breaking news
Lok Kalyan Marg
-
వాణిజ్య బంధం బలోపేతంపైనే దృష్టి
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఆదేశాలతో అమెరికా ప్రభుత్వం భారత్‌పై సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ట్రంప్‌కు కుడిభుజం, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా హస్తనకు విచ్చేసిన వాన్స్ సోమవారం సాయంత్రం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. సతీమణి ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి 7, లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ అధికారిక నివాసానికి వాన్స్ విచ్చేశారు. అక్కడ వీళ్ల కుటుంబానికి మోదీ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కారు దాకా వచ్చిన మోదీ.. వాన్స్ కారు దిగి దగ్గరకు రాగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వాన్స్ వెంట వచ్చిన కుమారులిద్దరినీ సరదాగా పలకరించారు. వారిని పరిచయం చేసుకున్నారు. కుమార్తె మీరాబెల్ను ఎత్తుకుని వచ్చిన ఉషా చిలుకూరితో మోదీ కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. తర్వాత చిన్నారులను చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. తొలుత వాన్స్ కుటుంసభ్యులందరికీ ఇంటి గార్డెన్‌ను మోదీ స్వయంగా చూపించారు. నెమళ్లు స్వేచ్ఛగా విహరిస్తున్న పచ్చికబయళ్లలో కుటుంబంతో కలిసి మోదీ కలియతిరిగారు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి గ్రూప్ ఫొటో దిగారు. తర్వాత నెమలి ఈకలను ముగ్గురు చిన్నారులకు ఇచ్చి వారితో ముచ్చటించారు. మీద కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. వాన్స్ చిన్నకుమారుడు వివేక్ మోదీ తరహా డ్రెస్, పెద్దబ్బాయి ఇవాన్ సూట్ ధరించారు. ఒప్పందం పురోగతిపై సంతృప్తితర్వాత మోదీ, వాన్స్‌లు విడిగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాలకు ప్రయోజనకారి అయిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఒప్పందం పురోగతిపై మోదీ, వాన్స్‌లు సంతృప్తి వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేలా చూడటంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికత రంగాల్లో మరింత సహకారంపైనా చర్చలు జరిపారు. త్వరలో భారత్‌లో పర్యటించాలని భావిస్తున్నందుకు ట్రంప్‌కు తన తరఫున కృతజ్ఞతలు తెలపాలని వాన్స్‌తో మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాల్లో పురోగతి సాధించంపై ఇరు దేశాల నేతలు సమగ్ర స్థాయిలో చర్చలు జరిపారని భేటీ ముగిశాక సోమవారం రాత్రి భారత్ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఫిబ్రవరిలో ట్రంప్‌తో భేటీ, ఫలవంతమైన చర్చల వివరాలను వాన్స్ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి చర్చలు ఇరు దేశాల మధ్య సహకారానికి బాటలు వేశాయి. అటు మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్‌కు, ఇటు వికసిత్ భారత్ 2047 సుసాధ్యానికి మార్గం సుగమం చేశాయి. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి దోహదపడే దైపాక్షిక వాణిజ్యం ఒప్పందం(బీటీఏ) పురోగతిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు. టారిఫ్‌లు, ఇరుదేశాల మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించడం తదితర కీలకాంశాలు బీటీఏలు ఉండనున్నాయి. పరస్పర ప్రయోజనకర అంశాలతోపాటు అంతర్జాతీయ సమకాలీన అంశాలూ మోదీ, వాన్స్‌ల భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. సమస్యాత్మక అంతర్జాతీయ అంశాల్లో దౌత్యం, సంప్రతింపులే పరిష్కార మార్గాలని నేతలు భావించారు. భారత్‌లో ఉన్నన్ని రోజులు వాన్స్, ఉషా, వాళ్ల చిన్నారులు ఎంతో ఆహ్లాదంతో గడపాలని మోదీ ఆకాంక్షించారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తికాంతదాస్ పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2013లో నాటి ఉపాధ్యక్ష హోదాలో జోబైడెన్ ఢిల్లీకి వచ్చారు. -
బ్రేకింగ్ : ప్రధాని నివాసంలో అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధికార నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని 7 లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని నివాసంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్ధలానికి తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఘటనా ప్రాంతానికి హుటాహుటిన అంబులెన్స్‌లు చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.కాగా, ప్రధాని అధికారిక నివాసంలో ఎలాంటి అగ్నిప్రమాదం జరగలేదని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎల్‌కేఎం కాంప్లెక్స్‌లోని ఎస్పీజీ రిసెప్షన్ ప్రాంతంలో స్పల్వ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపింది. -
ప్రధాని అడ్రస్ మారింది.. కొత్త చిరునామా ఇదే!
భారత ప్రధానమంత్రి అధికారిక నివాస చిరునామా మారింది. దేశంలోనే అత్యంత కీలకమైన చిరునామాగా ఇన్నినాళ్లు కనిపిస్తూ వస్తున్న 7, రేస్ కోర్స్ రోడ్ పేరు ఇక చరిత్రలో కలిసిపోయింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని నివాసంతోపాటు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అధికారుల నివాసాలు ఉన్న దీని పేరును ’లోక్ కల్యాణ్ మార్గ్’ పేరు మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ’లోక కల్యాణానికి (ప్రజా సంక్షేమానికి) మించినది ఏది లేదు. అందుకే రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఏకగ్రీవంగా పేరు మార్పు నిర్ణయాన్ని తీసుకున్నారు’ అని బీజేపీ ఢిల్లీ ఎంపీ మినాక్షి లేఖి తెలిపారు. న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) బుధవారం భేటీ అయి.. 7, రేస్ కోర్స్ రోడ్డు పేరుమార్పుపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఆమె సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. రేస్ కోర్స్ అనే పదం భారత సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధంలేనిదని, వలస పాలన కాలం నాటి ఆ పేరును తొలిగించి 'ఏకాత్మ మార్గ్'అని పెట్టాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ప్రతిపాదించారు. న్యూఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆమె న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) సభ్యురాలిగా కూడా ఉన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ భావజాలం ఏకాత్మ మానవ దర్శన్ (integral humanism)ను సూచించేలా రేస్ కోర్స్ రోడ్డును 'ఏకాత్మ మార్గ్'గా మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే, ఎన్డీఎంసీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. 'ఏకాత్మ మార్గ్'కు బదులుగా అమరజవాన్లలో ఒకరి పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. 1965 యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ నిర్మల్జిత్ సింగ్ పేరును ఆప్ ఎమ్మెల్యే సూచించారు. ఈ విషయంపై కౌన్సిల్ బుధవారం సమావేశమై.. '7, లోక్ కల్యాణ్ మార్గ్'గా పేరు ప్రతిపాదిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోనుంది. ఇక నుంచి ప్రధాని నివాసం 7, లోక్‌కల్యాణ్ మార్గ్ కానుంది.