హారతిగొనవే.. కృష్ణమ్మా..!
గుంటూరు : కృష్ణా పుష్కరాల ఏడో రోజైన గురువారం శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ కావడంతో పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సీతానగరం ఘాట్ వద్ద చిన జీయర్‌స్వామి కష్ణానదికి హారతి ఇచ్చారు. సాయంత్రం వేళ నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీతానగరం ఘాట్ భక్తులతో కిక్కిరిసింది. శుక్రవారం లక్ష మందితో సీతానగరం పుష్కర ఘాట్‌లో చినజీయర్ స్వామి పుష్కర స్నానం ఆచరించనున్నారు.
ప్రముఖుల పుణ్యస్నానాలు...
రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి తోట త్రిమూర్తులు అమరావతి పుష్కర ఘాట్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ధ్యానబుద్ధ ఘాట్‌లో చినరాజప్ప దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. విజయపురిసౌత్‌లోని కృష్ణవేణి ఘాట్‌లో హైకోర్టు పోర్టుపోలియో న్యాయమూర్తి సురేష్‌కుమార్ సైతా, చిత్తూరు జిల్లా రెండో అడిషనల్ ఎస్పీ సదానంద పుష్కర స్నానాలు చేశారు. దాచేపల్లి మండలం భట్రుపాలెం పుష్కర ఘాట్‌లో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి పుష్కర స్నానాలు చేసి తన తల్లిదండ్రులతో పాటు దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. అచ్చంపేట మండలం కస్తల పుష్కర ఘాట్‌లో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా పుష్కర స్నానాలు చేసి తల్లిదండ్రులతో పాటు, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి, తమ గురువులకు పిండప్రదానాలు నిర్వహించారు. కొల్లూరు మండలం పోతర్లంక పుష్కర ఘాట్‌లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున పుష్కర స్నానం చేసి పిండప్రదానం చేశారు. కొల్లిపర పుష్కర ఘాట్‌లో ప్రభుత్వ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి కర్పూరపు రఘురామశర్మ పుష్కర స్నానం చేశారు. తాళాయపాలెంలో జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ కుటుంబసమేతంగా పుష్కర స్నానం చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెనుమూడి పుష్కర ఘాట్ వద్ద కష్ణమ్మకు హారతి ఇచ్చే కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ పాల్గొన్నారు.
రద్దీకనుగుణంగా అధికారుల ఏర్పాట్లు..
జిల్లాలోని ప్రధాన ఘాట్లైన అమరావతి, సత్రశాల, తాళాయపాలెం, సీతానగరం పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ పెరగడంతో అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పులిచింతల వద్ద గేట్లు మూసివేయడంతో దిగువన ఉన్న తంగెడ, దైద, పొందుగల, సత్రశాల వంటి పుష్కర ఘాట్ల వద్ద నీటి మట్టం పెరగగా, దిగువనున్న అమరావతి, తాళాయపాలెం, వైకుంఠపురం పుష్కర ఘాట్లలో అడుగుమేర నీటి మట్టం తగ్గింది. దీంతో అమరావతిలోని ధ్యానబుద్ధ పుష్కర ఘాట్ పైన ఉన్న రెండు ఘాట్లకు నీరు పూర్తిగా తగ్గడంతో భక్తులు స్నానాలు చేసేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. సీతానగరం ఘాట్‌లో భక్తులు స్నానాలు చేస్తున్న నీటినే పక్క కాలువ గుండా మళ్లీ తోడి పోస్తుండటంతో నీరు కలుషితంగా మారుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
తంగెడ ఘాట్‌లో 200 మంది ముస్లింల పుష్కర స్నానం...
దాచేపల్లి మండలం తంగెడ పుష్కర ఘాట్‌లో సుమారు 200 మంది ముస్లింలు పుష్కర స్నానం చేసి మతసామరస్యాన్ని చాటి చెప్పారు. అమరావతి, విజయపురిసౌత్ కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్ల వద్ద సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సత్రశాల పుష్కర ఘాట్‌లో పరాశక్తి సిమెంట్స్, వివిధ సామాజిక వర్గాలకు చెందిన సత్రాల్లో పుష్కరాలకు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మజ్జిగ పంపిణీ చేశారు. అచ్చంపేట మండలం నందులరేవు పుష్కర ఘాట్‌లో భక్తులు స్నానాలు చేస్తుండగా హఠాత్తుగా కొండచిలువ రావడంతో భయంతో పరుగులు తీశారు. పోలీసులు దాన్ని చంపడంతో ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు రేంజి ఐజీ ఎన్.సంజయ్, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారం రోజులుగా సీతానగరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూము నుంచి పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.