు రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేసి తీవ్రస్థాయిలో పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో రామరాజుకు ఎలాంటి హామీ రాకపోవడంతో కంటితడి కూడా పెట్టారు. ఆయన వర్గీయులు బుధవారం నుంచి ఆమరణదీక్ష ప్రారంభించారు. -
ఆడంబరాలు తగ్గించి... ఆపన్నులకు ఆసరాగా...
మంతెన వెంకటరామరాజు... పారిశ్రామిక వేత్త అని చెబితే వెంటనే గుర్తొస్తారో లేదో కానీ ‘వసుధ ఫౌండేషన్’ రామరాజు అంటే చాలామందికి గుర్తొస్తారీయన. హైదరాబాద్‌లో ‘వసుధ ఫార్మా లిమిటెడ్’ పేరుతో బల్క్ డ్రగ్ యూనిట్ నిర్వహిస్తున్నారు. వసుధ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నడుపుతున్నారు. కాళ్లు లేని పిల్లాడిని ఎత్తుకుని వచ్చిన తల్లితండ్రులకు వైద్యానికి సహాయం చేస్తారు. చదువుకోవడానికి డబ్బుల్లేవని వస్తే పుస్తకాలు కొనిస్తారు. నాకీ కష్టం అని వచ్చిన వారెవరినీ ఊరికే పంపించరు. అయితే ఆ కష్టం నిజమైనదా కాదా అని మాత్రం పరిశీలిస్తారు. ఇలా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ ఈ మధ్య ఆయన తలసీమియా వ్యాధిగ్రస్థుల చికిత్స కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించడం వార్తల్లో విషయమైంది. మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే రామరాజును కలిసినప్పుడు స్ఫూర్తిదాయకమైన అనేక విషయాలను చెప్పారాయన. ‘‘జీవితంలో స్థిరపడడానికి మనకు నచ్చిన రంగాన్ని కానీ అవకాశాలు వచ్చిన రంగాన్ని కానీ ఎంచుకుంటాం. అలా నాకు నచ్చిన కోర్సు చదువుకున్నాను. అదే రంగంలో ఉద్యోగంలో చేరాను. నాకంటూ ఉన్న లక్ష్యాల కోసం సొంతంగా పరిశ్రమను స్థాపించాను. అయితే పరిశ్రమను లాభాల బాటలో నడిపించడం అంటే... స్థాపించినంత సులువు కాదని చాలామంది వ్యాపారవేత్తలకు వచ్చినట్లే నాకూ అనుభవంలోకి వచ్చింది. అనుభవం నేర్పిన పాఠాలే లాభాలకు పెట్టుబడి అయ్యాయి. ఇప్పుడు మా కంపెనీ 45 దేశాలకు బల్క్ డ్రగ్‌ను ఎగుమతి చేస్తోంది. నా వ్యాపార పరుగులో కొంత ఊపిరి తీసుకునే వెసులుబాటు వచ్చింది. నా పిల్లలిద్దరూ పెద్దయ్యారు. నేను వెనక్కి చూసుకోవడానికి కొంత విరామం దొరికింది. వ్యాపారపరంగా ఎన్నో దేశాల్లో పర్యటిస్తుంటాను. అక్కడ ఉన్నన్ని అవకాశాలు మన దగ్గర కూడా ఉంటే ఎంతో మంది రాణిస్తారనిపించేది. దాంతో నేను చేయగలిగిందేదో చేస్తూ తృప్తి పడుతున్నాను. నేనిది చేశాను అని చెప్పుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే ఎప్పుడూ ప్రసారమాధ్యమాల్లో కనిపించను’’ అన్నారు రామరాజు. ఇంతకీ అసలేం జరిగిందంటే... రత్నావళి అనే మహిళ తరచూ ఆఫీసుకొచ్చి తలసీమియా పేషెంట్ల గురించి చెప్పేవారు. ఒకరోజు రామరాజు హైదరాబాద్ నగరంలో చార్మినార్ ప్రాంతంలోని తలసీమియా అండ్ సికిల్‌సెల్ సొసైటీకి వెళ్లారు. అక్కడి సన్నివేశం ఎవరినైనా ఇట్టే కదిలించేటట్లు ఉంటుంది. వెంటనే అక్కడికక్కడే ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘‘అక్కడికి వెళ్లిన తర్వాత నా గుండె కలచివేసినంత పనైంది. ఏ పాపమూ ఎరుగని అమాయకులు. ఇంత తీవ్రమైన వ్యాధి ఎందుకు వచ్చిందో వారికి తెలియదు. తల్లిదండ్రుల పరిస్థితి మరీ దయనీయం. అంతంత దూరాల నుంచి పిల్లల్ని తీసుకుని రావడానికి దారి ఖర్చులకే డబ్బులేని వారే అందరూ. ఇక చికిత్స కోసం రక్తం ఎక్కడ కొనగలరు. వారికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తే దాతల కోసం వెతుకులాట తప్పుతుంది కదా అని అంత మొత్తాన్ని ఇచ్చాను’’ అన్నారాయన. ‘‘ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన డబ్బులో అవసరాలకు పోగా మిగిలిన దాంట్లో ఆడంబరాలు, సౌకర్యాల కోసం కొంత వాటా ఉంటుంది. తమ సరదా కోసం ఖర్చు చేసే పదిరూపాయల్లో కనీసం రెండ్రూపాయలైనా తగ్గించుకుంటే అది మరొకరికి ఆసరా అవుతుంది’’ అంటారాయన. ముఖ్యంగా సంపన్నవర్గాలు, వ్యాపార వేత్తలకు ఆయనిచ్చే సూచన ఇది. ఆచరణాత్మకమైన ఆలోచనే! - దుగ్గింపూడి శ్రీధర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్