breaking news
Laddubabu
-
అవును...2017లో మెగాఫోన్ పడతా
చాలామంది నటీనటులు నటనే కాదు, ఇతర శాఖలపై మక్కువ చూపటం సాధారణ విషయమే. 24 కళల్లో తమకు నచ్చిన శాఖను ఎంచుకుంటున్నారు. అందులో దర్శకత్వం శాఖ అంటే అందరికీ మోజే... అవకాశం దొరికితే తమ సత్తా చాటేందుకు మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా హీరో అల్లరి నరేష్ దర్శకత్వంపై మోజు పడ్డాడు. త్వరలో మెగా ఫోన్ పడతానని చెబుతున్నాడు. తనకు నటన కన్నా దర్శకత్వం అంటేనే ఇష్టమని తెలిపాడు. నటన, దర్శకత్వం ఒకేసారి చేయడమనేది కొంచెం కష్టమైన పని అని.... 2017లో దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అల్లరి నరేష్ తన మనసులోని మాట చెప్పాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మోరులో 'బందిపోటు' చిత్రం షూటింగ్ లో పాల్గొన్న అల్లరోడితో చిట్ చాట్..... అన్నయ్య రాజేష్, నేను నిర్మాతలుగా మా బ్యానర్లో బందిపోటు తొలి సినిమాగా నిర్మిస్తున్నాం. ఈవీవీ బ్యానర్‌పై వచ్చే సినిమాలను చూసిన జనం మంచి సినిమా వచ్చింది అనుకులేలా ఉండాలన్నదే మా ధ్యేయం. ఇకపై ఏడాదికి ఒక సినిమా సొంత బ్యానర్లో, మిగిలినవి ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించిన బ్యానర్లలో నటిస్తా. * బందిపోటు సినిమా కథాంశం ఏంటి ఒక్కమాటలో చెప్పాలంటే హీరో పేరు విశ్వా ఘరానా దొంగ. ప్రజలను దోచుకునే దొంగలను తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి దోచుకుంటుంటాడు. * ఇప్పటికీ ఎన్ని సినిమాల్లో నటించారు బందిపోటు నా 48వ సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మాతగా సాయికిశోర్ దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో ప్రారంభించనున్నారు. వచ్చేఏడాది జనవరిలో నా 50వ సినిమాలో నటించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రముఖ నటి రాధ కుమార్తె కార్తీక, మోనాల్‌గజ్జర్ హీరోయిన్లగా సిరి సినిమా బ్యానర్‌పై నూతన దర్శకుడు చిన్నికృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం షూటింగ్లో ఉంది. * లడ్డూబాబు సినిమాపై మీ అభిప్రాయం తెలుగు పరిశ్రమలో ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం ఇది. అయితే కొంత నిరాశను మిగిల్చిన మాట వాస్తవం. ఈ సినిమా షూటింగ్ సమయంలో రోజూ నా శరీరంపై 38 కిలోల బరువున్న మేకప్ వేసేవారు. మేకప్ ఉన్నంతకాలం చాలా కష్టంగా ఉండేది. దీనికోసం నెల రోజులపాటు లండన్‌లో ఉండి మేకప్ గురించి తెలుసుకున్నా. తెలుగులో మొదట త్రీడీ సినిమాలో నటించానన్న తృప్తి మిగిలింది. *దర్శకత్వం చేసే ఆలోచన ఉందా నాకు నటన కన్నా దర్శకత్వం అంటేనే ఇష్టం. నటన, దర్శకత్వం ఒకేసారి చేయడమనేది కొంచెం కష్టం. 2017లో దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నాను. * ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా ప్రేమ వివాహమైతే ఇప్పటికే జరిగిపోయి ఉండేది. పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటాను. బహుశా వచ్చే ఏడాది నా పెళ్లి ఉండొచ్చు. -
సినిమా రివ్యూ: లడ్డుబాబు
నటీనటులు: అల్లరి నరేశ్,భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, మాస్టర్ అతుల్, గిరిబాబు నిర్మాత: రాజేంద్ర త్రిపురనేని సంగీతం చక్రి దర్శకత్వం: రవిబాబు సినిమా రివ్యూ: లడ్డుబాబు ప్లస్ పాయింట్స్: ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఏమి లేవు మైనస్ పాయింట్స్: స్టోరీ, స్క్రీన్ ప్లే డైరక్షన్ ముష్టి కిష్టయ్య (కోట శ్రీనివాసరావు) కుమారుడు లడ్డుబాబు (అల్లరి నరేశ్). ఆఫ్రికాకు చెందిన ఓ దోమ కుట్టడం వల్ల సన్నగా ఉండే లడ్డుబాబు లావుగా తయారవుతాడు. ఆస్థి అంతా అమ్మేసి పిసినారి కిష్టయ్య గోవాలో స్థిరపడాలనుకుంటాడు. అయితే ఆస్తి అమ్మడానికి లడ్డుబాబు పెళ్లికి ఓ లింక్ ఉంటుంది. దాంతో కొడుకుకు పెళ్లి చేయాలని చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టడంతో విసిగిపోయిన కిష్ణయ్య.. లడ్డూని ఇంట్లోంచి తరిమివేస్తాడు. ఇంట్లోంచి వీధిలోకి వచ్చిన లడ్డుబాబుని మూర్తి (అతుల్) అనే పది పన్నెండేళ్ల మధ్య వయస్సు ఉన్న కుర్రాడు చేరదీసి.. తన ఇంటికి తీసుకుపోతాడు. లడ్డుబాబుని మూర్తి ఇంట్లోకి తీసుకురావడాన్ని తల్లి మాధురి (భూమిక) ఒప్పుకోదు. అయితే లడ్డూని ఇంట్లో ఉండేలా తన తల్లిని మూర్తి బలవంతంగా ఒప్పిస్తాడు. ఇంట్లోకి వచ్చిన లడ్డూబాబుని పెళ్లాడాలని ఓ సమయంలో తన తల్లికి మూర్తి సూచిస్తాడు. మూర్తి చేసిన ప్రపోజల్ ను తల్లి అంగీకరించిందా? ఒకవేళ అంగీకరిస్తే ఎందుకు లడ్డుని పెళ్లాడాలనుకుంది? లడ్డూబాబుని తన ఇంటికి తీసుకురావడం వెనక మూర్తి ప్లాన్ ఏంటీ? కిష్ణయ్య ఇళ్లు అమ్మి గోవాలో సెటిల్ అయ్యాడా? ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానమే లడ్డూబాబు కథ. విశ్లేషణ: లడ్డుబాబుగా కష్టమైన మేకప్ చేసుకుని అల్లరి నరేశ్ చేసిన ఓ విభిన్న ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అల్లరి నరేశ్ లోని కమెడియన్, హీరో అంశాలను మేకప్ డామినేట్ చేసింది. అది అల్లరి నరేశ్ లోపమని చెప్పడానికి వీల్లేదు. గతంలో రాజేంద్ర ప్రసాద్ కొబ్బరి బోండాం చిత్రంలో ఇదే మాదిరి పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆ చిత్రంలో శరీరం చాలా లావుగా ఉన్నా.. ముఖంలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ ద్వారా రాజేంద్ర ప్రసాద్ కు నవ్వించడానికి వీలు కలిగింది. అయితే ఈ సినిమాలో ముఖం కనిపించకుండా మేకప్ తో సీల్ చేయడంతో నరేశ్ హావభావాలు ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయాయి. దాంతో నరేశ్ నవ్వించడానికి చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. చాలా కష్టపడి నరేశ్ చేసిన ప్రయత్నం మేకప్ మాటున వృధాగానే మిగిలి పోయింది. ముష్టి కిష్ణయ్య పాత్రలో కోట శ్రీనివాసరావు అహనా పెళ్లంట చిత్రంలో పిసినారి పాత్రను గుర్తుకు తెచ్చింది. అహనా పెళ్లంట చిత్రానికి కిష్టయ్య పాత్ర ఎక్స్ టెన్షన్ గా ఉంది. కోట కామెడీ అంతో ఇంతో ఊరట కలిగించే అంశం. ఈ చిత్రంలో భూమికకు ఇంపార్టెన్స్ ఉన్నా.. క్యారెక్టర్ డిజైన్ చేయడంలో అనేక లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. దాంతో భూమిక క్యారెక్టర్ కూడా రిజిస్టర్ కాలేకపోయింది. మూర్తి పాత్రను పోషించిన అతుల్ పర్వాలేదనిపించాడు. మరో హీరోయిన్ పూర్ణ కూడా ఆకట్టుకోలేకపోయింది. కథలో బలం లేకపోవడం, కథనం పేలవంగా ఉండటంతో మంచి సంగీతాన్ని అందించడానికి చక్రీకి పెద్దగా పని లేకపోయింది. చక్రీ పాడిన ఓ పాట విసుగు తెప్పించేలా ఉంది. సిరిమల్లే పాట పిక్చరైజన్ ఆకట్టుకుంది. ఫోటోగ్రఫి ఓకే. ఇక డైరెక్టర్ రవిబాబు కథను ఎంచుకోవడంలోనే విఫలయ్యాడని చెప్పవచ్చు. సాదాసీదా కథను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలోనూ తడబాటుకు గురయ్యాడు. క్లైమాక్స్ కోసమే కథను సాగదీసి నడిపించాడా అనే సందేహం సహజంగానే వస్తుంది. ఇక బ్రహ్మనందం, ఆలీ, వేణుమాదవ్ తదితర కమెడియన్ల గెస్ట్ అప్పీయరెన్స్ తో షాక్ ఇచ్చిన రవిబాబు.. వారితో కూడా ప్రేక్షకులకు ఓ మాదిరి సంతృప్తిని ఇవ్వలేకపోయారు. లడ్డుబాబుని చూసి నవ్వుకుందామని థియేటర్ కు వెళ్లిన కామెడికి బదులు ఎక్కువ మోతాదులో విషాదానే పంచాడని చెప్పవచ్చు. ట్యాగ్: లడ్డుబాబు కాదు.. ప్రేక్షకులకు లడ్డుబాంబు!