breaking news
law intern
-
మీటూ : మహిళా న్యాయవాది అనుమానాస్పద మృతి
సాక్షి, బెంగళూరు : 'మీటూ' ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని మహిళలు తమపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వేధింపులపై ఫిర్యాదు చేసిన ఒక మహిళా న్యాయవాది పుష్ప అర్చనా లాల్ (26) అనుమానాస్పద రీతిలో శవమై తేలడం కలకలం రేపింది. లైంగిక వేధింపులకు సంబంధించి సీనియర్ న్యాయవాదులపై ఫిర్యాదు చేసిన రోజుల్లో వ్యవధిలోనే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం అనేక అనుమానాలను తావిచ్చింది. మల్లేశ్వరంలోని పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న గదిలో అర్చన అపస్మారక స్థితిలో వుండటాన్ని పనిమనిషి ముందుగా గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకోసం తరలించారు. అయితే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్నామని, పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అండమాన్ & నికోబార్ దీవులకు చెందిన అర్చనా ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనంతరం 2017లో బెంగళూరుకు వచ్చారు. స్థానిక జయంత్ పట్టాన్‌శెట్టి అసోసియేట్స్‌లో లా ఇంటర్న్‌గా జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు న్యాయవాది చంద్ర నాయక్ వద్ద తన ఇంటర్నషిప్‌ను మొదలుపెట్టారు. ఇక్కడే ఆమెకు వేధింపుల పర్వం మొదలైంది. ఆఫీసులో పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన చంద్ర నాయక్ ప్రభుత్వ న్యాయవాది చేతన్ దేశాయ్‌తో మరింత వేధింపులకు పాల్పడ్డారని అర్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు బలవంతంగా తనతో మద్యం తాగించి వేధింపులకు పాల్పడ్డారంటూ నవంబరు 20న వ్యాలికావల్ పోలీస్ స్టేషన్లో అర్చన ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన నాలుగురోజుల కాలంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. అటు పేయింగ్ గెస్ట్ ఓనర్ కూడా అర్చన మరణంపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతికి, లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధం ఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ, సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా పోలీసులను కోరారు. మరోవైపు ఈ వ్యవహారంపై జయంత్ పట్టన్‌శెట్టి అసోసియేట్స్ ఇంకా స్పందించలేదు. -
డబ్యూబీహెచ్ఆర్సీ పదవికి గంగూలీ రాజీనామా
-
డబ్యూబీహెచ్ఆర్సీ పదవికి గంగూలీ రాజీనామా
కోల్‌కతా: న్యాయ శాస్త్ర విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గంగూలీ పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిటీ చైర్మన్(డబ్యూబీహెచ్ఆర్సీ) పదవికి రాజీనామా చేశారు.ఈ రోజు రాష్ట్ర గవర్నర్ ను కలిసిన ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్ లో గౌరవ ప్రొఫెసర్ పదవికి శుక్రవారం రాజీనామా చేసిన ఆయన మానవ హక్కుల చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఏకే గంగూలీ ప్రవర్తన అనుచితమైనదేనని, లైంగిక స్వభావం కలిగి ఉన్నదని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అభిశంసించడానికి కారణమైన ఫిర్యాదును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో గంగూలీ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. -
జస్టిస్ గంగూలీది అనుచిత ప్రవర్తనే
* దర్యాప్తులో తేల్చిన సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ * న్యాయమూర్తిగా రిటైరైనందున చర్యలు తీసుకోరాదని నిర్ణయం * ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వెల్లువెత్తిన డిమాండ్లు * గంగూలీ రాజీనామాకు బీజేపీ, తృణమూల్ డిమాండ్ న్యూఢిల్లీ: న్యాయ విద్యార్థిని పట్ల జస్టిస్ ఏకే గంగూలీ ప్రవర్తన అనుచితమైనదేనని, లైంగిక స్వభావం కలిగి ఉన్నదని, అది పూర్తిగా అవాంఛనీయమైనదని ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ తన దర్యాప్తులో తేల్చింది. జస్టిస్ గంగూలీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఇటీవల జస్టిస్ ఆర్.ఎం.లోధా, జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ రంజనా దేశాయ్‌లతో కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే, సంఘటన జరిగిన రోజునే... గత ఏడాది డిసెంబర్ 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గంగూలీ రిటైరైనందున ఆయనపై తదుపరి చర్యలు తీసుకోరాదని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న జస్టిస్ గంగూలీ తన పదవికి రాజీనామా చేయాలని, సుప్రీంకోర్టు కమిటీ ఆయనను అభిశంసించినందున ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని విమర్శలు వెల్లువెత్తాయి. కమిటీ నివేదిక ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం రెండు పేజీల ప్రకటనను విడుదల చేశారు. బాధితురాలైన న్యాయ విద్యార్థిని మౌఖికంగా, లిఖితపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాలను కమిటీ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. జస్టిస్ సదాశివం ప్రకటనలోని వివరాల ప్రకారం... లె మెరిడియన్ హోటల్లోని గదిలో జస్టిస్ గంగూలీ గత ఏడాది డిసెంబర్ 24న రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల మధ్య బాధితురాలి పట్ల మాటల్లోను, చేతల్లోను అనుచితంగా ప్రవర్తించినట్లు కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ప్రకటన విడుదలైన వెంటనే, జస్టిస్ గంగూలీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. జస్టిస్ గంగూలీని సుప్రీంకోర్టు కమిటీ అభిశంసించినందున పోలీసులు సుమోటోగానే ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని సీనియర్ న్యాయవాది పినాకీ మిశ్రా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కమిటీ నివేదికపై అదనపు సొలిసిటర్ జనరల్ ఇంద్రా జైసింగ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే, జస్టిస్ గంగూలీపై వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న జస్టిస్ గంగూలీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ డిమాండ్ చేశారు. న్యాయ విద్యార్థిని పట్ల అనుచిత ప్రవర్తనకు పాల్పడినందుకు అభిశంసనకు గురైన జస్టిస్ గంగూలీ పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవిలో కొనసాగడం పూర్తిగా అసమంజసమని సుష్మా ‘ట్విట్టర్’లో వ్యాఖ్యానించారు. అయితే, ఘటన ఢిల్లీలో జరిగినందున దీనిపై ఢిల్లీ పోలీసులు మాత్రమే చర్యలు తీసుకోగలర ని, ఒకవేళ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, గంగూలీపై కోల్‌కతా పోలీసులు చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుందని సౌగత రాయ్ అన్నారు. నేనేమీ చెప్పదలచుకోలేదు: గంగూలీ న్యాయ విద్యార్థిని పట్ల అనుచిత ప్రవర్తన వ్యవహారంలో సుప్రీంకోర్టు కమిటీ అభిశంసనపై స్పందించేందుకు జస్టిస్ గంగూలీ నిరాకరించారు. ఈ అంశంపై తానేమీ చెప్పదలచుకోలేదన్నారు. సుప్రీం నివేదికలో ఏముందో తనకు తెలియదని చెప్పారు. పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లపై ప్రశ్నించగా, ఈ విషయమై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశంపై ఆలోచించే సమయం ఇంకా రాలేదని చెప్పారు. కాగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు గత ఏడాది డిసెంబర్ 24న ఢిల్లీలోని ఒక హోటల్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు న్యాయ విద్యార్థిని ఆరోపించడంతో.. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం దర్యాప్తు కమిటీని నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతికి మమత లేఖ జస్టిస్ గంగూలీపై సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. కాగా, ఈ వ్యవహారాన్ని ముగిసిన అధ్యాయంగా పరిగణించాలని న్యాయశాఖ మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ అభిప్రాయపడ్డారు.