breaking news
Ideal farmers system
-
ఆదర్శం అవుట్
నరసన్నపేట రూరల్: టీడీపీ ప్రభుత్వం అన్నంత పని చేసింది. అధికారం చేపట్టక ముందు నుంచే అదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేస్తామని చెబుతూ వచ్చిన తెలుగుదేశం నేతలు అధికారం చేపట్టిన మూడు నెలల తర్వాత తామనుకున్నది చేసేశారు. ఈ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్న సాకు చూపిస్తూ.. దీని స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తామంటూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా పేరుతో జీవో నెం. 43 జారీ అయ్యింది. ఈ జీవో ఫలితంగా ఆదర్శ రైతుల వ్యవస్థ రద్దు కాగా.. జిల్లాలో 1652 మంది ఆదర్శ రైతులు ఇంటికే పరిమితం కానున్నారు. వ్యయసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శ రైతుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. వీరికి ప్రతి నెలా వెయ్యి రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన మరణించే వరకూ ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయ రంగం చాలా బలోపేతమైంది. ఆదర్శ రైతుల ద్వారానే గ్రామాల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ సమాచారాన్ని గ్రామస్థాయిలో రైతులకు చేరవేయడంతోపాటు.. ఏ తెగులుకు ఏ మందు వాడాలి, ఏ సమయంలో ఏ ఎరువు వాడితే దిగుబడి బాగుంటుందన్న సూచనలు ఇచ్చేవారు. వైఎస్ఆర్ మరణాంతరం ఈ వ్యవస్థ గాడి తప్పింది. దీంతో అనర్హులను తొలగించాలన్న ఉద్దేశంతో 2012 జూన్‌లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆదర్శ రైతులకు పరీక్షలు నిర్వహించింది. గత ఏడాది ఫలితాలను కూడా ప్రకటించింది. ఈ పరీక్షల్లో తప్పినవారిని తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని చెప్పినా అది అమలు కాలేదు. మొదట్లో 2800 ఆదర్శ రైతులు ఉండగా పరీక్షల సమయానికి 2400 మంది ఉండేవారు. పరీక్షల్లో తప్పిన 400 మందిని తొలగించగా, మరికొంత మంది మానివేశారు. దీంతో ప్రస్తుతం 1652 మంది మిగిలారు. అప్పటి నుంచి ఆదర్శరైతులు బాధ్యతగానే వ్యవహరిస్తున్నారు. వ్యవసాయశాఖ ఇచ్చిన పనులను చేస్తూ రైతులకు ఉపయుక్తంగా ఉండేవారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే ఆదర్శ రైతులుగా ఉన్నారని ఆరోపిస్తున్న టీడీపీ, అధికారంలోకి రావడంతో ఆ వ్యవస్థనే రూపుమాపేసింది. తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శ రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పనిచేయని వారిని తొలగిస్తే బాగుం డేది. అలాగే ఉన్న వారితో పని చేయించుకోవాలే గానీ తొలగించడం అన్యాయమంటున్నారు. చాలా మంది ఇదే పనిని నమ్ముకొని ఉండిపోయారని, ప్రభుత్వ ఉత్తర్వులతో తామంతా వీధిన పడ్డామని వాపోతున్నారు. 18 నెలలుగా నెలవారీ తమకివ్వాల్సిన వెయ్యి రూపాయల గౌరవ వేతనం కూడా ఇవ్వడంలేదని, దాని సంగతి ఏమటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా జీవోలతో తొలగించడమేమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టుకు వెళతాం ఎటువంటి సమీక్షలు, పరిశీలనలు లేకుండా అందరినీ మూకుమ్మడిగా తొలగించడం అన్యాయం. దీనిపై కోర్టును ఆశ్రయిస్తాం. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తాం. జీవో కాపీని పూర్తిగా పరిశీలించన తర్వాత కోర్టులో పిటిషన్ వేస్తాం. మాకు రావాల్సిన 18 నెలల వేతన బకాయిల కోసం ఆందోళనలు నిర్వహిస్తాం. -శ్రీనివాసరావు, జిల్లా సంఘం అధ్యక్షుడు -
ఇదేమి న్యాయం ‘బాబూ’
ఆదర్శరైతుల వ్యవస్థ అనవసరమని, దాన్ని తొలగిస్తామని తొలి కేబినెట్ భేటీలో ప్రకటించిన చంద్రబాబు, పది రోజుల్లోనే మాట మార్చారు. వ్యవస్థను అలాగే ఉంచి,ఆదర్శ రైతులను తొలగిస్తామని, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని గురువారం మరో ప్రకటన చేశారు. మొత్తానికి టీడీపీ అసలు స్వరూపం బయటపడ్డట్టు అయింది. ఆ స్థానంలో టీడీపీ కార్యకర్తలను చేర్చేందుకే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని ఆదర్శరైతులు మండిపడుతున్నారు. పైగా టీడీపీ కార్యకర్తల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించారని వారు చెబుతున్నారు. సాక్షి, చిత్తూరు: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆదర్శరైతుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. రాయలసీమలో 7,120 మంది ఆదర్శ రైతులను నియమించారు. ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన వీరికి ప్రతి నెలా వెయ్యి రూపాయల గౌరవవేతనం ఇస్తున్నారు. అంటే నెలకు 71.2 లక్షలు, ఏడాదికి 8.54 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. గ్రామాల్లో విత్తనాలు, ఎరువులు ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఏ తెగులుకు ఏ మందు వాడితే బాగుం టుంది? వంటి పలు సూచలను ఆదర్శరైతులు ఇచ్చేవారు. అయితే ఆదర్శరైతుల వ్యవస్థ కాలక్రమేణా గాడి తప్పింది. కొందరు వ్యవసాయ రంగంలో రైతులకుసూచనలు ఇవ్వడంకంటే రాజకీయ నేతలుగా చెలామణి అయ్యారు. దీంతో వీరికి చెక్ పెట్టేందుకు 2012 జూన్‌లో వ్యవసాయశాఖ అధికారులు ‘ఆదర్శరైతులకు’ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల ను గతేడాది ప్రకటించారు. పరీక్షల్లో ఫెయిలైన వారి ని తొలగించి ఆ స్థానంలో కొత్తవారిని నియమించా రు. అప్పటి నుంచి ఆదర్శరైతులు సక్రమంగానే పనిచేస్తున్నారు. రైతులకు ఉపయోగపడుతున్నారు. టీడీపీ కార్యకర్తల కోసమే తొలగింపు నిర్ణయం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఆదర్శరైతుల వ్యవస్థను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత కేబినెట్ భేటీలో తన నిర్ణయాన్ని సవరించింది. వ్యవస్థను కొనసాగించి ఆదర్శరైతులను తొలగిస్తామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటన చేశారు. టీడీపీ కార్యకర్తలను ఆ స్థానంలో నియమించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆదర్శరైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయానా ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ తమ తో అన్నారని వారు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ‘మహానాడు’లో కూడా టీడీపీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కార్యకర్తలను అన్ని రకాలుగా ఆదుకుంటామని, న్యాయం చేస్తామని ఎవరూ భయపడాల్సిన పనిలేదని చంద్రబాబుతో సహా ప్రసంగించిన ప్రతీ నేత చెప్పారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకుంటోందని ఆదర్శరైతులు చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తల కోసమే తొలగింపని లోకేష్ చెప్పారు ఆదర్శరైతుల వ్యవస్థను తొలగించిన తర్వాత లోకేష్‌ను కలిశాం. ఆదర్శరైతులంతా కాంగ్రెస్ కార్యకర్తలని, వారిలో 90 శాతం మంది వైఎస్సార్ సీపీలో చేరారని లోకేష్ చెప్పారు. తన వద్ద జాబితా కూడా ఉందన్నారు. కాబట్టి టీడీపీ కార్యకర్తలనే తీసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో కోస్తా ఆదర్శరైతులు తాము పార్టీ కోసం శ్రమించామని లోకేష్‌కు చెప్పారు. అలాంటి వారు ఉంటే వారిని కూడా మలివిడతలో తీసుకుంటామని లోకేష్ అన్నారు. ఇలా వ్యవహరించడం దారుణం. చంద్రబాబు తాజా ప్రకటనకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో ఈ నెల 14న ఆందోళనలు నిర్వహిస్తాం. -నలగం శేఖర్, ఆదర్శరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాయలసీమలో ఆదర్శ రైతులు ఇలా: జిల్లా ఆదర్శ రైతులు అనంతపురం 2128 వైఎస్సార్ జిల్లా 1453 కర్నూలు 1628 చిత్తూరు 1911 మొత్తం 7,120