breaking news
Kerala church
-
లెఫ్ట్ పార్టీలకే ఓటేయండి.. కేరళ చర్చి పిలుపు!
సాక్షి, తిరువనంతపురం: పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులకే ఓటేయండని కేరళలోని ప్రముఖ చర్చి అక్కడి క్రైస్తవులకు పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మనకు సహాయం చేసిన లెఫ్ట్ కూటమి అభ్యర్థులకే ఓటేయాల’ని ఓ చర్చి మతబోధకుడు క్రైస్తవులకు సూచించారు. దీనిపై కేరళ సీపీఎం నాయకుడు సునీత్ చోప్రా మాట్లాడుతూ.. ‘హిందువుల మీద దాడులపై, హిందూ ధార్మిక సంస్థలు మాట్లాడగా లేనిది, బీజేపీకి ఓటేయొద్దని క్రైస్తవ చర్చిలు చెప్పడంలో తప్పేంట’ని ప్రశ్నించారు. అయితే, ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఈ మధ్యే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయకుడు టామ్ వడక్కన్ అభిప్రాయపడ్డారు. ఈ వివాదం నేపథ్యంలో ఓటర్లును ప్రభావితం చేసే ఎటువంటి ప్రసంగాలను నిర్వహించొద్దని ఇదుక్కి జిల్లా చర్చి బిషప్ మార్ మ్యాథ్యూ.. చర్చి మతబోధకులకు హెచ్చరించినట్టు సమాచారం. ‘దీనివల్ల భవిష్యత్తులో చర్చి కార్యకలాపాలకు నష్టం వాటిల్లే అవకాశముంది. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో చాలా తెలివిగా, స్పృహతో ఉన్నారు. చర్చి మతబోధకులు ఇటువంటి విషయాల్లో ఏ పక్షానికీ తలొగ్గకుండా ఉండటమే మంచిద’ని బిషప్ మార్ మ్యాథ్యూ హితవు పలికారు. ఇకపోతే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇదుక్కి బిషప్ మార్ మ్యాథ్యూ మద్దతుతో లెఫ్ట్ అభ్యర్థి జాయ్స్ జార్జ్ దాదాపు 50 వేల మెజార్టీతో గెలుపొందారు. అనేక చోట్ల చర్చి బిషప్‌లు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉండటంతో, పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. -
కేరళ చర్చ్ అనూహ్య నిర్ణయం
పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఆకస్మిక ప్రకటన దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తోంది. రూ. 500, రూ. వెయ్యినోట్లు ఉన్నవారు వాటిని మార్చుకోవడానికి బ్యాంకులు ముందు నానా కష్టాలు పడుతున్నారు. నాగుపాములా వంకలు తిరిగిన క్యూలలో నిలుచొని ఆపసోపాలు పడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం అనూహ్య నిర్ణయంతో చెల్లుబాటు అయ్యే డబ్బులేక పేదలు పడే అవస్థలను కేరళలోని ఓ చర్చ్ గుర్తించింది. పేదలకు తనవంతు సాయం చేయాలనుకుంది. అంతే అనుకున్నదే తడవుగా గత ఆదివారం చర్చ్‌లోని విరాళాల బాక్స్‌ను తెరిచి పేదలకు డబ్బులు పంచింది. ఎర్నాకుళం జిల్లాలోని సెయింట్ మార్టిన్డీ పొరెస్ చర్చ్ తీసుకున్న ఈ ఉదార నిర్ణయం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. పెద్దనోట్లు రద్దై.. ఏటీఎంలు కూడా పనిచేయని విపత్కర పరిస్థితుల్లో గత ఆదివారం చర్చ్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం స్థానికంగా ప్రజలకు ఊరట కలిగించింది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మర్నాడు సోమవారం (ఈ నెల 13) సాయంత్రం వరకు తమ చర్చ్‌లోని విరాళాల బాక్స్‌ను తెరిచి ఉంచామని, దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈ బాక్స్ నుంచి డబ్బులు తీసుకున్నారని, ప్రస్తుత నగదు సంక్షోభం ముగిసిన తర్వాత వారు స్వచ్ఛందంగా మళ్లీ విరాళాలు సమర్పించవచ్చునని చర్చ్ మతగురువు జిమ్మి పూచక్కడ్ మీడియాతో తెలిపారు. చర్చ్ నిర్ణయం వల్ల దాదాపు 200 కుటుంబాలు లబ్ధి పొందాయని తెలుస్తోంది. అయితే, విరాళాల బాక్స్‌లో ఉన్న రూ. వెయ్యి, రూ. 500 నోట్లను ఎవరూ ముట్టుకోలేదని, తక్కువ విలువ కలిగిన నోట్లనే ప్రజలు తీసుకున్నారని, నగదు తీసుకోవడంపై ఎలాంటి పరిమితి విధించకపోయినా ప్రజలు తమకు అవసరమైన మేర డబ్బును మాత్రమే చాలా క్రమశిక్షణగా తీసుకున్నారని జిమ్మి పూచక్కడ్ వివరించారు.