టీఎస్పీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ
దరఖాస్తులకు బీసీ స్టడీ సర్కిళ్ల ఆహ్వానం
20వ తేదీ నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు
ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2 (అబ్జెక్టివ్టైప్), గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలకు బీసీ స్టడీసర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించి, 30 వరకు స్వీకరించనున్నట్లు ఆ శాఖ డైరెక్టర్ కె.ఆలోక్‌కుమార్ తెలిపారు. వచ్చేనెల 4న ఆన్లైన్స్క్రీనింగ్ టెస్ట్. 6న ఫలితాలను వెల్లడించాక, 13వ తేదీ నుంచి రాష్ర్టంలోని పది స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణా తరగతులను మొదలుపెడతామని తెలిపారు.
ఈ పరీక్షలకు 90 రోజుల పాటు లేదా పరీక్ష తేదీ వరకు ఏది తక్కువైతే అప్పటివరకు తరగతులు ఉంటాయన్నారు. బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం సీట్లను కేటాయించనున్నారు. వికలాంగులకు 3 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఇదివరకే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఏదైనా శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రస్తుత శిక్షణ పొందేందుకు అనర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలను http://tsbcstudycircles.cgg.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
అర్హతలివీ...
అభ్యర్థుల కుటుంబ ఆదాయం గరిష్టంగా ఏడాదికి రూ.లక్షకు మించరాదు. డిగ్రీ పూర్తి చేసిన వారే దర ఖాస్తు చేసుకోవాలి. టీఎస్పీఎస్సీ నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. రెగ్యులర్ స్టూడెంట్‌గా ఉన్న వారు, ఎక్కడైనా ఏదైనా పోస్టులో పనిచేస్తున్న వారు అనర్హులు. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజనల్ టీసీని తప్పనిసరిగా డిపాజిట్ చేయాలి. రాష్ట్రంలోని ఏ కేంద్రం నుంచైనా ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ రాయొచ్చు. అయితే అభ్యర్థికి సొంత జిల్లాలోనే శిక్షణ ఇస్తారు. ఎంపికైన అభ ్యర్థులకు గ్రూప్-1, గ్రూప్-2లకు కలిపి శిక్షణ నిస్తారు