breaking news
Himachal Pradesh chief minister virbhadra singh
-
'నాపై బీజేపీ కుట్ర, యుద్ధం మొదలైంది'
హమీపూర్: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ...భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను అరెస్ట్ చేయించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. అక్రమాస్తులకు సంబంధించి తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వీరభద్రసింగ్ పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు నిన్న తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కేసు విచారణను తాము అడ్డుకోలేమని, కేసును రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వీరభద్రసింగ్ స్పందిస్తూ...సత్యం అనేది ఎప్పటికైనా గెలుపు సాధిస్తుందని వీరభద్రసింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ధ్వజమత్తారు. తనపై బీజేపీ చేస్తున్న అవినీతి ఆరోపణలన్నీ అవాస్తవాలని, రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై రెండేళ్లుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, సీబీఐ దర్యాప్తు చేసి తనకు క్లీన్ చిట్ కూడా ఇచ్చిందన్నారు. తాను ఎలాంటి నేరపూరిత అంశం కనిపించలేదని తేల్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ తనపై రెండోసారి సీబీఐ దర్యాప్తు చేపట్టారన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని, యుద్ధం ఇప్పుడే మొదలైందని వీరభద్రసింగ్ అన్నారు. బీజేపీ నేతలు ప్రేమ్ కుమార్ దుమాల్, అనురాగ్ ఠాకూర్ కుట్రపన్ని తనని ఇరికించడానికి స్కెచ్ గీశారన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కాగా వీరభద్రసింగ్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రద్దు చేసిన ప్రాజెక్టును తిరిగి ఏర్పాటుచేసేందుకు వెంచర్ ఎనర్జీ అనే ప్రైవేటు జల విద్యుదుత్పత్తి సంస్థ నుంచి రూ. 6.61 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలతో ఆయనపై 2015 సెప్టెంబర్ 23న అక్రమాస్తుల కేసు నమోదైంది. వీరభద్రసింగ్తో పాటు ఆయన భార్యపై కూడా ఛార్జ్ షీట్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. డాక్యుమెంట్ల స్కూృటినీ పూర్తి కానందున ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది. -
రెండోరోజు సీబీఐ విచారణకు హిమాచల్ సీఎం
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విచారణ నిమిత్తం రెండోరోజు కూడా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో ఆయనను నిన్న కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాగా సీబీఐ విచారణ నిమిత్తం వీరభద్రసింగ్ బుధవారం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. గురువారం ఆయనను సీబీఐ అధికారులు సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 2009-2012 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడంపై సిబిఐ ఆయనను ప్రశ్నించింది. తన పేరుతోపాటు భార్యాబిడ్డలపై ఆయన 6.03 కోట్లు అక్రమంగా కూడబెట్టారు. దీనికి సంబంధించి వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, ఎల్ఐసీ ఏజెంట్ ఆనంద్ చౌహాన్, చున్నీలాల్ చౌహాన్లపై గత ఏడాది కేసు నమోదైంది. కాగా తన భార్య, పిల్లలు పేరు మీద ఆస్తులు ఎలా సంపాదించానో తెలియదని సీబీఐ విచారణలో ఆయన చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా వీరభద్రసింగ్తో పాటు ఆయన అనుచరులు, కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేసింది.