breaking news
Mani Vadlamani
-
'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా..
ఆమెతో బోసుకి చిత్రంగా పరిచయం అయింది. ఒక సాయంత్రం, అతని ఇంటికి కొద్ది దూరంలో, ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా.. అతనిని ఆపి, ఒక డజను అరటిపండ్లు కొనమని అడిగింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఒక్క రోజు కనిపించక పొతే ఆపి మరీ ‘ఏంటి బొత్తిగా నల్లపూస అయ్యావు?’ అనడిగేసేది. ఆ గదమాయింపులో అతనికి ఏదో ఆత్మీయత కనిపించేది.బోసు మొదటి అంతస్తులోని తన పోర్షన్‌కి వెళ్ళి తలుపు తెరిచాడు. భుజమ్మీద నుంచి ఆఫీస్ బ్యాగ్ తీసేసి పక్కనే ఉన్న దివాన్ మీద పెట్టాడు. అరటిపండ్లు ఉన్న బాగ్, పులిహోర ఉన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకుని మళ్ళీ ఇంటికి తాళం వేసి బయటకి వచ్చాడు.వీధి చివరి వరకు నడిచిన తర్వాత, ఎదురుగా వస్తున్న ఆమెను గుర్తించాడు. పీలగా, బలహీనంగా ఉన్న ఆమె అతని వైపు వచ్చింది. బోసు కదలలేదు. కానీ ఆవిడ అతని ముందు అలాగే నిలబడి ఉంది. కొన్ని సెకన్ల పాటు! ఆమె ముఖం అభావంగానే ఉంది. ఆమె చూపులు అతని చేతిలో ఉన్న బాగ్ మీద పడ్డాయి. అంతే ఆమె ముఖం వెలిగిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చెప్పబోతుందో బోసుకు తెలుసు. అందుకే అతను ఆ చేతిని పట్టుకున్నాడు. ఆమె చూపులు మటుకు అతడు పట్టుకున్న గుడ్డ సంచిపైనే ఉన్నాయి.‘ఇదిగో మీ అరటిపండ్లు’ బోసు అన్నాడు. ‘ఓ! మళ్ళీ అడగకుండానే తెచ్చావు’ అంది ఆమె. బోసు ‘ఎస్’ అంటూ అభిమానంగా నవ్వాడు. ఎందుకో తెలియదు కానీ ఆమెతో గడపడం అతనికి చాలా ఇష్టం. ఎవరో అన్నట్లు కొన్నింటికి లాజిక్కులు ఉండవు. ఆమె తోడు కోసం కింద భాగం ఇంటిని అద్దెకు ఇచ్చింది. ఆమెకు వంట చేసుకోవడం కుదరకపోవడంతో, పనివాళ్ళ మీద ఆధారపడింది. వాళ్ళు కారాలు ఎక్కువేయడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకే ఎక్కువ పండ్లు మాత్రమే తింటోంది. వాటిల్లో అరటిపండ్లు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. రోజూ ఆఫీసు నుండి వచ్చాక బోసు.. ఆమెతో కలసి వాకింగ్‌కి వెళ్ళేవాడు. ఆ వాకింగ్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. ఆమె తన వ్యక్తిగత వివరాలను కొన్ని అతనికి చెప్పింది. ఆమె ఒక టీచర్. నార్త్ ఇండియాలో పుట్టి పెరిగింది. ఆమెకు సుడోకు అంటే ఇష్టం.‘నేను మీ కోసం ఇంకోటి తెచ్చాను’ అంటూ బోసు మళ్ళీ బ్యాగ్ తీశాడు. ‘అదేంటో?’ ఆమె ముఖం చిన్నపిల్లలా అయోమయంగా కనిపించింది.‘అప్పుడెప్పుడో మీరు పిజ్జా తినాలనుంది అన్నారుగా! తెచ్చాను’ బోసు చెప్పాడు. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించి, ‘థాంక్యూ.. థాంక్యూ’ సంబరపడిపోయింది.అయితే బోసుకి నిరాశగా అనిపించింది. తానేమి ఆశించాడు? ఉద్వేగంతో గెంతుతుందనా? ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుందనా? కొన్నిసార్లు ఆఫీస్ వేళల్లో అతని మనస్సు ఆమె వైపు మళ్లుతుంది. అయితే ఇవేమీ తెలియని ఆమె తన ప్రపంచంలో తానుంటుంది. నిజానికి ఆమె నిశ్శబ్దాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది.కొన్నిసార్లు ఆమెను కలుసుకోవడానికి ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తాడు. ఆమె ఒంటరిగా ఉంటోంది. బోసు ఆమె నుంచి ఏం ఆశిస్తున్నాడో అతనికే తెలియదు. తెలియకుండానే అనుబంధం పెంచుకున్నాడు. ఏదో తెలియని పాశం ఆమె వైపు సూదంటు రాయిలా లాగుతుంది. ఆమె గురించి తెలుసుకోవాలని బోసు చాల తహతహలాడుతున్నాడు. అడిగేతే బావుంటుందా? తననూ మగవాళ్లందరిలో ఒకడిగా జమకట్టి.. తనతో స్నేహం మానేస్తే..! ఆ ఆలోచనే భరించలేకపోయాడు. కాని అతని కుతూహులం నస పెడుతూనే ఉంది.. ఆమె కథ ఏమై ఉండొచ్చు? అని! అయితే ఈమధ్యనే ఆమె గురించి ఒక విషయం తెలిసింది. అప్పటి నుంచి మనిషి మనిషిగా లేడు. తన వస్తువును తనకు కాకుండా చేస్తున్న ఫీలింగ్. ఒక రకమయిన పొసెసివ్‌నెస్ వచ్చేసింది.రెండు రోజులుగా ఆమెను కలవలేదు. ఆ రోజు ఆదివారం.. ఆఫీస్‌కి సెలవు. దానికి తోడు పెద్ద వాన. కిటికీలోంచి ముత్యాల సరాలులా పడే వానని చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ఇంతలో ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చింది. ఆమెకి బాగా జబ్బు చేసిందని చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనిషి నీరసించి ఉంది. అసలే బక్కపల్చటి మనిషి.. ఈ రెండు రోజుల అనారోగ్యం ఆమెను మరింతగా కుంగదీసినట్టుంది. దగ్గరగా వెళ్ళి సన్నగా పుల్లలా ఉన్న చేయి పట్టుకుని ఆప్యాయంగా అడిగాడు ‘ఎలా ఉంది? నాకు కబురు పంపిస్తే వచ్చేవాడిని కదా! నేను నీకేమీ కానా?’ అంటూ.ఆ ప్రేమకి అభిమానానికి కరిగిపోయింది ఆమె. అదేం కాదననట్లు తల అడ్డంగా ఊపింది. అతని చేయి గట్టిగా పట్టుకుంది. ‘కాసేపు కింద గార్డెన్‌లోకి వెళదాం. నాకు ఇక్కడ ఊపిరి ఆడటం లేదు’ అంది.‘సరే’ అని చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. ఆ సాయంకాలం.. వాళ్ళు మెల్లగా నడుస్తున్నారు. ఇద్దరి మధ్య బోలెడు కబుర్లు దొర్లాయి. ఆమె బలహీనమైన చేయి అతని చేతిలో ఉంది.‘నేను పెళ్ళి చేసుకోలేదు!’ ‘మీకు పెళ్ళయిందా? మీ వాళ్ళంతా ఎక్కడున్నారు?’ కాసేపటి క్రితం బోసు అనాలోచితంగా అడిగిన ఆ ప్రశ్నకు ఇప్పుడు జవాబు ఇచ్చింది.ఆశ్చర్యపోయాడు బోసు. మరి తను ఆ రోజు చూసిందేమిటి? ఆ దృశ్యాలు తనకిప్పటికీ గుర్తున్నాయి. ఆమె ఆ పిల్లలను కలుసుకోవడం గురించి ఎందుకు చెప్పటం లేదు? ఆమె ఎప్పుడైనా అలా చెప్పిందా, లేదా తను ఊహించుకున్నాడా? ఆమె డిమెన్షియాతో బాధపడుతోందా? అని మథనపడుతూనే ‘మరి ఆ పిల్లలు?’ అడిగాడు అప్రయత్నంగానే! ‘వాళ్ళు నావాళ్ళు కాదు’ అని చెప్పి వెంటనే ‘అంటే నా పిల్లలే, కానీ నేను వాళ్ళకి బయోలాజికల్ మదర్ని కాను’ అన్నది.బోసుకి గందరగోళంగా అనిపించింది, ‘మీరు వారిని దత్తత తీసుకున్నారా? క్లారిటీగా చెప్పండి’ బతిమాలుతున్నట్టుగా అడిగాడు.ఆమె నీరసంగా అతని వైపు చూస్తూ, ‘ఎక్కడయినా కూర్చుందాం. నా కాళ్ళు లాగుతున్నాయి’ అన్నది. ‘ఓ! సారీ.. పదండి’ అంటూ దగ్గరే ఉన్న బెంచ్ వైపు కదిలారు. ‘నేను ఎక్కువసేపు ఒకే చోట నిలబడలేను’ బెంచ్ మీద కూర్చుంటూ చెప్పింది. ‘అయ్యో సారీ.. నాకు తట్టనే లేదు’ నొచ్చుకుంటూ అన్నాడు. ఇద్దరూ ఒక్క క్షణం మౌనం వహించారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె, ‘వారు నా పిల్లలే.. కానీ నేను వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిని కాను’ ఆమె మళ్ళీ చెప్పింది. ‘స్కూల్ టీచర్‌గా పనిచేసే దాన్ని. అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉండేదాన్ని. అమ్మ వాళ్ళు ఊర్లో ఉండేవారు. నాకెందుకో పెళ్ళి అనే బంధం మీద ఇష్టం యేర్పడలేదు. దాంతో నా తల్లిదండ్రులు చాలా అసంతృప్తి చెందారు. ఆ కాలంలో ఒంటరిగా బతుకుతున్న స్త్రీని మీరు ఊహించుకోవచ్చు. నేను పెళ్ళి చేసుకుని, సెటిల్ అవ్వాలని మా పేరెంట్స్ కోరిక.కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. నేను వారిని ఏమనలేకపోయాను. అసలు పెళ్ళి మీద నాకు దృష్టే లేదు. ఏదో చెయ్యాలనే తపన. పెళ్ళి చేసుకుంటే చేయలేను. నా ఈ ఆలోచన మా పేరెంట్స్‌కి అర్థంకాలేదు. ఇందులో నా తప్పు కూడా కొంత ఉంది. వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయాను’ ఆయాసం రావడంతో కాసేపు ఆగి మళ్ళీ కొనసాగించింది,‘రోజూ స్కూల్ నుండి ఇంటికొచ్చాక.. మా ఏరియా చుట్టుపక్కలంతా చుట్టొస్తుండేదాన్ని. అలా నడుస్తున్నప్పుడు ఒక మురికివాడను చూశాను’ అంటూ ఆమె కళ్ళు మూసుకుంది. ‘ఏమైందప్పుడు?’ బోసు ఆత్రుతగా అడిగాడు.‘హు..?’ అంటూ ఆమె అయోమయంగా అతని వైపు తిరిగింది. ‘అదే మీ సాయంత్రం నడకలో ఒక మురికివాడలోకి వచ్చానని చెబుతున్నారు’ బోసు గుర్తుచేశాడు.‘ఆ.. అవును.. మురికివాడలో ఒక గుడిసె బయట.. ఒక మగ మనిషి, ఓ ఆడ మనిషి తీవ్రంగా కొట్టుకుంటున్నారు. మిగతావాళ్ళంతా నవ్వుతూ, ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. వాళ్ళను వారిద్దామనుకునే లోపల అక్కడ వినిపించిన కొంతమంది పిల్లల ఏడుపులు నన్ను ఆపేశాయి. అయిష్టంగానే వెనక్కి తిరిగాను. ఆ ఆడమనిషి ఆ పిల్లలను చెత్త కుప్ప మీదకు తోసేసింది. ఆమె మనసులోని దరిద్రమేదో ఆమె చేత ఆ పని చేయించి ఉండవచ్చు. ఏమైనా వాళ్ళు ఆమె పిల్లలు!తల్లిదండ్రులను భయంతో చూస్తున్నారు. ఏం జరుగుతుందో బహుశా.. వాళ్ళకు తెలుసు కాబోలు’ అని చెబుతూ ఆమె ఆపేసింది. మళ్ళీ కళ్ళు మూసుకుంటూ మౌనం వహించింది. ఆమె చెప్పిన కథలోని శకలాలు బోసును ఆశ్చర్యపరచాయి. అతను కూడా ఆందోళన చెందాడు. ఆమె తన గతం చెప్పటం అయిపోయిందా లేక కొనసాగిస్తుందా? అతనికి వేచి ఉండే ఓపిక లేదు. కానీ వినాలనే కుతూహలం అతను వేచి ఉండేలా చేసింది. బోసు టైమ్ చూసుకున్నాడు.. దిక్కులు చూశాడు. ఆమె తిరిగి చెప్పడం ఎప్పుడు మొదలుపెడుతుందా అని ఎదురుచూస్తున్నాడు. ఆవె కళ్ళు తెరిచింది. హమ్మయ్య అనుకున్నాడు బోసు. ‘నేను మళ్ళీ ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళాను. అదే దృశ్యం రిపీట్ అయింది. కానీ ఈసారి ఆ ఆడమనిషి తన పిల్లలను కొడితే నేను జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. చేసుకున్నాను కూడా. పిల్లల్ని కొట్టొద్దని ప్రాధేయపడ్డాను. ఆమె వినలేదు. అయితే ఆ బస్తీలో వాళ్ళు మటుకు ‘ఇది వీళ్ళు రోజూ ఆడే నాటకమే. మీరు పట్టించుకోకండి’ అని చెప్పారు. నా కన్సర్న్ అంతా ఆ అమాయకమైన పిల్లల గురించే.కొన్ని రోజుల తర్వాత.. ఒకసారి నేను స్కూల్‌కి వెళుతూండగా ఆ పిల్లలు రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించారు. మనసు చివుక్కుమంది. స్కూల్‌కి ఆలస్యమవుతున్నా.. వాళ్ళను వదిలి ముందుకు వెళ్ళలేకపోయాను’ అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని, ‘నేను ఆ పిల్లల దగ్గరకు వెళ్ళడం నాకిప్పటికీ గుర్తుంది. అంత చిన్న పిల్లలని ఆ తల్లిదండ్రులు అలా ఎలా రోడ్డు మీద వదిలేశారని ఆశ్చర్యపోయాను. అప్పుడే తెలిసింది. వాళ్ళంతా అనాథలని! దగ్గరలోని ఒక రెస్టారెంట్ నుండి వాళ్ళకు కావలసినవి తెచ్చిపెట్టాను. ఆ క్షణమే ఓ నిర్ణయానికి వచ్చేశాను. ముందు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ.. వాళ్ళు నాతో సన్నిహితంగా మెదిలేలా అలవాటు చేశాను’ అంటూ బోసు వైపు చూసింది.‘తర్వత ఏమైంది?’ ఉత్కంఠగా అడిగాడు బోసు. అచ్చు రాత్రిపూట.. తన అమ్మమ్మను కథ చెప్పమని అడిగే చిన్న పిల్లవాడిలా! ‘నేను వాళ్ళను నా అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చాను.’బోసు ఆమె వైపు చూశాడు. ఆమె భుజాలు వంచి.. కళ్ళు మూసుకునుంది. ‘తర్వాత?’ అడిగాడు అదే ఉత్కంఠతో! కళ్ళు తెరుస్తూ ఆమె బోసు వైపు తిరిగి ‘వాళ్ళు నాతోనే ఉన్నారు’ చెప్పింది నెమ్మదిగా. బోసులో అయోమయం.. ‘వారికి తల్లిదండ్రులు ఉన్నారు కదా! వాళ్ళ పిల్లలను మీరెలా తెచ్చుకున్నారు? వాళ్ళు అనుమతించారా? దత్తత గురించి మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారా?’ఆమె.. అతని నుండి కళ్ళు తిప్పుకుని, ముడుచుకున్న తన చేతులను చూసుకుంటూ ‘నేను వారి తల్లిదండ్రులతో మాట్లాడలేదు. అసలు మళ్ళీ ఆ బస్తీకే వెళ్ళలేదు’ అని చెప్పింది స్థిరంగా. ‘అంటే కిడ్నాప్ చేశారా వాళ్ళను? చెప్పకుండా తీసుకెళ్ళడమంటే అదే కదా?’ విస్తుపోతూ బోసు. ‘ఎంతమందిని తెచ్చారు?’ తేరుకుని అడిగాడు. ‘ఒక పన్నెండు మందిని! వాళ్ళకు ఒక హోమ్ ఏర్పాటు చేశాను. అది వాళ్ళిల్లు. కుక్, కేర్‌టేకర్‌ని పెట్టాను. చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు’ చెప్పింది. ‘అయినా సరే.. అది కిడ్నాప్’ అంటూ గట్టిగా అరిచాడు బోసు. మళ్ళీ వెంటనే ‘కాదు.. కాదు ఒకవేళ వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉండేదో!’ సాలోచనగా అన్నాడు. ఆమె వణుకుతూ మెల్లగా లేచింది. బోసు అలాగే నిశ్చేష్టుడై ఉన్నాడు.‘నేను ఇంక ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు రోజూ రాత్రి ఫోన్ చేస్తారు’ అంటూ అడుగులు వేసింది. ఆ మాటకి బోసు ఈ లోకంలోకి వచ్చాడు. గబుక్కున బ్యాగ్ తీసి ఆమెకు ఇచ్చాడు.‘థాంక్యూ మై డియర్ బాయ్’ అంటూ అతని చేతిని ముద్దు పెట్టుకుంది. ‘నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మనవడు ఉన్నాడు గ్రానీ..’ అంటూ ఆమె బుగ్గలు పుణికాడు బోసు. ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చి బోస్‌ని చూసి నవ్వింది. ఆ పెద్దామె చేయి పట్టుకుని ముందుకు నడిపించసాగింది. పెద్దావిడ వెళుతూ వెళుతూ వెనక్కితిరిగి బోసును చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.బోసుకి ఆమెను చూసినప్పుడల్లా ఏదో అనుబంధం లాగుతున్నట్టనిపిస్తుంది. బహుశా.. తన జీవితంలో ఎప్పుడూ చూడలేని అమ్మమ్మ , నాన్నమ్మలని ఆవిడలో చూసుకుంటూ ఉండొచ్చు. అమ్మ చిన్నప్పుడే అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ పోయారు. అలా అమ్మమ్మ పరిచయమే లేకుండా పోయింది. తన అయిదవ ఏట నానమ్మ పోయింది. అలా నానమ్మ జ్ఞాపకమూ మిగల్లేదు. చిన్నప్పటి నుంచి హాస్టల్ చదువుతో అమ్మానాన్నలకూ దూరంగానే ఉన్నాడు. అంత బాండింగ్ లేదు.వాళ్ళు చూపించే ప్రేమానురాగాలు తనకు అతిగా అనిపించేవి. అందుకే వాళ్ళ నుంచి ప్రైవసీ కోరుకున్నాడు. సొంతూళ్ళో ఉద్యోగం వచ్చినా ఇలా ఇంకో ఊరికి మార్పించుకుని వచ్చాడు. అతని తల్లిదండ్రులు కొడుకు కోసం మొహం వాచిపోయున్నారు. ఉండబట్టలేక ఫోన్లు చేస్తే.. విసుక్కుంటాడు. పొడిపొడిగా మాట్లాడి సెకన్లలో కాల్ ముగించేస్తాడు. వాళ్ళెప్పుడు రమ్మన్నా వెళ్ళకుండా సాకులు వెదుక్కుంటుంటాడు. అలాంటి తనకు ఆ ఎనభై ఏళ్ల ఆ వృద్ధురాలు కనువిప్పు కలిగించింది. అనాథల కోసం అవివాహితగా మిగిలిపోయింది. వాళ్ళకు అమ్మ అవడం కోసం తన కుటుంబాన్ని వదులుకుంది.ఫోన్ మోగుతోంది. పనిలో ఉన్న శ్యామల గబగబా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ‘హెలో..’ అంది. ‘ఎవరూ?’ అని ఆత్రంగా అడుగుతూ ఆమె భర్త శ్రీనివాస్ వచ్చాడు. ‘హుష్..’ అని భర్తకు సైగ చేసింది. ‘వాడేనా?’ కుతుహులం పట్టలేక గుసగుసగా అడిగాడు శ్రీనివాస్. కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా అవునన్నట్టుగా తలూపింది. ‘ఎలా ఉన్నావు నాన్నా?’ ఫోన్ మాట్లాడుతూ అక్కడే టేబుల్ మీదున్న బోసు ఫొటోను ప్రేమగా స్పృశించింది శ్యామల. – మణి వడ్లమానిఇవి చదవండి: 'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై.. -
యథార్థ కల్పితం
కథ బయట ఆకాశం నిండా నల్లటి మబ్బులు పరుచుకుని ఉన్నాయి. ఉండుండి ఉరుములు మెరుపులు వస్తున్నాయి. లోపల వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్‌గా ఉంది. రూమ్ అంతా నీలిరంగు కాంతి పరుచుకుంది. మూడు కుర్చీలు, మధ్యలో గుండ్రటి పెద్ద గ్లాస్ టీపాయ్ ఉన్నాయి. దానిమీద ఐస్ క్యూబ్స్ ఉన్న ఫ్లాస్క్. ఆ పక్కనే అందమైన ప్యాకింగ్‌తో రెండు పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి. దానిపక్కనే ఖరీదైన క్రిస్టల్ బౌల్లో వేయించిన జీడిపప్పు పెట్టి ఉంది. ఆ గదిలోకి రాగానే వింత పరిమళం. దాన్ని ఆస్వాదిస్తూనే ముగ్గురూ లోపలికి వచ్చారు. ఈ ఊర్లోనే ఉండే రెండో మిత్రుడు, ‘‘అబ్బ, ఈ స్మెల్ ఏదో లోకాలకి తీసుకెళుతోంది గురూ!’’ అంటూ కన్నుగీటాడు. దానికి సమాధానంగా అమెరికా నుండి వచ్చిన మిత్రుడు, ‘‘అదేంటి? ఇది నువ్వు అరేంజ్ చేసింది కాదా?’’... అన్నాడు. ‘‘లేదు లేదు, నేను చెయ్యలేదు’’ అని మళ్లీ ‘‘మన గురూజీకి నాకన్నా ఇక్కడ పరపతి ఎక్కువ. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్లతో మంచి ర్యాపో ఉంది. అంతా తనే చేశాడు. అందుకే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది అరేంజ్మెంట్’’ అన్నాడు ఇక్కడే ఉండే రెండో మిత్రుడు. అంతవరకు మౌనంగా వీళ్ల వెనకాలే ఉన్న మూడో మిత్రుడు, ‘‘బాబూ! మా పల్లెటూళ్లోని హాస్పిటల్‌కి మీలాంటి పెద్దవాళ్ల సహాయ సహకారాలు ఉండాలి. అందుకే మిమ్మల్ని ఇలా సంతోషపెట్టాలని నా తాపత్రయం’’ అని నవ్వుతూ అన్నాడు. ‘‘గ్రేట్! నీకు మంచి టేస్ట్ ఉందని అర్థమైంది మిత్రమా!’’ అంటూ అమెరికా మిత్రుడు భుజం తట్టాడు. ‘‘ఎంతైనా హృదయ స్పందనల గురించి తెలిసున్నవారు, అమెరికాలో పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించిన హృదయాధిపతులు కదా! అందుకే బాబూ... నన్ను పొగడుతున్నావో, కిందకి లాగేస్తున్నావో తెలియటం లేదు. నాలిక పీకేస్తోంది. బ్లాక్ వెల్వెట్ పిలుస్తోంది. రా! రా!’’... అన్నాడు. ‘‘ఓ ఎస్, అన్నీ రెడీగానే ఉన్నాయి. మన నైట్స్ కూడా ఇక్కడే కాబట్టి ప్రాబ్లం లేదు. డిన్నర్ కూడా ఈ గెస్ట్‌హౌస్‌లో ఉన్న కుక్ చేసి పెట్టేస్తాడు. సో, ఈ రాత్రి కేవలం మన ముగ్గురి కోసమే. ఐదేళ్ల క్రితం ఎవరి దారిన వాళ్లం. చాలారోజుల తరువాత కలుసుకున్నాంగా, ఎంజాయ్ చేద్దాం. సరేనా!’’ అన్నాడు మూడోమిత్రుడు. ‘‘బయట వాతావరణం బాగా చల్లబడిపోయింది. బే ఆఫ్ బెంగాల్లో తుపాన్, దాని ప్రభావంతో రెండు రోజుల వరకు కుంభవృష్టి కురిసే సూచన అని ఇప్పుడే న్యూస్ అప్డేట్ వచ్చింది’’ అన్నాడు ఇక్కడే ఉండే మిత్రుడు. ‘‘నాకు ఎందుకో ఈ ముసురు అంటే అసహ్యం’’ అన్నాడు ఉన్నట్టుండి అమెరికా నుంచి వచ్చిన మిత్రుడు. ఒక నిమిషం పాటు మౌనంగా ఉండిపోయారు అందరూ. ‘‘అరె అదేమిటి! అందరూ అలా సెలైంట్ అయిపోయారు? ఇప్పుడు ఏ దేశ నాయకుడూ మరణించలేదు. చీర్ అప్ ఫ్రెండ్స్. నాకు మటుకు ఇలాంటి సమయంలో కథలు చెప్పుకోవాలనిపిస్తుంది’’ అని పల్లెటూరిలో ఉండే మూడోమిత్రుడు అన్నాడు. ‘‘అవునవును, నాకేమో చెప్పడం కన్నా వినడం ఇష్టం’’ అని రెండో మిత్రుడు అన్నాడు. ‘‘నాక్కూడా వినడమే ఇష్టం’’ అని అమెరికా మిత్రుడు అన్నాడు. అమెరికా మిత్రుడు కొంచెంసేపు గడిచాక, మూడోమిత్రుడితో, ‘‘అవునూ, ఇన్నాళ్లూ ఏమైపోయావు? నా పెళ్లికి పిలిచాను, తరువాత నేను అమెరికా వెళ్లాక కూడా నీ కాంటాక్ట్ కోసం ట్రై చేశాను. ఎందుకో ఎక్కడా చిక్కలేదు నువ్వు. లక్కీగా ఈ సెమినార్లో కనిపించావు. థాంక్ గాడ్’’ అన్నాడు. ‘‘అవును. నేను కూడా త్రీ మంత్స బ్యాక్, అనుకోకుండా కలవడం జరిగింది. ఆ పల్లెటూరిలో ఎంతో చక్కటి నర్సింగ్ హోమ్ రన్ చేస్తున్నాడని, అక్కడ ఉండేవాళ్లు అందరూ డాక్టర్ దేవుడు అంటారని కూడా తెలిసింది’’ అని రెండో మిత్రుడు అన్నాడు. ‘‘అదే, మా ఊరిలో నర్సింగ్ హోమ్ పనులతో కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. నా గురించి అంత పొగడద్దు. మానవత్వం, మనిషిగా మనిషికి సాయం చేయడం అంతే. జీవితంలో కొన్నిసార్లు మనం అనుకోకుండానే, అడగకుండానే సహాయం చేస్తాం. డాక్టర్ అవడం వల్ల అనుకున్నవి చేసేందుకు ఎక్కువ అవకాశం వస్తుంది. అంతే! సరే సరే, ముందు ఇవి తీసుకోండి’’ అని గెస్ట్‌హౌస్‌లో ఉండే సర్వెంట్ రెడీ చేసిన గ్లాసులు చేతికి ఇచ్చాడు. పైగా ‘‘కరెక్ట్‌గానే ఫిక్స్ చేశానా’’ అని కూడా అన్నాడు ‘యా! యా! గుడ్’ అంటూ ఛీర్స చెప్పుకున్నారు. ‘‘సరే నువ్వు కథ చెప్పడం మొదలుపెట్టు మిత్రమా’’ అని అమెరికా మిత్రుడు అన్నాడు . ‘‘కథ నేను చెబు తాను. పాత్రలని మీరు ఊహించుకోండి’’ అని అన్నాడు మూడో మిత్రుడు. అప్పుడు కూడా ఇలాగే ముసురు, తుపాను, ఆగకుండా వర్షం అంటూ చెప్పసాగాడు. అమెరికా మిత్రుడు కుతూహలంతో ముందుకు వంగి వినసాగాడు. కుక్కిమంచంలో ఓ మూలకి ముసలాడు ముడుచుకొని కూచున్నాడు. ఒకటే ముసురు..! ఆకాశానికి చిల్లుపడినట్లు... ఆగకుండా వర్షం..! ఎక్కడా తెరిపిలేదు, కురుస్తూనే ఉంది! తుపానుట, మూడు రోజుల వరకు తగ్గదుట, బిక్కుబిక్కుమంటూ ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని భయంభయంగా ఉన్నారు అందరూ. ‘చుట్ట ఉంటే బాగుండేది’ అని గొణుక్కుంటున్నాడు ముసలాడు. ‘‘ఎహే! నీలో నువ్వు మాట్లాడుకోమాక, బయటకు చెప్పు’’ అని కసిరాడు కొడుకు. ‘‘నాకు తెలుసు, నాకు తెలుసు! తాతయ్య ఏమన్నాడో?’’ గెంతుతూ అన్నాడు మనవడు. ‘‘ఏందిరా, మధ్యలో నీ గోల! ఈ పూటకి గంజినీళ్లయినా దొరుకుతాయో లేదో అని నేను గుబులుపడి ఛస్తున్నాను’’ అని మొగుడి వైపుకి తిరిగి, ‘‘ఏందయ్యో, అట్టా గమ్మున కూకుంటే కూడు మన నోటికాడకు రాదు, ఓపాలి బయటకు వెళ్లి, ఎవరినన్నా అడగరాదూ? ఎన్ని రోజులని అర్ధాకలితో ఉంటాము’’ గట్టిగా అరిచింది ముసలాడి కోడలు. ‘‘ఒరే కొడకా! ఈ ముసురులో మిరపకాయ బజ్జీలు, బొమ్మిడాల పులుసు, తిని లంక పొగాకు చుట్ట కాలిస్తే, నా సామిరంగా! సొరగం, సొరగం కని పిస్తుందిరా’’ అని ముసలాడు కొడుకుతో ఎంతో తన్మయత్వంగా చెప్పాడు. ‘‘భలే ! భలే! తాతకి సొరగం కావాలిట, సొరగం’’ ముసలాడిని ఆట పట్టించాడు మనవడు. ముసలాడి మాటలకి కొడుకు మొహం చిన్నబోయింది. ‘‘ఎదవ జన్మ, ఎదవ జన్మనీ... కడుపు నిండా అయ్యకి ఇంత కూడెట్టలేకపోతున్నాను, థూ! ఏం బతుకులే మనవి’’ అని పెళ్లాంవైపు తిరిగి బాధగా అన్నాడు. ‘‘ఊరుకో మావా! ఏం చేస్తాం, ఆ దేవుడికి దయలేదు. మనకింతే ప్రాప్తం, ఏదో ఉండబట్టలేక అనేశాను, నాకు మాత్రం తెల్దా ఏంటి?’’ అని మొగుడితో అభిమానంగా అంది. ‘‘నేను మటుకు ఏం చెయ్యనే, బయటికి వెళదామంటే మాయదారి వాన తగ్గటం లేదు. నాకూ బాధగానే వుంది. రోజూ వచ్చే కూలీ పోయింది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి’’ అని వాపోయాడు మొగుడు. ‘‘బాధపడమాక మావా’’ ఓదార్పుగా భుజం తట్టింది. పొద్దున్నే తినగా మిగిలిన అన్నం, కొంచెం నూకలతో కాచిన గంజిలో... ఒక ఎండిపోయిన ఉల్లిపాయని నంజుకొని నలుగురూ సర్దుకొని తిన్నారు. ‘అమ్మా కొంచెం కావలె’ అంటూ పిల్లాడు కొంతసేపు వాగివాగి పడుకున్నాడు. వాడి పక్కనే తల్లి ముడుచుకొని పడుకుంది. ఇంతలో ‘అమ్మో అమ్మో అందరం చచ్చిపోతున్నామే, భయం వేస్తోంది’ అంటూ నిద్దట్లోనే ఏడుస్తున్నాడు పిల్లాడు. వెంటనే వాడిని పట్టుకొని ‘ఒరే అయ్యా! నేను నీ పక్కనే ఉన్నానురా! భయపడమాక. ఏటీ అవలేదు’ అంటూ వాడిని దగ్గరకు తీసుకుంది. ‘తినడానికి తిండి దొరకనప్పుడే ఆకలేస్తుంది అదేమిటో, చిత్రంగా!’... మనసులోనే అనుకుంది. ఇంతలో తడికని ఎవరో కొట్టినట్లు చప్పుడయ్యింది. ‘‘మావా! ఎవరో తలుపు కొడుతున్నారు’’ అంది. ‘‘ఎహే గాలికి కొట్టుకుంటోంది, ఈ తుఫానులో ఎవరొస్తారు’’ విసుగ్గా అన్నాడు మొగుడు. ఈసారి గట్టిగా తడికను బాదిన చప్పుడు ఇద్దరికీ వినిపించింది. అప్పుడు అతను గట్టిగా అరిచాడు ‘ఎవరూ’ అంటూ. జవాబుగా ‘తలుపు తీయండి ప్లీజ్’ అంటూ ఒక సన్నటి గొంతు వినిపించింది. గబాగబా వెళ్లి తడికగొళ్లెం తీసేసరికి ఎదురుగా ఒక యువతి, యువకుడు తడిసిపోయి ఉన్నారు. ‘‘మేము ఇంట్లోకి రావచ్చా, ప్లీజ్’’ అని మొహమాటంగా ఆ యువతి అభ్యర్థించింది. ఆ మాటలకి అంతవరకూ బొమ్మలా నిలబడ్డవాడు, ‘లోపలికి రండి బాబూ. ఇలా కూకోండి’ అంటూ, పడుకున్న ముసలాడిని లేపి ఆ కుక్కి మంచాన్ని చూపించాడు. ఇద్దరూ మొత్తం తడిసిపోయి ఉన్నారు. ఆ యువకుడిని నెమ్మదిగా ఆ మంచంమీద పడుకోబెట్టి, చుట్టూ చూసింది. అక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఆ ఇంట్లో కప్పుకోడానికి దుప్పటి కూడా దొరకదని అర్థమైంది. పోనీ కొంచెం వేడివేడిగా టీ పడితే అనిపించి అటూ ఇటూ చూసింది. అది గమనించిన ఆ ఇంటామె ‘‘ఏం కావాలమ్మా?’’ అని అడిగింది. ‘‘కొంచెం టీ ఏమన్నా దొరుకుతుందా?’’ అని సందేహిస్తూ అడిగింది ఆ యువతి. ఏమీ చెయ్యలేని అశక్తతతో తలను అడ్డంగా ఊపింది. ‘‘పోనీ బయట ఏదైనా హోటల్లో దొరుకుతుందా?’’ అని అంటుండగానే ఆమెకి అర్థమైంది అది ఒక వృథా ప్రయత్నం అని. పెద్ద వాన పడటం, దారి కనిపించక పోవడం, కారు పంటపొలాల మధ్యలో ఆగిపోవడం, కారును స్టార్ట్ చేసే ప్రయ త్నంలో ఇద్దరూ జడివానలో తడవటం, అంతకుముందు రోజు కూడా వాటర్ ఫాల్లో నీళ్లలో తెగ నానడం... ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి వరుసగా జరగడంతో అతని శరీరం తట్టుకోలేక అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చేసింది. అసలు తను స్పృహలోనే లేడు. బట్టలు మార్చి పొడిబట్టలు వేయడానికి వేరే జతలేదు. బ్యాగ్ కూడా కారులో ఉండి పోయింది. అయినా కారు డిక్కీలోకి కూడా నీళ్లు వచ్చేశాయి. బహుశా అవి కూడా తడిసిపోయి ఉంటాయి. ఇలాంటి పరి స్థితిలో ఆ చలి, నెమ్ము నుంచి కాపాడా లన్న తన ప్రయత్నం ఎంతవరకు ఫలి స్తుంది! ఈ తుపాను రాత్రి, ఈ చల్లటి గాలిలో ఏదైనా జరగరానిది జరిగితే... ఆ ఊహే భయంకరంగా అనిపించింది ఆమెకి. గుడిసెలో గుడ్డిదీపం ఒకటి వెలుగు తోంది. ఉన్న కొద్దిపాటి వెలుతురులో ఆ యువతి నాలుగువైపులా చూసింది. కునికి పాట్లు పడుతూ కూచున్నారు ఆ భార్యా భర్తలు. ‘అమ్మా చలేస్తుందే, గట్టిగా పట్టు కోవే’ అంటూ పిల్లాడు తల్లిని బల్లిలా అంటుకుపోతున్నాడు. తల్లి కొడుకును ఆప్యాయంగా దగ్గరగా ఒడిసిపట్టుకుంది. అంతే, కొంతసేపటికల్లా వాడు ప్రశాంతంగా నిద్రపోయాడు. ఎదురుగా ఉన్న కుక్కిమంచంలో ఆ యువకుడు చలికి తట్టుకోలేక వణికిపోతున్నాడు. పక్కనే కూచున్న ఆ యువతి అతని చెయ్యి పట్టుకుని భయంగా, దిగులుగా చూస్తూనే ఉంది. వాళ్లని చూస్తున్న ఆ ఇంటామె మనసులోకి ఒక ఆలోచన వచ్చింది, అది రావడమే తడవు మొగుడి పక్కకు తిరిగి అతని చెవిలో ఏదో చెప్పింది. అతను ‘సర్లేవే! అట్టాగే, కాకపోతే ఈ ముసిలాడితోనే కొంచెము కట్టమేమో?’ అన్న్డాడు. ఆ యువతి దగ్గరకు వెళ్లి ‘‘అమ్మా, మేము బయటి అరుగుమీద పడుకుం టాము. మీరు హాయిగా నిద్రపోండి, ఏమీ భయం లేదు’’ అని చెప్పింది. ‘‘అయ్యో ఇంత వాన, చలిలో మీరు అందరూ బయట ఎలా పడుకుంటారు? వద్దు’’ అని అంది. ‘‘మాకేటి పరవాలేదు. మాకిది అలవాటే. మీరు ఏమీ ఆలోచించ కుండా పడుకోండి’’ అని ఆమె మొగుడు చెప్పాడు. ‘నా చుట్టలేయే కోడలా’ అని ముసలాడు గొణుగుతున్నాడు. మెల్లగా ఒకరి తరువాత ఒకరు, గుడిసె తడిక తీసికొని, బయటకు వెళ్లి గుమ్మానికి పక్కనే ఉన్న మట్టి అరుగుమీదకి చేరారు. రివ్వున చల్లటిగాలి తగిలింది. ‘‘అయ్యో చచ్చిపోతానే ఈ చలికి’’ అంటూ ముసలాడు గట్టిగా అరిచాడు. ‘‘ఉష్, గట్టిగా అరవకు, ఇంద నీకు చుట్ట ఇస్తాను. అది కాల్చుకుంటూ కూకో’’ అన్నాడు కొడుకు. ‘‘అబ్బో! చుట్టే! అయితే ఎంత చలినయినా కాసేస్తాది’’ అంటూ మురిసిపోయి హుషారుగా‘ ఈ రేయి నన్నొల్లకే నా రంగసాని’ అంటూ పాడు కుంటున్నాడు. ‘‘అబ్బో! ముసలోడికి చుట్టలుంటే దసరా పండగే’’ అని కోడలు సరదాగా అంటూ కొడుకుని దగ్గరకు తీసుకొంది. చూరు నుంచి నీళ్లు కారుతున్నాయి. ఎంత వెనక్కి ముడుచుకొని కూచున్నా మోకాళ్ల వరకు ధార కొడుతూనే ఉంది. పిల్లాడు మాత్రం ‘లోపలకి పోదామే, తడిసిపోతున్నాము’ అంటూ ఏడుపు మొదలెట్టాడు. ఎలాగో వాడిని సముదా యించి, దగ్గరకు తీసుకొని, తన చేతులని వాడికి రక్షణ వలయంలా చేసి, ఉన్న ఒక పాతచీరను వాడికి కప్పింది. చాలాసేపు మేలుకునే ఉన్నారు కానీ, ఎప్పుడు కళ్లు మూతలు పడ్డాయో తెలియ లేదు. ఆ యువతి, యువకుడు వచ్చి వాళ్లని తట్టి లేపేసరికి రాత్రి జరిగినది గుర్తుకువచ్చి, ఆమె గభాల్న లేచి చుట్టూ చూసింది. తెలతెలవారుతోంది. పక్షుల కిలకిలలు, కోడికూతలు వినిపిస్తున్నాయి, వాన జోరు కూడా తగ్గింది. చిన్నగా తుంపర మాత్రం పడుతూనే ఉంది. రాత్రి పడుకోవటం వల్ల ఆ ఇద్దరి మొహాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఆమెని చూస్తూ, ‘‘చాలా థ్యాంక్సండీ, మీరు చేసిన సాయానికి’’ అన్నాడు ఆ యువకుడు. అప్పుడు ఆమె అమాయకంగా, ‘‘ఏదో నాకు తెలిసినదే చేశాను. ఇందులో అంత గొప్పతనమేమీ లేదు బాబు. ఇలా వానల్లో, తుపాన్లలో తడవడం, వణకడం అన్నీ మామూలే మాకు. పాపం మీరే సానా ఇబ్బంది పడ్డారు’’ అంది. ఇంతలో యువ కుడి ఫోన్ మోగింది. యువతి ఆమెకు డబ్బులివ్వ బోయింది. ‘‘ఒద్దమ్మా! మీరి ద్దరూ చల్లగా ఉంటే అదే చాలు. అయినా మాకు ఎందుకు తల్లీ అంత డబ్బు. వద్దమ్మా’’ అని దృఢంగా అంది. చేసేదేమీ లేక ఆ యువతి, యువకుడు వెళ్లిపోయారు. ‘‘కథ కంచికి... మనం డిన్నర్ చేయటానికి’’ అని కథ చెప్పటం ముగించాడు మూడో మిత్రుడు. ‘‘పాపం, డబ్బులు కూడా వద్దనే పిచ్చివాళ్లు కూడా ఉంటారని నీ కథ ద్వారా అర్థమైంది’’... రెండో మిత్రుడు అన్నాడు. అమెరికా మిత్రుడు ఏదో ఆలోచిస్తూ, ‘‘ఈ కథ... అని అర్థోక్తిలో ఆగి, కొన్ని డౌట్స్ ఉన్నాయి మిత్రమా, ఇది నిజంగా జరిగిన కథా?’’ అన్నాడు. దానికి మూడో మిత్రుడు ‘‘ఇదో యథార్థ కల్పితం, దీని గురించి అంతకన్నా ఎక్కువ ఆలోచించకండి. రండి డిన్నర్ చేద్దాం’’ అంటూ ఇక ప్రశ్నలకి తావివ్వకుండా అన్నాడు. రాత్రి డిన్నర్ చేసేసి, ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు. కొంచెం సేపయ్యాక రెండో మిత్రుడు, ‘‘నాకు నిద్దరపట్టటం లేదు మిత్రమా! నీ కథ వెంటాడ్తోంది. అందులో యువకుడు ఎవరు? ఆ యువతి ఏమైంది? తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల వేయి ముక్కలైపోతుంది సుమా! జాగ్రత్త’’ అని తర్జనితో బెదిరించాడు. ‘‘చాలా రాత్రయింది వెళ్లి పడుకో. పొద్దున్న చెబుతాలే!’’ అన్నాడు మూడో మిత్రుడు. తన గదిలోకి వెళ్లిపోయాడు రెండో మిత్రుడు. మరునాడు ఉదయం, ఫోన్ రింగ్‌తో తెలివి వచ్చింది మూడో మిత్రుడికి. ఇంతలో గెస్ట్‌హౌస్ నౌకరు వచ్చి, ఒక ఉత్తరం చేతికిచ్చి ఆ అమెరికా సార్ ఏదో పనుందని పొద్దున్నే వెళ్లిపోయారు. మిమ్మల్ని నిద్ర లేపుతానంటే వద్దని చెప్పారు. ఆయన రూమ్‌లో మీ పర్సు మర్చిపోయారట రాత్రి. దానితోపాటే ఈ కాగితం కూడా మీకు ఇమ్మన్నాడు’’ భయం భయంగా చెబుతూ పర్సుతో పాటు ఉత్తరం కూడా ఇచ్చాడు. దాన్ని అందుకొని విప్పి చదవసాగాడు. ఇంతలో రెండో మిత్రుడూ వచ్చి, జరిగింది చూసి, తను కూడా ఉత్తరంలోకి తొంగిచూశాడు. అందులో, ‘‘మిత్రమా! నువ్వు చెప్పిన కథ యథార్థ కల్పితం కానే కాదు. అది పూర్తిగా యథార్థమే. అందుకే నిజంగా నువ్వు దేవుడివే’’ అని రెండే రెండు వాక్యాలు రాసి ఉంది. అర్థం కాక ప్రశ్నార్థకంగా మొహం పెట్టిన రెండో మిత్రుడికి ‘‘నిన్న రాత్రి నువ్వు అడిగిన కథలోని యువతి ఈమె’’ అని తన పర్సులో ఫొటో చూపించాడు మూడో మిత్రుడు. ‘‘ఆమె, పక్కన నువ్వు... అంటే అర్థమైంది... మరి ఆ యువకుడు?’’ అడిగాడు చప్పున. ‘‘అదే, నువ్వు ఊహించినదే’ అన్నాడు మూడో మిత్రుడు పర్సు మూస్తూ. మరుక్షణం అమెరికా ఫ్రెండు కళ్లముందు కదిలాడు. ‘‘అంటే తను మోసగించిన అమ్మాయిని...’’ చిన్నగా నవ్వాడు మూడో మిత్రుడు. ‘‘నువ్వు నిజంగానే దేవుడివిరా’’ అంటూ అతణ్ని వాటేసుకున్నాడు రెండో మిత్రుడు. - మణి వడ్లమాని