breaking news
huge prices
-
ఉల్లి ధరకు రెక్కలు!
దేవరకద్ర(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్లో ఉల్లిపాయల ధరలు మరింత పెరిగాయి. గత వారం వచ్చిన ధరలే రికార్డు స్థాయిలో ఉండగా ఈ వారం ధరలు మరో రికార్డుగా మారాయి. ప్రభుత్వం ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కిలో రూ.20 కే విక్రయిస్తామంటున్నా ఇక్కడ ఏమాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. అనూహ్యంగా డిమాండ్ పెరగటంతో బుధవారం మార్కెట్‌కు 300 బస్తాల వరకు ఉల్లి పాయలు అమ్మకానికి వచ్చాయి. జోరుగా సాగిన వేలంలో నాణ్యమైన ఉల్లి క్వింటాల్ ధర రూ. 3500 పలికింది. గత వారం కన్నా ఇది రూ. 300 అధికం. చిన్న సైజు ఉల్లిపాయలకు సైతం అధిక ధరలు నమోదయ్యాయి. మార్కెట్లో టోకుగా ఖరీదు చేసిన చిల్లర వ్యాపారులు బయట కిలో రూ.40 వరకు విక్రయించారు. -
రైతు పంట పండింది
తమలపాకులు పచ్చగా ఉండి... వక్క, సున్నంతో కలిపి నోరెలా ఎర్రగా పండిస్తుందో.. ఇప్పుడు తోటలోనూ బాగా పండి.. రైతు ఇంట పచ్చ‘ధనం’ కురిపిస్తోంది. వర్షాలకు కోస్తాంధ్రలో పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో ఆకులకు కొరత ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా ధర చుక్కలనంటింది. ఇంకేముంది రైతు పంట పండింది. ఒక కోత కోసే సరికి కాసుల వర్షం కురుస్తోంది. ‘తంతే తమలపాకు బుట్టలో పడడం’ అంటే ఇదేనేమో. - న్యూస్‌లైన్, చెన్నూరు తమలపాకులు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. మార్కెట్లో ఒక్కసారిగా భారీగా ధరలు పెరగడంతో రైతులకు కాసుల పంట పండిస్తున్నాయి. ‘వేస్తే తమలపాకు తోటలే వేయాలిరా’ అన్నట్లు తమలపాకు ధరలు పలుకుతున్నాయి. అక్కడ కన్నీళ్లు.. ఇక్కడ కాసులు రెండు, మూడు నెలల కిందట వచ్చిన వరుస తుపానుల ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి వేల ఎకరాల్లో ఆకుతోటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో ఇక్కడి తమలపాకులకు భలే గిరాకీ వచ్చింది. వర్షం అక్కడి రైతులకు కన్నీళ్లు మిగిలిస్తే.. ఇక్కడి రైతులకు కాసుల పంట పండిస్తోంది. చుక్కలనంటిన ధరలు.. గత నెల 25వతేదీ వరకు రూ.200 నుంచి 300లు ఉన్న ఆకుల బుట్ట (25 సట్టలు) ఇప్పుడు నాణ్యతను బట్టి రూ.600 నుంచి 900 పలుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తమలపాకుల ఉత్పత్తి భారీగా పడిపోవడం అంతర రాష్ట్రీయంగా డిమాండు పెరగడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. చెన్నై, మహారాష్ట్రలకు ఎగుమతులు రైతులు తమలపాకులను మహారాష్ట్ర, చెన్నై, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు. 70 శాతం మేర మహారాష్ట్రలోని సోలాపూర్, శాంగ్లి, కొల్హాపూర్, బీజాపూర్, బెల్గాం, బార్సి, ముంబాయిలకు తరలిస్తున్నారు. ప్రతిరోజూ ఇక్కడికి వెయ్యి బుట్టలకు పైగా పంపుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న లారీల్లో వీటిని తరలిస్తారు. పెరిగిన ధరలతో బాగా ఉన్న తమలపాకు తోటలకు నెలకు ఒక కోతకే ఎకరానికి రూ.60 వేల నుంచి లక్ష వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్లను నివారిస్తే పూర్వ వైభవం ఒకప్పుడు చెన్నూరు అంటేనే తమలపాకు తోటలు గుర్తొస్తాయి. అంత ప్రసిద్ధి చెందిన చెన్నూరులో రానురానూ ఆకుతోటల సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. సుమారు 3 వేల ఎకరాల్లో ఉండే సాగు ప్రస్తుతం 500 ఎకరాలకు పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తోటలకు బూజు తెగుళ్లు ఆశించడం.. ధరలు లేకపోవడం.. దీనికితోడు అధికారులు తెగుళ్ల నివారణకు సరైన చర్యలు సూచించకపోవడంతో పాటు ఈ పంటకు బీమా సౌకర్యం లేనందున రైతులు వీటి సాగుపై ఆసక్తి తగ్గించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టడంతోపాటు బీమా సౌకర్యం కలిపిస్తే చెన్నూరులో తమలపాకుతోటలకు పూర్వవైభవం వస్తుందని రైతులు చెబుతున్నారు.