Indis-Pakistan match
-
'టీమిండియా వీక్ నెస్ గురించి పట్టించుకోం'
కోల్ కతా: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ను ఉపఖండంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తుందని పాక్ క్రికెట్ కోచ్ వకార్ యూనిస్ తెలిపాడు. శుక్రవారం అతడు విలేకరులతో మాట్లాడుతూ... గత మ్యాచుల్లో తమ జట్టుపై ఎక్కువ ఒత్తిడి ఉండేదని, ఇప్పుడు ఇండియా టీమ్ పై ప్రెషర్ అధికంగా ఉందని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి ఎక్కువయిందని వివరించాడు. కోల్ కతాలో తమకు మైదానంలోనూ, మైదానం వెలుపల మద్దతు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు బలాలపై దృష్టి పెడుతున్నామని, టీమిండియా బలహీనతల గురించి ఆలోచించడం లేదని వకార్ యూనిస్ తెలిపాడు. రేపు(శనివారం) ఈడెన్ గార్డెన్ జరిగే మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. -
'పాక్ తో ఎలా ఆడాలో మాకు తెలుసు'
కోల్ కతా: పాకిస్థాన్ తో మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నామని, తమపై ఎటువంటి ఒత్తడి లేదని టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అన్నాడు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... ఒత్తిడిని ఎలా అధిగమించాలో తమకు తెలుసునని, ప్రతి మ్యాచ్ లోనూ గెలవాలనే ఆడతామని చెప్పాడు. టీ20 మ్యాచుల్లో ఏ జట్టు ఫేవరేట్ కాదని, ఇరు జట్లకు సమాన అవకాశాలుంటాయని పేర్కొన్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో తాము ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వబోమని, దాయాది జట్టుతో చాలా మ్యాచ్ లు ఆడామని గుర్తు చేశాడు. యాషెస్ సిరీస్ కంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో భావోద్వేగాలు అధికంగా ఉంటాయన్నాడు. దాయాది జట్ల మధ్య పోరును ఆటగా కాకుండా, సరిహద్దు వివాదంలా చూస్తారని వెల్లడించాడు. దీంతో తమపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటారని చెప్పాడు. మైదానంలో భావోద్వేగాలు పక్కన పెట్టి మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని అశ్విన్ చెప్పాడు.