హోంవర్క్ చేయలేదని కొడుకును చంపాడు
కన్నతండ్రి అనే విషయాన్ని మరిచి రాక్షసుడిలా ప్రవర్తించాడు. చిన్న కారణానికి 12 ఏళ్ల కొడుకుని కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. ప్రైవేట్ స్కూలులో ప్రవేశ పరీక్షకు కొడుకు ప్రిపేర్ కాలేదని కోపంతో జపాన్‌కు చెందిన కెంగొ సటకె (48) ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
హోంవర్క్ చేయడం లేదని కొడుకు ర్యోటా సటకెపై సటకె ఆగ్రహం చెందాడు. కూరగాయలు కోసే కత్తి తీసుకుని కొడుకు ఛాతీపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వైద్యుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి కెంగోను అరెస్ట్ చేశారు. పొరపాటును కత్తితో దాడి చేశానని కెంగో చెప్పాడు. ఆ సమయంలో తన భార్య పనిలో ఉందని, నిగ్రహం కోల్పోయి తప్పు చేశానని అన్నాడు. స్కూల్ అడ్మిషన్ పొందేందుకు కష్టపడి చదవడంలేదంటూ కెంగో చాలాసార్లు కొడుకును హింసించాడని స్థానిక మీడియా వెల్లడించింది.