ట్రంప్‌పై కోపంతో ఆస్కార్‌పై అలిగిన హీరోయిన్
న్యూయార్క్: ఓ ఇరానీ హీరోయిన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆస్కార్ అవార్డులపై అలకబూనింది. తాను ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. 'ది సేల్స్ మెన్' అనే చిత్రం ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. ఈ చిత్రంలో ఇరానీ నటి 'తారానే అలిదూస్తి' నటించింది. అస్కార్ అవార్డుల కార్యక్రమం అమెరికాలోనే జరిగే విషయం తెలిసిందే.
అయితే, ఈ నటికి ట్రంప్ పై తెగ కోపం వచ్చింది. ట్రంప్ ఓ జాతివివక్షుడు అన్నారు. ఇరానీయన్లకు వీసాలు బ్యాన్ అంటూ ప్రకటించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అందులో.. 'ఇరానీయన్లకు వీసా బ్యాన్ ఆలోచన చేసిన ట్రంప్ ఓ జాతివివక్షకుడు. అది సాంస్కృతిక కార్యక్రమం కావొచ్చు.. మరింకేదైనా కావొచ్చు. నేను మాత్రం ఆస్కార్ అకాడమీ అవార్డులు 2017కు వెళ్లడం లేదు. ఆందోళనలో మాత్రం ఉంటాను' అంటూ ఈ అమ్మడు ట్వీట్ చేసింది.