వైఎస్ ఉంటే విద్యుత్ చార్జీలు పెరిగేవా?
విద్యుత్ చార్జీల పెంపు దారుణమని, దీనివల్ల రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై వెయ్యి కోట్ల రూపాయల మేర భారం పడుతుందని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో వైఎస్ఆర్ జనపథం కార్యక్రమానికి అశేష సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే బతికుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఆయన హయాంలో విద్యుత్ చార్జీలను ఒక్క రూపాయి కూడా ఏనాడూ పెంచలేదని వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని చెప్పారు. ఇక కర్నూలు జిల్లా బనగానపల్లె అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాటసాని రామిరెడ్డి, అలాగే నంద్యాల ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎస్పీవై రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.