అప్పట్లో ఐపీకేఎఫ్ అత్యాచారాలకు పాల్పడింది: శ్రీలంక
శ్రీలంకలో ఎల్టీటీతో జరిగిన యుద్ధం సమయంలో భారత శాంతి పరిరక్షక దళం (ఐపీకేఎఫ్) సభ్యులు తమిళ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని శ్రీలంక మంత్రి ఒకరు ఆరోపించారు. గతంలో ఎల్టీటీఈ నాయకుడైన వినయగమూర్తి మురళీధరన్ (48) అలియాస్ కరుణ శ్రీలంక పార్లమెంటులో ఈ ఆరోపణలు చేశారు. ఆయన ప్రస్తుతం మహింద రాజపక్స మంత్రివర్గంలో ఉపమంత్రిగా ఉన్నారు. 1987 నుంచి 1990 వరకు శ్రీలంకలో శాంతి పరిరక్షణ ఆపరేషన్లు నిర్వహించిన ఐపీకేఎఫ్ సభ్యులు.. తమిళులను చంపడంతో పాటు అనేకమంది మహిళలపై అత్యాచారాలు చేశారని అన్నారు. అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు.
1987 సంవత్సరంలో భారత - శ్రీలంక దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారత శాంతి పరిరక్షక దళాలను ఉత్తర, తూర్పు శ్రీలంక ప్రాంతాలకు పిలిపించారు. కరుణ 2004లో ఎల్టీటీఈ నుంచి విడిపోయి, తన సొంత ఉద్యమం కొన్నాళ్లు నడిపించి, తర్వాత రాజకీయ పార్టీ పెట్టారు. ఆ తర్వాత రాజపక్స నేతృత్వంలోని అధికార కూటమిలో చేరి మంత్రి అయ్యారు.