breaking news
Lands Market Value
-
‘మార్కెట్ విలువ సవరణ’పై పిల్..
ప్రతివాదులకు నోటీసులిచ్చిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించబోమంటూ జారీ చేసిన మెమోపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఐజీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ సమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. భూముల మార్కెట్ విలువలను సవరించబోమంటూ రెవెన్యూ (స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ నెల 2న జారీ చేసిన మెమోను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత, రైతు నాయకుడు ఎం.కోదండరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి, విచారణ జరిపింది. అమలు కచ్చితమేమీ కాదు.. ప్రభుత్వం చట్ట ప్రకారం ఏడాది తరువాత ఏడాది మార్కెట్ విలువలను సవరించి తీరాల్సిందేనని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. మార్కెట్ విలువల సవరణపై నిర్ణయం తీసుకునే పరిధి స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేదన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... తెలంగాణ రాష్ట్ర మార్కెట్ విలువ సవరణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సవరణ విషయంలో అవి మార్గదర్శకం మాత్రమే చేస్తాయన్నారు. -
మార్కెట్ విలువలను సవరించబోం
భూములపై హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించబోమని ఉమ్మడి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడాన్ని సవాలు చేస్తూ రైతు నాయకుడు కోదండరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై ఏసీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ‘‘నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రం లో ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ విలువను సవరిం చడం సరికాదు’’ అని తెలిపిం ది. ‘‘రాష్ట్రం లో రియల్ ఎస్టేట్ వృద్ధి గణనీయంగా పెరిగింది. కాబట్టి మార్కెట్ విలువను సవరించాల్సిన కారణమేదీ కని పించడం లేదు’’ అని వివరించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా ఈ మేరకు జారీ చేసిన మెమోను ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి సోమవారం కోర్టు ముందుంచారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు, మా ర్కెట్ విలువలను సవరించ కూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక తామేం చేయగ లమని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అభ్యంతరాలేమైనా ఉంటే తెలియ జేయాలంటూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూ ర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
భూముల ధరలకు రెక్కలు!
- ఆదాయం పెంచుకునేందుకు సర్కారు నజర్!! - మార్కెట్ విలువపై 20 శాతం పెంపు? - వారం రోజులుగా ఆర్అండ్ఎస్ అధికారుల కసరత్తు - ఏడాదికి అదనంగా రూ.124 కోట్ల ఆదాయం తాండూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులను పెంపొందించుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా భూముల మార్కెట్ విలువ (ధర)ను పెంచాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. భూముల మార్కెట్ విలువను పెంచి రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అధికారులకు సూచనప్రాయంగా సర్కారు సంకేతాలిచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఉన్నతాధికారులు ప్రస్తుతం జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్లు, ఆదాయం తదితర వివరాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని పెంచడానికి భూముల మార్కెట్ విలువను ఎంత పెంచాలనే అంశాలపై ప్రతిపాదనలు పంపించాలని సర్కారు సంబంధిత ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ల ద్వారా భూముల విలువ పెంపు ప్రతిపాదనలు చేయాలని కోరినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. జిల్లాలోని ఆయా సబ్రిజిస్ట్రార్లతో వారం రోజులుగా మార్కెట్ విలువను పెంచే విషయమై సంబంధిత ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పట్టణంలో ఎకరా వ్యవసాయ భూమి ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.7నుంచి రూ.8లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1 నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. రిజిస్ట్రేషన్‌పై రూ.లక్షకు రూ.5.5 శాతం స్టాంప్ డ్యూటీ పడుతుంది. అంటే రూ.2 లక్షల భూమిని ప్రస్తుతం రిజిష్ట్రేషన్ చేసుకుంటే 5.5శాతం ప్రకారం రూ.11వేల స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. ప్రస్తుతం భూముల మార్కెట్ విలువను సుమారు 20శాతం పెంచాలని యోచిస్తున్నందున రూ.2లక్షల భూమి విలువ రూ.2.60లక్షలకు, స్టాంప్ డ్యూటీ రూ.11వేల నుంచి రూ.14,300లకు పెరగనున్నట్టు అంచనా. తద్వారా సర్కారుకు స్టాంప్ డ్యూటీ కింద అదనంగా రూ.3,300 ఆదాయం సమకూరనుందని అనధికారిక అంచనా. ఈ లెక్కన సర్కారుకు రూ.కోట్లలో అదనపు ఆదాయం సమకూరనున్నట్టు స్పష్టమవుతోంది. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఆర్ఓ)తో సహా జిల్లాలో 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్క వారానికి ఆయా కార్యాలయాల్లో 1700 వరకు రిజిష్ట్రేషన్లపై 5.5శాతం స్టాంప్ ప్రకారం సుమారు రూ.12.93 కోట్ల స్టాంప్ డ్యూటీ ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. ఈ లెక్కన ప్రస్తుతం నెలకు జిల్లా నుంచి సర్కారుకు సుమారు రూ.51.72 కోట్ల స్టాంప్ డ్యూటీ ఆదాయం వస్తోంది. ఇక భూముల మార్కెట్ విలువ 20 శాతానికి పెంచితే స్టాంప్ డ్యూటీ ఆదాయం నెలకు సుమారు రూ.62.06 కోట్లకు చేరి, ప్రభుత్వానికి రూ.10.34 కోట్ల వరకు అదనంగా ఆదాయం సమకూరనున్నట్టు స్పష్టమవుతోంది. ఈ లెక్కన ఏడాదికి జిల్లా నుంచి రిజిస్ట్రేషన్లపై సుమారు రూ.124.8 కోట్ల అదనపు ఆదాయం సర్కారు ఖజానాకు చేరనున్నట్టు అంచనా. అయితే ప్రస్తుతం భూముల మార్కెట్ విలువ పెంచే విషయంలో కసరత్తు చేస్తున్న సంబంధిత అధికారులు 20 శాతానికే పరిమితమవుతారా లేదా ఇంకా అధికంగా పెంచాలని సర్కారుకు ప్రతిపాదనలు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంలో సర్కారుకు సాధ్యమైనంత త్వరగా ప్రతిపాదనలు అందజేయాలని అధికారులు భావిస్తున్నారని సమాచారం. చేవెళ్ల, కుత్బుల్లాపూర్, జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం, రాజేంద్రనగర్, గండిపేట్, కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రస్తుతం సర్కారుకు రిజిస్ట్రేషన్లపై అధిక ఆదాయం వస్తోంది. భూముల ధరలు పెరిగితే ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి అదనపు ఆదాయం మరింత అధికమవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.