breaking news
Maisel
-
మిల్లెట్ మెరుపులు..చిరుధాన్యాలు, జొన్నలు దిగుబడిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి, సిరి ధాన్యాలుగా, రైతులకు లాభసాటి పంటలుగా చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వ సహకారంతో చిరుధాన్యాలు సాగు చేస్తున్న రైతులు మరే రాష్ట్రంలో రానంత ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించిన వాస్తవమిది. ఆ నివేదిక ప్రకారం.. 2022లో చిరుధాన్యాలు, జొన్నల దిగుబడిలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఒక హెక్టారుకు చిరుధాన్యాలు 2,363 కిలోలు దిగుబడి వచ్చింది. హెక్టారుకు 2,310 కిలోలతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో జొన్నలు హెక్టారుకు 3,166 కిలోల దిగుబడి రాగా, ఆ తరువాతి స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో హెక్టార్‌కు కేవలం 1,941 కిలోలే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం.. వైఎస్ జగన్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించింది. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, రైతులకు లాభసాటి అయిన వీటి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. వీటి సాగు విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా మిల్లెట్ మిషన్‌ను ఏర్పాటు చేసింది. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,66,736 హెక్టార్లలో సాగు లక్ష్యంగా నిర్దేశించింది. ఇది గత సంవత్సరానికన్నా 39,365 హెక్టార్లు అదనం. ఈ పంటలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కనీస మద్దతు ధరకు కొంటోంది. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో 160 చిరుధాన్యాల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. వీటికి ప్రోత్సాహకాలు కూడా అందించనుంది. చిరుధాన్యాల మార్కెటింగ్‌కు జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. మహిళా సంఘాల మహిళా మార్ట్‌లలోనూ చిరుధాన్యాలు, వాటి ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. ప్రజలు వీటిని వినియోగించేలా మండల, జిల్లా స్థాయిలో పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కలి్పస్తోంది. బాలింతలు, గర్భిణులు, పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద రాగి పిండిని పంపిణీ చేస్తోంది. చదవండి: బ్యాంకులకు వెనక్కి వస్తున్న రూ.2 వేల నోట్లు.. బడా బాబులవే 60 ఏళ్లుగా తగ్గిపోయిన సాగు, వినియోగం హరిత విప్లవంతో పాటు ఎక్కువ ఆదాయం వచ్చే వరి, గోధుముల సాగుకు రైతులు మళ్లడం, ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోవడంతో 60 ఏళ్లుగా దేశంలో చిరుధాన్యాల సాగు తగ్గిందని తెలిపింది. 1960లో దేశంలో వీటి తలసరి వార్షిక వినియోగం 30.9 కిలోలుండగా 2022కి 3.9 కిలోలకు పడిపోయిందని పేర్కొంది. 1973లో గ్రామీణ ప్రాంతాల్లో సజ్జలు వార్షిక తలసరి వినియోగం 11.4 కేజీలుండగా 2005కి 4.7 కిలోలకు, పట్టణ ప్రాంతాల్లో 4.1 కిలోల నుంచి 1.4 కిలోలకు తగ్గిపోయిందని తెలిపింది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో జొన్నలు వార్షిక తలసరి వినియోగం 19.4 కిలోల నుంచి 5.2 కిలోలకు, పట్టణ ప్రాంతాల్లో 8.5 కిలోల నుంచి 2.7 కిలోలకు తగ్గిపోయినట్లు నివేదిక పేర్కొంది. ఇటీవల ఆరోగ్య కారణాలు, పశుగ్రాసం, పరిశ్రమలు, ఇథనాల్, డిస్టిలరీల్లో వాడకానికి చిరుధాన్యాలకు డిమాండ్ పెరుగుతోందని చెప్పింది. గిరిజన రైతులు, మహిళలను ప్రోత్సహించాలి ఇతర పంటలకంటే తక్కువ నీటితో చిరుధాన్యాలు సాగుచేయవచ్చని నాబార్డు తెలిపింది. దేశంలో లభించే నీటిలో 80 శాతం వరి, గోధుమ, చెరకు పంటలకు వినియోగం అవుతోందని, దీనివల్ల మంచి నీటి కొరత ఏర్పడుతోందని పేర్కొంది. అందువల్ల చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఇందుకోసం మెరుగైన ఉత్పత్తి, స్థిరమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది. తొలుత వర్షాభావ, గిరిజన ప్రాంతాల్లో చిన్న, గిరిజన రైతులు, మహిళా రైతుల ద్వారా వీటి సాగును ప్రోత్సహించాలని సూచించింది. ఆ ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెట్ కల్పించాలని సూచించింది. తద్వారా మంచి పోషకాహారం, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడమే కాకుండా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని నివేదిక సూచించింది. చదవండి: ఆ ‘కొండ’లపై ఎందుకు ప్రశ్నించడం లేదు పవన్? ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలు చిరుధాన్యాల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి కనిపిస్తోందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైనట్లు నివేదిక పేర్కొంది. ఆరోగ్య కారణాల దృష్ట్యా 28 శాతం మంది చిరుధాన్యాలకు మారారని తెలిపింది. బరువు తగ్గేందుకు 15 శాతం మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇవీ ఉపయోగాలు ►హృదయనాళాల వ్యాధుల నుంచి విముక్తి ► చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం ►చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి ►కాల్షియం పుష్కలంగా ఉండటంతో ఎముకల ఆరోగ్యం ►రక్తనాళాలు, కండరాల సంకోచాలకు మంచి మందు ►నరాల పనితీరు పెంచుతాయి ► మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి ►క్యాన్సర్‌ను నిరోధిస్తాయి -
మూడేళ్లు.. 70 కిలోలు!
బొమ్మలు, బంతితో ఆడుకుంటున్న ఈ బాలుడి పేరు మైసెల్. వయసు మూడేళ్లు.. బరువు 70 కిలోలు..! బ్రెజిల్‌కు చెందిన ఈ బాలభీముడు పుట్టినప్పుడు సాధారణ శిశువుల మాదిరిగా 2.9 కిలోల బరువు మాత్రమే ఉన్నాడు. అయితే, తర్వాత క్రమంగా బరువు పెరిగిపోయి, మూడేళ్ల వయసు వచ్చేసరికి 70 కిలోలు దాటేశాడు. ‘ప్రాడర్-విల్లీ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యులోపమే మైసెల్ ఇలా భారీకాయుడు కావడానికి కారణమని డాక్టర్లు గుర్తించారు. ఈ జన్యులోపం ఉన్న వ్యక్తులకు అదే పనిగా ఆకలి వేస్తుంటుందని, ఎంత తిన్నా ఇంకా తినాలనే కోరిక ఉంటుందని వివరించారు. ఇలాంటి లోపం ఉన్న పిల్లలు అదే వయసున్న పిల్లలు తినే తిండి కంటే మూడు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా తింటారని పేర్కొన్నారు. అలా తింటున్నప్పటికీ వీరిని ఆకలి వెంటాడుతూనే ఉంటుందని, ఫలితంగానే ఇలా భారీకాయంతోపాటు బరువు కూడా పెరిగిపోతారని తెలిపారు. ప్రస్తుతం వీడి తిండి కంట్రోల్ చేయడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు.