breaking news
illegal Tickets
-
పెద్దల ముసుగులో అరాచకం..!
సాక్షి, కైకలూరు(కృష్ణా) : కొల్లేరులో ప్రభుత్వానికి ధీటుగా సమాంతర పాలన కొనసాగుతోంది. చట్టాలను లెక్కచేయడం లేదు. మా రాజ్యంలో పెద్దలు చెప్పిందే శాసనం అనే రీతిలో ఆటవీక రాజ్యం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆధ్మాత్మిక కేంద్రంగా పేరుగడించింది. ఈ దేవాలయం చేరడానికి పందిరిపల్లిగూడెం వద్ద సర్కారు కాలువపై ఇనుప వంతెన ఆధారం. దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమ టోలు గేటు వసూల చేస్తూ కొల్లేరు పెద్దలు రూ.కోట్లలో ప్రజాధనాన్ని దండుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లిని దర్శించుకోడానికి వస్తున్న భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. కొల్లేరు కట్టుబాట్ల కారణంగా అక్రమ వసూళ్లు ఏడాది పొడవునా సాగుతోంది. ప్రశ్నించే భక్తులపై నిర్వాహకులు దాడులకు దిగుతున్నారు. ఈ విషయాలు పోలీసు, రెవెన్యూ, అటవీ అధికారులకు తెలిసినా తెలుగుదేశం నేతల బెదిరింపులు కారణంగా ఏమీ చేయలేని దుస్థితి దాపురించింది. అక్రమ వసూళ్లను అడ్డుకోలేక పోలీసు, ఆర్అండ్బీ, ఫారెస్టు అధికారులు ఒకిరిపై ఒకరి తమ పరిధి కాదంటే తమది కాదని చేతులు దులుపుకుంటున్నారు. ఏడాదికి రూ.44 లక్షల అక్రమ పాట.. పందిరిపల్లిగూడెం సర్కారు కాలువ వంతెన దాటిన తర్వాత ఐదు గ్రామాలు ఉన్నాయి. వంతెన అవతల కొల్లేటికోట గ్రామంలో పెద్దింట్లమ్మ దేవస్థానం ఉంది. ప్రతి ఆదివారం అమ్మ దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా మార్చిలో జరిగే జాతరకు లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు. ఈ విధంగా వంతెన దాటిన ప్రతి ఒక్కరి నుంచి, వాహనాల నుంచి అక్రమ టోలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది అక్రమ టోలు ఫీజు నిమిత్తం గురువారం రాత్రి పందిరిపల్లిగూడెం గ్రామ చావిడి వద్ద పెద్దలు పాటలు నిర్వహించారు. గ్రామానికి చెందిన జయమంగళ కొండయ్య అనే వ్యక్తి ఏడాదికి రూ.44లక్షల 6 వేలు పాట దక్కించుకున్నాడు. ఈ డబ్బులు పందిరిపల్లిగూడెం పెద్దలు తీసుకుంటారు. పాటదారుడికి ఏడాదికి రూ.కోటి 50 లక్షలపైనే ఆదాయం వస్తుంది. అవినీతి సహించమన్నా చలనం లేదు.. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలన అందించాలని ఆదేశించారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పందిరిపల్లిగూడెం వంతెనపై అక్రమ టోలు ఫీజును నిలుపుదల చేసిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వమే నామమత్ర ఫీజులను వసూలు చేసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇప్పటికైన కొల్లేరులో సమాంతర పాలనకు అడ్డకట్ట వేసి అక్రమ టోలు దోపిడిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
శివ.. శివా!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :వాడిన టికెట్నే మళ్లీ మళ్లీ వాడడం.. అంటే రీసైక్లింగ్... దర్శనానికి వెళ్లే భక్తులకు ఇచ్చిన టికెట్లనే అటు తిప్పి ఇటు తిప్పి అంటగడుతున్నారు. ఫలితం దేవాలయానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవస్థానంలో జరిగే వ్యవహారాల గురించి తెలుసుకుంటే ఔరా! అని ముక్కున వేలేసుకోకతప్పదు. భక్తుల తాకిడితో సంబంధం లేకుండా దర్శనం టికెట్ల రీసైక్లింగ్ జరుగుతోంది. సాధారణ రోజుల్లో దర్శనం టికెట్ ధర రూ.10 కాగా, అమావాస్య రోజు మాత్రం రూ.50 వసూలు చేస్తున్నారు. అదీ రూ.20 అని ముద్రించి ఉన్న టికెట్లపైనే యాబై రూపాయల స్టాంప్ వేస్తున్నారు. ఒక భక్తుడికి ఇచ్చిన టికెట్నే కనీసం ముగ్గురు నలుగురి చేతులు మారేలా రీ సైక్లింగ్ చేస్తుండడంతో ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. డబ్బులు చేతులు మారడంతో ఎలాంటి ప్రకటన లేకుండానే ముగ్గురు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని సమాచారం. ఒక పూజారి, మరో ఇద్దరిని ఆఫీసు స్టాఫ్‌గా ఉద్యోగంలోకి తీసుకున్నారని చెబుతున్నారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వీరిని రెగ్యులరైజ్ చేసే సమయంలో ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ప్రధాన ఆల యం కాకుండా ‘మూడు గుండ్లు’ వద్ద కూడా పూజారులు ఉండాలి. కానీ, ఇక్కడ పూజారులు ఉండకుండా పిల్లలనే పెడుతున్నారని తెలుస్తోంది. ఇక, లడ్డూ ప్రసాదం తయారీ వద్ద ఇద్దరు బాలకార్మికులను నిబంధనలకు విరుద్ధంగా పనిలోకి తీసుకున్నారని తెలిసింది. ఆదాయపరంగా చెర్వుగట్టు జిల్లాలో యాదగిరిగుట్ట తర్వాత రెండో స్థానంలో ఉంటోంది. కేవలం తలనీలాల టెండరు ద్వారానే ఏటా రూ. 1.50కోట్లు, కిరాణం షాపుల ద్వారా రూ.16లక్షలు, కొబ్బరి చిప్పల ద్వారా రూ.30లక్షల ఆదాయం సమకూరుతోంది. ఇక, ప్రతినెలా కనీసం రూ. 20లక్షలు హుండీ ద్వారానే సమకూరుతోంది. సోమ, శుక్రవారాలతోపాటు ప్రతినెలా ఆమావాస్య రోజు చెర్వుగట్టుకు భక్తులు పోటెత్తుతారు. ఒక్క అమావాస్య రోజు రమారమి 2లక్షల మంది భక్తులు నిద్ర చేయడానికి వస్తున్నారని, ఈ ఆదాయం అంతా ఎటుపోతుందో తెలియడం లేదని పేర్కొంటున్నారు. అర్చన, అభిషేకం టికెట్లలోనూ.. దర్శనం టికెట్ల రీసైక్లింగ్‌తోపాటు అర్చన, అభిషేకం టికెట్ల విషయంలోనూ మాయాజాలం నడుస్తోందని సమాచారం. సాధారణంగా అభిషేకానికి రూ.200 వసూలు చేస్తుండగా, అదే ఉదయం వేళలో ఏకంగా రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం ఉన్న చెర్వుగట్టు ఆలయంపై చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు, ఉద్యోగులు తమ ఆదాయం పెంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు తెలిసినా, వారు పట్టించుకోని కారణంగానే చెర్వుగట్టుపై అనైతిక వ్యవహారాల జోరు పెరిగిందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.