breaking news
Koneru Lakshmaiah University
-
ఫీ‘జులుం’ కోసమే కేఎల్‌యూ మాయాజాలం
సాక్షి, అమరావతి: న్యాక్ ర్యాంకింగ్ కోసం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం (కేఎల్‌యూ) పాల్పడిన అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. పూర్తి ఆధారాలతో బయటపడిన ఈ ర్యాంకింగ్ గూడుపుఠాణి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా న్యాక్ చైర్మన్, సభ్యులకే భారీ లంచాలు ఇచ్చి మరీ న్యాక్ ఏ++ ర్యాకింగ్ కోసం కేఎల్‌యూ యాజమాన్యం పక్కా పన్నాగంతో వ్యవహరించినట్టు సీబీఐ కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. దాంతోనే పక్కా వ్యూహంతో వ్యవహరించి న్యాక్‌కు భారీ లంచాలు ఇస్తుండగా.. శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చేసిన 10 మంది నిందితులను విజయవాడలోని న్యాయస్థానంలో ఆదివారం హాజరుపరిచింది. న్యాక్ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహా, సభ్యులు రాజీవ్ సిజిరాయా, డి.గోపాల్, రాజేశ్‌సింగ్ పవర్, మానస్‌కుమార్ మిశ్రా, గాయత్రి దేవరాజ, బులు మహారాణతోపాటు కేఎల్‌యూ యాజమాన్య ప్రతినిధులు కోనేరు రాజ హరేన్ (వైస్ ప్రెసిడెంట్), జీపీ సారథి వర్మ (వీసీ), ఎ.రామకృష్ణ (డైరెక్టర్)లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కేఎల్‌యూ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, ఇతర నిందితులు ఎల్.మంజునాథరావు (న్యాక్ మాజీ సలహాదారు), ఎం.హనుమంతప్ప(బెంగళూరు విశ్వవిద్యాలయం డైరెక్టర్), ఎం.శ్యామ్‌సుందర్ (న్యాక్ సలహాదారు)ల కోసం సీబీఐ గాలింపు ముమ్మరం చేసింది. కాగా.. న్యాయస్థానానికి సీబీఐ సమర్పించిన రిమాండ్ నివేదికలో న్యాక్ ర్యాంకింగ్ కుట్రపై పూర్తి వివరాలు వెల్లడించింది.భారీగా ఫీజులు కొల్లగొట్టేందుకే..అక్రమ విధానాలతో న్యాక్ ఏ++ ర్యాంక్ సాధించిన అనంతరం ఆ ర్యాంకింగ్‌ను చూపిస్తూ భారీగా ఫీజులు నిర్ణయించి దోపిడీకి పాల్పడాలన్నది కేఎల్‌యూ యాజమాన్యం ప్రధాన ఉద్దేశని సీబీఐ పేర్కొంది. రిమాండ్ నివేదికలో ఇంకా ఏమున్నాయంటే.. ఇష్టానుసారంగా సెక్షన్లు పెంచేసి భారీగా విద్యార్థులను చేర్పించుకుని భారీ ఫీజులతో దోపిడీకి పాల్పడటమే అసలు లక్ష్యం. ఈ ఏడాది న్యాక్ తనిఖీలు ఉంటాయని తెలిసినప్పటి నుంచి పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అందుకోసం న్యాక్ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహాతోపాటు సభ్యులను మధ్యవర్తుల ద్వారా కొన్ని నెలల ముందుగానే సంప్రదించింది. న్యాక్ ప్రస్తుత సలహదారు ఎం.శ్యామ్‌సుందర్, మాజీ సలహాదారు ఎం.హనుమంతప్ప ఇందులో కీలక పాత్ర పోషించారు. వారి ద్వారా న్యాక్ చైర్మన్, సభ్యులను లోబర్చుకునేందుకు కేఎల్‌యూ యాజమాన్యం పావులు కదిపింది. ఏ++ ర్యాంకింగ్ ఇస్తే భారీగా ముడుపులు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరింది. అందుకోసం న్యాక్ చైర్మన్, సభ్యుల గృహాలకే భారీగా ముడుపులు అందించేలా ఏర్పాట్లు చేసింది. తనిఖీల కోసం కేఎల్యూను సందర్శించినప్పుడు కూడా వారికి భారీగా కానుకలు, ఇతర తాయిలాలు ముట్టజెప్పేందుకు అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసింది.పక్కా సమాచారంతో వ్యూహాత్మక దాడిన్యాక్ ర్యాంకింగ్ కోసం కేఎల్‌యూ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందని ఉమ్మడి విజయవాడ, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచే సీబీఐకి పలువురు ఫిర్యాదు చేశారు. అందుకోసం కేఎల్‌యూ ఎలా వ్యవహరిస్తోందన్నది కూడా నేరుగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి సమాచారమిచ్చారు. దాంతో సీబీఐ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దిగారు. ఢిల్లీ, విశాఖపట్నంలోని సీబీఐ అధికార బృందాలు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌యూ ప్రధాన క్యాంపస్‌తోపాటు దేశంలోని 20 నగరాల్లోని న్యాక్ చైర్మన్, సభ్యులకు చెందిన నివాస గృహాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ అనూహ్య పరిణామంతో న్యాక్ చైర్మన్, సభ్యులు, కేఎల్‌యూ ప్రతినిధులు బిత్తరపోయారు. న్యాక్ చైర్మన్, సభ్యుల వద్ద భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.వాటికి సంబంధించిన వివరాలు అడిగితే న్యాక్ చైర్మన్, సభ్యులు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దాంతో న్యాక్ ర్యాంకింగ్ కోసమే అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. న్యాక్ చైర్మన్, సభ్యుల నుంచి మొత్తం రూ.37 లక్షల విలువైన పరికరాలను జప్తు చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. -
సురేఖకు కేఎల్‌యూ అభినందన
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్ ఆర్చరీ పోటీల్లో స్వర్ణం, రెండు రజతాలు సాధించిన తమ విద్యార్థి జ్యోతి సురేఖను కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (కేఎల్‌యూ) అభినందించింది. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో సీఎస్ఈ ద్వితీయ సంవత్సరం విద్యార్థిగా ఉన్న జ్యోతి సురేఖ గత రెం డేళ్ల కాలంలో అంతర్జాతీయస్థాయిలో 9 పతకాలు సాధించడం గర్వకారణంగా ఉందని కేఎల్‌యూ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తెలిపారు. తమ యూనివర్సిటీలో విద్య అభ్యసించేందుకు జ్యోతి సురేఖకు పూర్తి ఫీజును మినహాయించామని ఈ సందర్భంగా సత్యనారాయణ వివరించారు. -
కేఎల్‌యూలో సరికొత్త ఎంబీఏ కోర్సు
విజయవాడ: బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందించే లక్ష్యంతో సరికొత్త ప్రోగ్రామ్ పంపిణీ తరహా ఎంబీఏ కోర్సులను దేశంలోనే తొలిసారిగా కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంబీఏ విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనలతో పాటు, సాంస్కృతిక అవగాహన పెంచేందుకు, వ్యాపార సరళిని లోతుగా అధ్యయనం చేసే లక్ష్యంతో కేఎల్‌యూ, టైమ్స్ ప్రో సంస్థ సంయుక్తగా ఎంబీఏ బ్యాంకింగ్, ఫైనాన్స్ విభాగాల్లో రెండేళ్ల పంపిణీ తరహా కోర్సులను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు విజయవాడ నగరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కేఎల్‌యూ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, టైమ్స్‌ప్రో అధ్యక్షుడు దీపక్ లంబా పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉత్తమ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు రిటైల్ బ్యాంకింగ్, విదేశీ మారకం, ఫైనాన్షియల్, కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి కీలక అంశాలపై విద్యార్థులకు పరిపూర్ణమైన విజ్ఞాణాన్ని అందించాలనే లక్ష్యంతో దేశంలోనే మొదటి సారిగా పంపిణీ తరహా ఎంబీఏ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు సంస్థల్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, రెండు సర్టిఫికెట్లు ఇవ్వడాన్నే పంపిణీ తరహాగా పేర్కొన్నారు. టైమ్‌ప్రో అధ్యక్షులు దీపక్ లంబా మాట్లాడుతూ విద్యార్థులను పరిశ్రమలతో అనుసంధానం చేసి, ప్రాక్టికల్ పరిజ్ఞానంతో కోర్సు బోధిస్తామని తెలిపారు. సమావేశంలో కేఎల్‌యూ ఉపాధ్యక్షులు రాజా హరీన్, వైస్‌ఛాన్సలర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఆనందకుమార్ తదితరులు పాల్గొన్నారు.