breaking news
Management Institutes
-
తగ్గిన క్యాంపస్ జాబ్స్.. 101 కాలేజీల మూసివేత
న్యూఢిల్లీ : ప్రాంగణ నియమాకాలు తగ్గడం, కళాశాలల్లో సీట్ల మిగులు పెరగడంతో 2017-18 సంవత్సరానికి గాను స్వచ్ఛంద మూసివేతకు అనుమతి ఇవ్వాల్సిందిగా దేశ వ్యాప్తంగా దాదాపు 100 మేనేజ్మెంట్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నట్లు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) తెలిపింది. జాతీయ సాంకేతిక విద్య సమాఖ్య(ఏఐసీటీఈ) వివరాల ప్రకారం మేనేజ్మెంట్ కోర్సులైన ఎంబీఏ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ కోర్సును అందించే ఈ 101 బిజినెస్ స్కూల్స్‌లో అత్యధిక భాగం ఉత్తరప్రదేశ్ (37)కు చెందినవి కాగా తరువాతి స్థానాల్లో కర్ణాటక (10), మహారాష్ట్ర (10) నిలిచాయి. ఈ దరఖాస్తుల్లో ఎక్కువ శాతం కళాశాలలు మూసివేతకు అనుమతి పొందుతాయని అధికారులు తెలిపారు. ఏఐసీటీఈ నివేదికి ప్రకారం 2015-16 సంవత్సరంలో 66 కళాశాలలు, 2016-17లో 76 మేనేజ్మెంట్ సంస్థలు మూతపడినట్లు వెల్లడించారు. కారణాలు ఇవే... ‘కొన్నాళ్ల కిందట మేనేజ్మెంట్ విద్య ఐఐఎమ్‌ల్లో, కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ మార్కెట్లో మేనేజ్మెంట్ కోర్సులు చదివిన విద్యార్థులకు డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో మేనేజ్మెంట్ కళాశాలను ఏర్పాటు చేసింది. కానీ సరైన వసతులు, ప్రావీణ్యం కల అధ్యాపకులను నియమించడంలో వెనకబడింది. దాంతో ప్రాంగణ నియమాకలు తగ్గాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 3వేల సాంకేతిక, మేనేజ్మెంట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో చాలా కళాశాలలు కనీస నిబంధనలను కూడా పాటించడం లేదు. విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించడంలో విఫలమవుతున్నాయి. దాంతో ఏటా ప్రాంగణ నియమాకాలు తగ్గిపోతున్నాయి. 2016-17 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 1.50 లక్షల మంది ఎంబీఏ పట్టభద్రులు మాత్రమే ప్రాంగణ నియమాకాల ద్వారా ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం మూతపడనున్న 101 కాలేజీల వల్ల 10 వేల సీట్లు తొలగించబడతాయి. ఇవేకాక మరికొన్ని సంస్థలు కేవలం మేనేజ్మెంట్ కోర్సులను మాత్రమే రద్దు చేయాల్సిందిగా ఏఐసీటీఈని కోరాయి. ఫలితంగా మరో 11 వేల సీట్లు తొలగించబడతాయ’ని ఏఐసీటీఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ స్పందన... ప్రాంగణ నియామకాలు లేకపోవడమే కళాశాలల మూసివేతకు ప్రధాన కారణమని ఏఐసీటీఈ చైర్మన్ ఎస్ఎస్ మంథ తెలిపారు. కళాశాలల మూసివేతను ప్రభుత్వం పెద్ద సమస్యగా భావించడం లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్ సుబ్రమణ్యం అన్నారు. ‘నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలలు స్వచ్ఛందగా మూతబడటం మంచి విషయమే. ఎందుకంటే ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలనుకుంటుంది. దానికి నంబర్లతో పనిలేదు. విద్యాప్రమాణాలను పెంచడం కోసం ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా కళాశాలల గుర్తింపు కోసం మెనటర్‌షిప్ విధానాన్ని, విద్యార్థుల కోసం ఇండక్షన్ కార్యక్రమాలను రూపొందించింది. విద్యార్థులకు, పరిశ్రమకు మధ్య వారధి నిర్మించి అర్హులైన వారి ఉపాధి కల్పనకు ప్రభుత్వ కృషి చేస్తుంద’ని చెప్పారు. -
నైపుణ్యాలతోపాటు నైతిక విలువలూ నేర్పాలి
గెస్ట్ కాలమ్ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడుగుపెట్టడం.. అకడమిక్ ప్రతిభతో కార్పొరేట్ కొలువులు ఖాయం చేసుకోవడం.. ఇప్పుడు యువత లక్ష్యం ఇదే! అయితే విద్యార్థులకు అకడమిక్ నైపుణ్యాలతోపాటు నైతిక విలువలూ నేర్పించాలి అంటున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- కోజికోడ్ డెరైక్టర్ ప్రొఫెసర్ దేబాశిష్ ఛటర్జీ. మేనేజ్మెంట్ విద్య, ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ.. మేనేజ్మెంట్ విద్య.. సవాళ్లు అనేకం ప్రస్తుతం దేశంలో మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌తోపాటు విద్యార్థులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. భారతదేశం వ్యాపార, వాణిజ్య రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుండటం.. ఆయా దేశాలకు దీటుగా నూతన సంస్కరణలు, అవకాశాలపై దృష్టిపెట్టడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో అకడమిక్ స్థాయి నుంచే ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కల్పించడం తప్పనిసరిగా మారింది. వ్యక్తి నైపుణ్యాలను పరిశ్రమకు అవసరమైన స్కిల్స్‌తో సమీకృతం చేసి సంఘటిత శక్తిగా మార్చడం.. తద్వారా సుస్థిరమైన, దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదం చేయడం అతిపెద్ద సవాలు. అకడమిక్ ఇన్స్టిట్యూట్లు, పరిశ్రమలు కలిసి సంయుక్తంగా ముందుకు సాగితేనే ఈ సవాలును దీటుగా ఎదుర్కోగలం. అప్పుడే సమాజ అవసరాలు, లక్ష్యాలు నెరవేరతాయి. అందుకే ఐఐఎం-కోజికోడ్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తోంది. విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కలిగేలా ఎకనామిక్ థియరీస్ నుంచి హ్యుమానిటీస్, సోషియాలజీ వంటి ఎన్నో కోర్సులను అందిస్తోంది. వ్యాపార, పారిశ్రామిక రంగ సమస్యలకు సరికొత్త పరిష్కారాలు చూపేలా కృషి చేస్తున్నాం. అకడమిక్ నైపుణ్యాలతోపాటు విద్యార్థులు కేవలం అకడమిక్ నైపుణ్యాల సాధనకే పరిమితం కావడం సరికాదు. నైతిక విలువలు, సామాజిక స్పృహ కూడా పెంచుకోవాలి. కోర్సు, కెరీర్, ఇండస్ట్రీ.. ఏదైనా తుది లక్ష్యం సమాజ ప్రగతికి దోహదపడటమే. కాబట్టి విద్యార్థులు తరగతి గది పాఠాలకే పరిమితం కాకుండా.. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించాలి. భవిష్యత్ కార్పొరేట్ లీడర్లుగా మారనున్న విద్యార్థులకు తమ చుట్టూ చోటుచేసుకుంటున్న మార్పులపై అవగాహన అవసరం. లీడర్షిప్, మేనేజీరియల్ స్కిల్స్ క్లాస్ రూం లెక్చర్స్తోనే సొంతం కావు. ప్రతి విద్యార్థి సొంతంగా ఫీల్డ్ ప్రాక్టీస్ ద్వారా నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. సహజ నైపుణ్యాలు గుర్తించాలి ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు జాబ్ గ్యారెంటీ కోర్సులను, కెరీర్‌ను ఎంచుకోవడం సహజం. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ మిగతా కోర్సులకంటే ముందంజలో ఉందనేది నిస్సందేహం. కానీ ప్రతి విద్యార్థికి కొన్ని సహజ నైపుణ్యాలు ఉంటాయి. వాటిని గుర్తించి, ఆ రంగంలో అడుగుపెడితే మేనేజ్మెంట్కు మించిన అవకాశాలు సదరు రంగంలో సొంతం చేసుకోవచ్చు. అందుకే ప్రతి విద్యార్థి ముందుగా తమ టాలెంట్‌ను గుర్తించే కసరత్తు చేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్.. క్రియేటివ్ పీపుల్ ప్రస్తుత అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే సొంతంగా కంపెనీల ఏర్పాటు, స్వయం ఉపాధి అనేది చాలా అవసరం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆలోచన వచ్చిందంటే క్రియేటివిటీ ఉన్నట్లే. అయితే అందుకు అనుగుణంగా అకడమిక్ స్థాయిలో ఇన్స్టిట్యూట్లు కూడా చేయూతనందించాలి. ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాసెస్, సరైన విధానాలు, అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే ఈ రంగంలో విజయాలు సాధించిన వారి సహకారం కూడా తీసుకుంటున్నా రు. ఇవి ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్ తమ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేలా తోడ్పాటునందిస్తున్నాయి. గ్లోబల్ ర్యాంకింగ్స్.. అప్రాధాన్య అంశం బోధన, నైపుణ్యాల పరంగా ఐఐఎంలు.. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ముందంజలో ఉండట్లేదని చాలా మంది అంటుంటారు. ఇక్కడ కూడా ప్రస్తావించాల్సిన అంశం దేశ, సామాజిక అవసరాలు. భవిష్యత్తులో మన పరిస్థితులకు, సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దడమే ఇన్స్టిట్యూట్ల బాధ్యత. ఈ విషయంలో ఐఐఎంలు చేస్తున్న కృషి అమోఘం. ఇక్కడ విద్యార్థులకు ఎంతో నాణ్యమైన విద్య అందుతోంది. కాబట్టి గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఐఐఎంల పనితీరును అంచనా వేయడం సరికాదు. ఎక్కువ సంఖ్యలో నిమ్న వర్గాలకు, మహిళలకు చోటు కల్పిస్తున్నాం. ప్లేస్‌మెంట్స్, రీసెర్చ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే తక్కువ కాలంలోనే ఎంతో వృద్ధి సాధించాం. అన్ని నేపథ్యాలకు అందుబాటులో ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న క్యాట్ కేవలం ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం కూడా అపోహే. ఐఐఎంలలోని విద్యార్థుల నేపథ్యాలే ఇందుకు నిదర్శనం. ఐఐఎం-కోజికోడ్‌లో డాక్టర్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, హ్యుమానిటీస్ ఉత్తీర్ణులు.. ఇలా విభిన్న నేపథ్యాల విద్యార్థులు ఉన్నారు. క్యాట్ అనేది ఎబిలిటీని పరిశీలించే పరీక్ష మాత్రమే. ఐఐఎంలలో ప్రవేశానికి క్యాట్‌లో విజయం కంటే కీలక పాత్ర పోషించే ఇతర అంశాలు ఎన్నో ఉన్నాయి. క్యాట్ యాస్పిరెంట్స్‌కు.. మేనేజ్మెంట్ విద్యార్థులకు సలహా ఐఐఎంలలో ప్రవేశానికి క్యాట్ తప్పనిసరి అవసరం. కానీ ప్రస్తుత సీట్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుంటే.. సగటున 500 దరఖాస్తుల్లో ఒకరు మాత్రమే విజయం సాధిస్తారు. పరిమిత సీట్లు, తీవ్ర పోటీ కారణంగా ఐఐఎంలలో ప్రవేశం కొద్ది మందికే సాకారం అవుతుంది. అంతమాత్రాన నిరాశ చెందక్కర్లేదు. దేశంలో మరెన్నో ప్రతిష్టాత్మక బి-స్కూల్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ విద్య ఔత్సాహికులు తమ దృక్పథాన్ని విస్తృతం చేసుకోవాలి. ఐఐఎంలతోపాటు ఉన్న ఇతర అవకాశాలపైనా దృష్టి సారించాలి. విజయం సాధించని విద్యార్థుల్లో నైపుణ్యాలు లేవని భావించకూడదు. ఇక కోర్సు లో అడుగుపెట్టాక విస్తృతమైన ఆలోచన దృక్పథంతో అడుగులు వేయాలి. ఒత్తిడి వాతావరణంలోనూ నిర్ణయాలు తీసుకునే ఆత్మస్థైర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావడం వంటివి సహజ లక్షణాలుగా అలవర్చుకోవాలి. అప్పుడే క్లాస్‌రూంలో పొందిన నైపుణ్యాలకు సరైన వాస్తవ రూపం లభించి చక్కటి కెరీర్ సొంతమవుతుంది.