breaking news
Jayammu Nishchayammu Raa
-
మరోసారి ‘జంబలకిడి పంబ’
‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి వైవిధ్యమైన కథలతో కథానాయకుడిగా రెండు విజయాలు అందుకున్న ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘జంబలకిడి పంబ’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు మా చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడుతున్నాం. మార్చి 10 వరకు నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, వైజాగ్, అరకు, కేరళలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. పోసానిది ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర. వెన్నెలకిశోర్ పాత్ర కూడా హైలైట్ గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించే సినిమా అవుతుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘జంబలకిడి పంబ’ ఎంత సూపర్‌హిట్ టైటిలో అందరికీ తెలిసిందే. మా చిత్ర కథకు కూడా చక్కగా సరిపోయే టైటిల్ అది. టైటిల్‌ని బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కథ, స్క్రీన్‌ప్లే చాలా బాగా కుదిరాయి. శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఒక వైపు వినోదాన్ని పండిస్తూనే, మరో వైపు భావోద్వేగాలు ఉండే పాత్రలో ఆయన కనిపిస్తారు. శ్రీనివాసరెడ్డి కెరీర్లో మరో కీలక చిత్రమవుతుంది’ అని అన్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు. -
'జయమ్ము నిశ్చయమ్ము రా..' మూవీ రివ్యూ
టైటిల్ : జయమ్ము నిశ్చయమ్ము రా.. జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : శీనివాస్ రెడ్డి, పూర్ణ, రవివర్మ, కృష్ణభగవాన్, ప్రవీణ్ సంగీతం : రవిచంద్ర దర్శకత్వం : శివరాజ్ కనుమూరి నిర్మాత : శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి కమెడియన్ గా మంచి ఫాంలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గీతాంజలి సినిమాతో హీరోగా మారి మంచి సక్సెస్ సాధించాడు. తరువాత కూడా హాస్యపాత్రల్లోనే కంటిన్యూ అయిన ఈ కామెడీస్టార్, మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. కామెడీ ఇమేజ్ ఉన్న నటుడైనా ఓ బరువైన పాత్రలో అందమైన ప్రేమకథతో పాటు ఓ చిన్న సందేశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి జయమ్ము నిశ్చయమ్ము రా.. సినిమా సక్సెస్ అయ్యిందా..? హీరోగా శ్రీనివాస్ రెడ్డి ద్వితీయ విఘ్నాన్ని దాటేశాడా..? కథ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసున్న సమయంలో జరిగిన కథ ఈ సినిమా. మంగళం సర్వేష్ కుమార్( శ్రీనివాస్ రెడ్డి), తెలంగాణ ప్రాంతంలోని సదాశివపల్లి అనే చిన్న గ్రామంలో నివసిస్తుంటాడు. తల్లి, ఫ్రెండ్ యాదగిరి తప్ప నా అనే వాళ్లు ఎవరూ లేని సర్వేష్, తన స్వశక్తి కన్నా అంధవిశ్వాసాలనే ఎక్కువగా నమ్ముతుంటాడు. ఆ నమ్మకాలతోనే ప్రభుత్వోద్యోగానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. మున్సిపల్ ఆఫీస్‌లో క్లర్క్‌గా ఉద్యోగం రావటంతో తన విశ్వాసాలు నిజమే అని మరింత బలంగా నమ్ముతాడు. ఉద్యోగం కోసం సొంత ఊరు వదిలి కాకినాడ వెళ్లిన సర్వేష్‌కు రాణి(పూర్ణ) అనే అమ్మాయి ఎదురుపడుతుంది. రాణి కనిపించిన ప్రతీసారి సర్వేష్‌కు కలిసోస్తుండటంతో ఆమె జీవితాంతం తనతో ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతాడు. ఎలాగైన రాణిని ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో సర్వేష్ తనలోని బలాన్ని తాను ఎలా గుర్తించాడు..? చివరకు రాణిని ఎలా దక్కించుకున్నాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : గీతాంజలి సినిమాతో ఇప్పటికే హీరోగా ప్రూవ్ చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఆకట్టుకున్నాడు. ఎక్కడా.. అనవసర హీరోయిజం లేని సర్వేష్ పాత్రలో సహజంగా నటించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో పిరికివాడిగా, సెకండ్ హాఫ్‌లో తనలోని బలాన్ని తెలుసుకొని ఆత్మస్థైర్యంతో కనిపించే వ్యక్తిగా మంచి వేరియేషన్ చూపించాడు. రాణి పాత్రలో పూర్ణ పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. హుందాగా కనిపించే మధ్య తరగతి అమ్మాయిగా మెప్పించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో పూర్ణ నటన ఆకట్టుకుంటుంది. కృష్ణ భగవాన్, ప్రవీణ్‌ల కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. పేద బ్రాహ్మణుడి పాత్రలో పోసాని కృష్ణమురళి మరోసారి తన మార్క్ చూపించారు. సాంకేతిక నిపుణులు : తొలి చిత్రమే అయినా దర్శకుడు శివరాజ్ కనుమూరి, మంచి కథా కథనాలతో మెప్పించాడు. ఓ కామెడీ స్టార్‌ను హీరోగా ఎంచుకొని కూడా ఎక్కడ అతనితో పూర్తి స్థాయి కామెడీ చేయించకపోవటం సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా సినిమాలోని ప్రతీ పాత్ర మన జీవితంలో తారస పడేవిగా అనిపించటం, ప్రేక్షకుడు వెంటనే కథలో లీనమయ్యేలా చేసింది. అయితే తొలి భాగం కాస్త సాగదీసినట్టుగా అనిపించినా.. సెకండాఫ్‌లో కథ వేగం అందుకుంటుంది. తెలంగాణ మాండళీకంలో శ్రీనివాస్ రెడ్డి చెప్పిన డైలాగ్స్ సహజంగా ఉన్నాయి. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్, ముఖ్యంగా ఓ రంగుల చిలక సాంగ్ సినిమా రిలీజ్ కన్నా ముందే సూపర్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనాలు క్యారెక్టరైజేషన్స్ కామెడీ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ ఓవరాల్‌గా జయమ్ము నిశ్చయమ్ము రాతో ఎంటర్టైన్మెంట్ మాత్రం నిశ్చయం.. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్