జూలో జంబలకిడిపంబ
♦ మీరాలం చెరువు కలుషిత నీళ్లు తాగడంతో హార్మోన్లలో అసమతుల్యం
♦ తగ్గుతున్న పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్.. పెరుగుతున్న ఈస్ట్రోజన్
♦ నెహ్రూ జూపార్క్‌లో గణనీయంగా పడిపోతున్న జంతు సంతానం
♦ ఏటా 50కిపైగా జంతువులు జన్మించాలి.. కానీ కొన్నేళ్లుగా 20కి కూడా మించని వైనం
ఏం జరుగుతోంది?
నెహ్రూ జూలాజికల్ పార్కు.. రాజసం ఒలికిస్తూ ఓ మగపులి.. చూపుల్లో గాంభీర్యం.. వణుకుపుట్టించే గాండ్రింపు... కానీ ‘ఆ విషయం’లో మాత్రం ఢీలా పడిపోతోంది. చురుకుదనం లోపించి బిత్తరచూపులు చూస్తోంది! ఏంటా అని ఆరా తీస్తే.. ఆ పులిలో పురుష హార్మోన్ (టెస్టోస్టిరాన్) చతికిలపడి స్త్రీ హార్మోన్ (ఈస్ట్రోజన్) స్థాయిలు పెరుగుతున్నట్టు తేలింది. ఇది ఒక్క పులిదే కాదు.. జూలోని అన్ని జంతువులదీ ఇదే పరిస్థితి!!
కారణం
జూ పక్కనే ఉన్న మీరాలం చెరువులోని కలుషిత జలాలు ఇలా జంతువుల పునరుత్పత్తి సామర్థ్యంపై దెబ్బకొడుతున్నాయి. ఫలితంగా గత ఏడేళ్లుగా జూలో పురుడు పోసుకుంటున్న జంతువుల సంఖ్య క్రమంగా పడిపోతోంది.
పరిష్కారం
జలాశయంలో ఏరియేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నీటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి
మగ జంతువుల్లో ‘కౌంట్’డౌన్..తగ్గిపోతున్న పునరుత్పత్తి సామర్థ్యం
ఈస్ట్రోజన్ అనేది మహిళల్లోని ప్రధాన సెక్స్ హార్మోన్లలో కీలకమైనది. స్త్రీలలో ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. ఆడ, మగ ఇద్దరిలోనూ ఈ హార్మోన్ ఉంటుంది. అయితే పురుషుల్లో చాలా పరిమితంగా ఉంటుంది. పురుషుల్లో ప్రధానమైన భూమిక పోషించే సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్. పురుషుల్లో ఇది ఈస్ట్రోజన్ కంటే ఎక్కువగా ఉంటుంది. జంతువుల్లోనూ ఇంతే. జూలోని మగ జంతువుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గి, ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడంతో వాటి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది.
సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు.. రాజసం ఒలికిస్తూ ఓ మగపులి.. చూపుల్లో గాంభీర్యం.. నడకలో ఠీవీ.. వణుకుపుట్టించే గాండ్రింపు... అన్నీ బాగానే ఉన్నాయి! కానీ ‘ఆ విషయం’లో మాత్రం ఢీలా పడిపోతోంది. చురుకుదనం లోపించి బిత్తరచూపులు చూస్తోంది! ఏంటా అని ఆరా తీస్తే.. ఆ పులిలో పురుష హార్మోన్ (టెస్టోస్టిరాన్) చతికిలపడి స్త్రీ హార్మోన్ (ఈస్ట్రోజన్) స్థాయిలు పెరుగుతున్నట్టు తేలింది. దీంతో ఆ పులిలో వీర్యకణాల సంఖ్య తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం పడిపోతోంది. ఇది ఒక్క పులిదే కాదు.. జూలోని అన్ని జంతువులదీ ఇదే పరిస్థితి!! జంబలకిడిపంబ సినిమా చూశారుగా.. మగవాళ్లలో ఆడలక్షణాలు రావడం.. ఇక్కడ అదే సీన్ రిపీట్ అవుతోందన్నమాట. దీనికి కారణం.. జూ పక్కనే ఉన్న మీరాలం చెరువులోని కలుషిత జలాలు.. అవి జంతువుల పునరుత్పత్తి సామర్థ్యంపై దెబ్బకొడుతున్నాయి. ఫలితంగా గత ఏడేళ్లుగా జూలో జన్మిస్తున్న జంతువుల సంఖ్య క్రమంగా పడిపోతోంది. సాధారణంగా ఏటా జూలో పుట్టే వన్యమృగాల సంఖ్య 50కి పైగానే ఉండాలి. కానీ గత కొన్నేళ్లుగా ఈ సంఖ్య 20కి కూడా మించడం లేదు.
ఆ నీటితో ‘కౌంట్’ తగ్గుతోంది..
సుమారు 381 సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన జూపార్క్‌లో 158 జంతు జాతులకు చెందిన సుమారు 1,500 జంతువులు, 25 అరుదైన వన్యప్రాణులు, పక్షులు, పాములు ఉన్నాయి. ఈ జూపార్క్‌ను ఆనుకొనే మీరాలం చెరువు ఉంది. ఈ చెరువులోని నీరు.. జూపార్క్‌లోని జంతువుల ఎన్‌క్లోజర్స్‌లో ఉన్న చిన్నచిన్న గోతుల్లోకి చేరుతుంది. వన్యప్రాణులు తరచూ ఈ నీటిని తాగుతున్నాయి. సాధారణంగా జంతువులకు ఆహారం అందించే సమయంలో రోజుకు రెండుసార్లు జూ అధికారులు వాటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తారు. కానీ జంతువులు తమ ఎన్‌క్లోజర్స్‌లో సంచరిస్తున్న సమయంలో చిన్న గోతుల్లో నిల్వ ఉన్న నీటిని తాగుతున్నాయి. మీరాలం చెరువు నుంచి వచ్చి చేరుతున్న ఈ గోతుల్లోని నీటిలో భారలోహాలు అధికంగా ఉంటున్నాయి. ఆ నీరు ఆమ్ల లక్షణాలను కలిగి ఉందని, నీటిలో ఈస్ట్రోజన్ స్థాయిలు ప్రతి లీటరుకు 370 నానో గ్రాములు న్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల బృందం పరిశీలనలో తేలింది.
నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈస్ట్రోజన్ మోతాదు లీటరుకు ఒక నానోగ్రామ్ మించరాదు. స్థానికులు చెత్తా చెదా రం, వ్యవసాయ, పారిశ్రామిక, వ్యర్థ జలాలు, రసాయనాలు మీరాలం చెరువులో కలుస్తుం డడంతో నీళ్లన్నీ కలుషితం అవుతున్నాయి. దీంతో మగ జంతువుల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు అనూహ్యంగా పెరిగి వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్లు ఇటీవలి పరిశోధనలో తేలింది. దీంతో అవి వంధ్యత్వం బారిన పడుతు న్నాయి. అంతేకాదు నీటి కాలుష్యంతో జంతు వుల మూత్రపిండాలు దెబ్బతిని ఆరోగ్యంపైనా దుష్ప్రభావం పడుతుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. జూలో తరచూ నెలలు నిండక ముందే జంతువులు ప్రసవించడం, గర్భస్రా వాలు జరుగుతున్నాయని వారు పేర్కొంటు న్నారు. జూలో 2016 మే నెలలో 3, డిసెంబర్ లో 2 జంతువులు మృత్యువాతపడ్డాయి.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
జూపార్కులోకి ప్రవహిస్తున్న మీరాలం చెరువు నీటితో జం తువులు అనారోగ్యం పాలు కాకుండా చర్యలు తీసుకుం టున్నాం. జంతువుల్లో రోగ నిరోధకశక్తి, పునరుత్పత్తి సామర్థ్యం పెంపొందించేందుకు మినరల్స్, విటమిన్స్, బలవర్ధకమైన ఆహారం, మందులను అందిస్తున్నాం.
– శివానీ డోగ్రా, జూపార్కు క్యూరేటర్
పరిష్కారం ఏంటి?
♦ సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించిన మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలి
♦ జలాశయాల్లోకి కలుషిత జలాలు చేరకుండా కట్టడి చేయాలి
♦ కలుషిత జలాలు మీరాలం చెరువులోకి చేరకుండా మురుగు శుద్ధి కేంద్రం (ఎస్టీపీ)నిర్మించాలి. శుద్ధిచేసిన నీటిని సమీపంలో గార్డెనింగ్ అవసరాలకు మాత్రమే వాడాలి
♦ జలాశయంలో ఏరియేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నీటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి
♦ జంతువుల మనుగడ, వాటిపై పడుతున్న దుష్ప్రభావంపై సమగ్ర అధ్యయనం జరపాలి
♦ మీరాలం చెరువుకు సహజ సిద్ధంగా ఉన్న తూములు, నాలాలను కబ్జా చెర నుంచి విముక్తి కల్పించాలి. వరద ప్రవాహం సాఫీగా వెళ్లే ఏర్పాట్లు చేయాలి
♦ కలుషిత జలాలు జంతువుల ఎన్‌క్లోజర్స్‌లో ఏర్పాటు చేసిన గుంతల్లోకి చేరకుండా జూపార్క్ ప్రహరీ గోడ ఎత్తు పెంచాలి.