breaking news
J&K unrest
-
మూడు నెలల్లో రూ. 10వేల కోట్లు
శ్రీనగర్ : కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి వ్యాపారంలో భారీగా నష్టపోయింది. ఇది మూడు నెలల్లో 10,000 కోట్లకు పైమాటేనని స్థానిక ట్రేడ్‌బాడీ తెలిపింది. ఆగస్టు-5, 2019 నుంచి మూడునెలల్లో రూ. పదివేల కోట్ల వ్యాపార నష్టం జరిగినట్లు నివేదించింది. గత మూడు నెలలనుంచి కశ్మీర్ లోయలో పరిస్థితి ఇంకా సాధారణస్థితికి రానందున నష్టాల స్వభావాన్ని అంచనా వేయడం కష్టమని కాశ్మీర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు షేక్ ఆశిక్ అన్నారు. కాశ్మీర్లో వ్యాపార నష్టాలు ఈ మూడు నెలల్లో రూ. 10,000 కోట్లు దాటేశాయని, దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ఇటీవలి వారాల్లో కొంత వ్యాపార కార్యకలాపాలు జరిగినప్పటికీ, మందకొడిగానే జరిగిందని షేక్ ఆశిక్ తెలిపారు. ఇది దీర్ఘకాలంలో భారీ పరిణామాలనుచూపుతుందని ఆయన అన్నారు. వివిధ వ్యాపార రంగాలను ఉటంకిస్తూ ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయాన్న పూర్తిగా పునరుద్దరించలేదని, ప్రస్తుత తరుణంలో ఇంటర్నెట్ ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా హస్తకళా రంగానికి సంబంధించి జూలై-ఆగస్టులో ఆర్డర్లను స్వీకరిస్తారు. క్రిస్మస్, నూతన సంవత్సరం నాటికి ఉత్పత్తులను వారికి పంపిణీ చేయాలి. యుఎస్, యూరప్‌లో సేవలందిస్తున్న సంస్థలు కశ్మీర్లో ఉన్నాయని, ఇంటర్నెట్ సదుపాయాలను నిలిపివేయడం వల్ల వ్యాపారం దెబ్బతింటుందని ఆశిక్ అన్నారు. కనెక్టివిటీ లేక ఆర్డర్లు లేని కారణంగా 50వేల మందికి పైగా చేతివృత్తులవారు, చేనేత కార్మికులు ఉద్యోగాలు కోల్పోనున్నారనీ చెప్పారు. కేవలం నష్టాలు మాత్రమే కాదు..వ్యాపారం చేసినా, చేయకపోయినా, జీఎస్టీ, ఆన్లైన్ రిటర్న్‌లాంటి టెక్నికల్ ఇబ్బందులు తమకు తప్పవని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్లో వ్యాపారాలు నష్టపోతాయని, ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందన్న విషయాన్ని అధికార యంత్రాంగానికి తెలియజేశామన్నారు. అంతేకాదు నష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, వ్యాపారుల బాధలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆశిక్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
జమ్ముకశ్మీర్ ఉద్రిక్తత: 12ఏళ్ల బాలుడు మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో 12ఏళ్ల బాలుడు మృతిచెందాడు. శ్రీనగర్ నగరంలో భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై ఇండియన్ ఫోర్స్ టియర్ గ్యాస్, షార్ట్ గన్ పిల్లెట్స్తో శుక్రవారం కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో సైద్పురా ప్రాంతానికి చెందిన జునైద్ అహ్మద్ భట్ అనే 12ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ఆ బాలుడు చికిత్స పొందుతూ నేటి ఉదయం మరణించాడు. దీంతో 91 రోజులుగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతకర పరిస్థితుల్లో మరణించిన వారి సంఖ్య 91కు చేరింది. కాగ శుక్రవారం జరిగిన డజనుకు పైగా ఈ ఘర్షణల్లో మొత్తం 50మంది గాయపడ్డారు. 10వేలకు పైగా కశ్మీరీలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు. ఆందోళనలు కొంత సద్దుమణగంతో ఇటీవలే శ్రీనగర్ ప్రాంతంలో కర్ఫ్యూను ఎత్తివేశారు. మళ్లీ ఆందోళనకర పరిస్థితులు తలెత్తడంతో నగరంలోని ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూను పోలీసులు కొనసాగిస్తున్నారు. జూలై 9న జరిగిన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ ఆందోళనలు రేకెత్తాయి.