breaking news
majority of votes
-
రాష్ట్రంలో పోలింగ్ 62.69%
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 62.69 శాతం పోలింగ్ నమోదైంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన పోలింగ్ తుది వివరాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. దీని ప్రకారం అత్యధికంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో 75.28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో 44.75 శాతం మంది ఓటేశారు. పూర్తిగా పట్టణ ప్రాంత సెగ్మెంట్లైన మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ నమోదైంది. వేసవి ఎండల తీవ్రత వల్ల పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ ఓటర్లు బయటకు రాలేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 70.75 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల పోలింగ్ గణాంకాలతో పరిశీలిస్తే ఈసారి ఎన్నికల్లో ఏకంగా 8.06 శాతం మేర పోలింగ్ తగ్గడం గమనార్హం. 2014లో రాష్ట్రంలో ఒకేసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో గడువు ముగియకముందే శాసనసభ రద్దు కావడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 76.07 శాతం ఓటింగ్ జరిగింది. -
ఓట్లలో దూకుడు
- తొలిసారే అయినా జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా - సీట్లలో వెనుకబడ్డా ఓట్లలో వైఎస్సార్సీపీ మెరుగైన స్థాయి - 44,565 ఓట్ల ఆధిక్యంతో టీడీపీకి జెడ్పీపీఠం - 70 ఎంపీటీసీలు ఎక్కువ గెల్చుకున్న టీడీపీకి 35,990 ఓట్ల మెజార్టీ సాక్షి, విశాఖపట్నం : జిల్లా పరిషత్ ఎన్నికల బరిలోకి దిగింది తొలిసారే అయినా ఎన్నో ఏళ్లుగా తలపండిన టీడీపీకి వైఎస్సార్సీపీ చుక్కలు చూపించింది. జెడ్పీ పీఠాన్ని సులువుగా ఎగరేసుకుపోదామనుకున్న సైకిల్‌కు హోరాహోరీ పోటీ ఇచ్చింది. అడుగడుగునా సవాలు చేస్తూ ప్రజల్లో తనకున్న బలాన్ని చాటుకుంది. మంగళవారం వెల్లడించిన 39 జిల్లాపరిషత్ ఓట్ల లెక్కింపులో టీడీపీ 24, వైఎస్సార్సీపీ 15 దక్కించుకున్నాయి. సీట్ల పరంగా వైఎస్సార్సీపీ అనుకున్నంతమేర సాధించలేకపోయినా ఓట్ల విషయంలో దూకుడు ప్రదర్శించింది. విజయం సాధించిన టీడీపీతో దీటుగా ఓట్లు దక్కించుకుని ప్రజాబలం నిరూపించింది. జిల్లా పరిషత్ ఓట్లు 16,50,329. పోలైన ఓట్లు 13,05,268. వీటిలో ఫలితాలు మొత్తం వెల్లడయ్యేసరికి వైఎస్సార్సీపీ 5,73,131 ఓట్లు దక్కించుకోగా, టీడీపీ 6,17,596 ఓట్లు సాధించింది. అంటే రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 44,465 మాత్రమే. పేరుకు 24 జెడ్పీటీసీలను టీడీపీ దక్కించుకో గలిగినా ఓట్లు మాత్రం ఆ స్థాయిలో తెచ్చుకోలేకపోయింది. ఎన్నికలు జరిగిన 39 జెడ్పీటీసీల పరిధిలోని పది నియోజకవర్గాల్లో టీడీపీ ఏడు నియోజకవర్గాల్లో అత్యధికంగా జెడ్పీటీసీలు గెలవగా వీటిల్లో వచ్చిన మెజార్టీ కేవలం 56 వేల ఓట్లు. అదే వైఎస్సార్సీపీ పాడేరు,అరకు, పాయకరావుపేట నియోజకవర్గాల్లో అత్యధిక జెడ్పీటీసీలు గెలుచుకుని తెచ్చుకున్న ఓట్ల మెజార్టీ 44,461 ఓట్లు. అంటే ఏడు నియోజకవర్గాల పరిధిలోని టీడీపీ దక్కించుకున్న మెజార్టీ కన్నా మూడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ దక్కించుకున్న మెజార్టీతో సమానం అన్నమాట. అదే విధంగా టీడీపీ దక్కించుకున్న 24 జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీ తీవ్ర పోటీ ఇచ్చి తన బలాన్ని చాటుకుందని చెప్పవచ్చు. వాస్తవానికి 24 జెడ్పీలు కైవసం చేసుకుని టీడీపీ జిల్లా జెడ్పీ పీఠాన్ని దక్కించుకున్నా తక్కువ ఓట్ల ఆధిక్యతతోనేనని చెప్పవచ్చు. మరోపక్క వైఎస్సార్సీపీ జిల్లామొత్తం మీద అరకు,పాడేరు,పాయకరావుపేటలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు గెల్చుకోగా, ఈ ప్రాంతంలో టీడీపీ దరిదాపులకు రాలేకపోయింది. ఎంపీటీసీల్లోనూ జోరు... 656 ఎంపీటీసీల్లో ఏకగ్రీవం 14, నామినేషన్లు పడని రెండు స్థానాలను తీసివేయగా మొత్తం 640 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో వైఎస్సార్సీపీ 253 స్థానాలు, టీడీపీ 323 స్థానాలు దక్కించుకున్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి అధికంగా వచ్చిన స్థానాలు 70. ఇంతవరకు బాగానే ఉన్నా ఓట్లను దక్కించుకోవడంలో మా త్రం వైఎస్సార్సీపీ టీడీపీకి ధీటైన పోటీ ఇచ్చింది. 13,05,268 ఓట్లు పోలవగా, వైఎస్సార్సీపీ 5,27,447, టీడీపీ 5,63,437 ఓట్ల ను సాధించాయి. 70 ఎంపీటీసీ లు అధిక్యత వచ్చిన టీడీపీకి ఓట్ల మెజార్టీ మాత్రం కేవలం 35,990 మాత్రమే. ఇక్కడ కూడా ఏడు నియోజకవర్గాల పరిధిలోని ఎంపీటీసీల్లో టీడీపీ తక్కువ మెజార్టీతో వీటిని దక్కించుకోగా, వైఎస్సార్సీపీ మాత్రం పాడేరు,అరకు, పాయకరావుపేటల్లో మాత్రం వేలల్లో ఆధిక్యతను సాధించింది. వైఎస్సార్సీపీ,టీడీపీ తర్వాత జిల్లాలో ఇండిపెండెంట్లు పలుచోట్ల తమ సత్తా చాటుకున్నారు. దీంతో ఆయా చోట్ల టీడీపీ మూడోస్థానానికి సైతం పడిపోయిన దాఖలాలున్నాయి.