breaking news
kadireshan
-
హీరో ధనుష్‌పై మరో పిటిషన్
చెన్నై: తమిళ హీరో ధనుష్‌ను కోర్టు పిటిషన్లు వెంటాడుతున్నాయి. ధనుష్ తమ కుమారుడు అంటూ మధురై మేలూర్కు చెందిన కదిరేశన్–మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధనుష్ ఒంటిపై పుట్టుమచ్చలను లేజర్ చికిత్స ద్వారా చెరిపివేశారని, ఇందుకు కొన్ని ఆధారాలను ప్రభుత్వ వైద్యులు కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం కదిరేశన్ దంపతుల న్యాయవాది మరో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నటుడు ధనుష్ వేసిన రిట్ పిటిషన్లో ఆయన సంతకం నకిలీదని, సంతకం నకలును తమకు అందించాల్సిందిగా మధురై కోర్టును కోరారు. దీనిపై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా ధనుష్ పుట్టుమచ్చలను లేజర్ టెక్నాలజీతో పుచ్చుమచ్చలు తొలగించుకున్నారని ప్రభుత్వ వైద్యుల బృందం కోర్టుకు ఓ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కేసు ఏప్రిల్ 11న విచారణకు రానుంది. వైద్యుల నివేదికపై న్యాయస్థానం ఏం తీర్పు వెల్లడించనుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ధనుష్‌పై మరోకేసు నమోదు కావడంతో కేసుల పరంపరతో అతడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. -
పుట్టుమచ్చలు తీయించేసిన ధనుష్
చెన్నై: హీరో ధనుష్ కేసును మధురై కోర్టు సోమవారం మరోమారు విచారించింది. గతంలో ఈ కేసును పలుమార్లు విచారించిన కోర్టు.. ధనుష్ తమ బిడ్డే అంటున్న కదిరేశన్, మీనాక్షి దంపతులు చెబుతున్న పుట్టుమచ్చల ఆనవాళ్లను పరిశీలించాలని ఆదేశించింది. దీంతో ధనుష్ శరీరంపై పుట్టు మచ్చల కోసం పరీక్ష చేయగా.. అవి కనిపించలేదు. దీంతో పుట్టుమచ్చలను తొలగించుకున్నారా? అనే దానిపై వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రభుత్వ వైద్యుల బృందం ధనుష్‌కు పరీక్షలు జరిపి పుట్టు మచ్చలను తొలగించుకున్నారని నిర్ధారించింది. లేజర్ టెక్నాలజీతో పుట్టు మచ్చలు తొలగించుకున్నట్లు సోమవారం కోర్టులో నివేదించింది. వైద్యుల నివేదికపై విచారణ జరిపిన కోర్టు అనంతరం కేసును ఏప్రిల్ 11కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.