breaking news
help by kindness
-
పేదింటికి పెద్ద కష్టం !
అనంతపురం కల్చరల్ /రాప్తాడు: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త కళ్ల ముందే మరణించడంతో ఓ మహిళ కన్నీరు మున్నీరైంది. ఆ బాధ నుంచి తేరుకోకముందే కన్న కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. చిన్న వయసులోనే కట్టుకున్న భర్త మంచం పట్టడంతో భార్య ... తన తండ్రికి ఏమైందో తెలీక ఓ మూడేళ్ల బాలుడు.. ఇలా ఓ కుటుంబాన్ని కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గుత్తి మండలం రజాపురానికి చెందిన ఆదిలక్ష్మమ్మ భర్త మార్కెట్‌యార్డులో పనిచేస్తుండేవాడు. ఆయన చనిపోవడంతో కుమారుడు కృష్ణమూర్తి, కోడలు ఆదెమ్మతో కలసి అనంతపురంలోని చిన్మయనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. ఆదిలక్ష్మమ్మ పెన్షన్‌తో ఆ కుటుంబం జీవనం సాగించేది. అయితే ఆదిలక్ష్మమ్మ 2021 ఫిబ్రవరిలో మరణించడంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరం అక్టోబరులో ఆదెమ్మ కుమారుడు సాకే శ్రీకాంత్ (32)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. కుమారుడికి వచ్చిన జబ్బును చూసి కుంగిపోయిన ఆదెమ్మ భర్త కృష్ణమూర్తి కూడా నవంబరు 1న చనిపోవడంతో ఇక ఆ ఇల్లు దిక్కులేనిదైంది. వారంలో ఐదుసార్లు డయాలసిస్ చేస్తేకానీ శ్రీకాంత్ బతికే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి ఆదెమ్మ , భార్య మల్లిక కన్నీరుమున్నీరవుతున్నారు. కష్టాల్లో శ్రీకాంత్ కుటుంబం బీటెక్ పూర్తి చేసిన సాకే శ్రీకాంత్ ఆరు నెలల కిందట వరకు హుషారుగానే ఉండేవాడు. హైదరాబాద్‌లో అనే సంస్థల్లోనూ పనిచేశాడు. 2018లో వజ్రకరూరు మండలం, కొనకొండ్లకు చెందిన మల్లికతో వివాహం జరగడంతో విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లిలో హార్డ్‌వేర్ ఇంజనీరుగా చేరాడు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే విధి వారిని చిన్నచూపు చూసింది. గత సంవత్సరం అక్టోబరు నెలలో అనారోగ్యంగా ఉందని హాస్పిటల్‌కు వెళితే శ్రీకాంత్ రెండు కిడ్నీలు పాడయ్యాయని తేలింది. దీంతో అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరిగేందుకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశారు. ఆఖరికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు మాత్రం ఆపరేషన్‌తో సమస్య తీరుతుందని దానికి రూ.40 లక్షలు అవసరమవుతాయని తేల్చి చెప్పారు. బిడ్డను బతికించండయ్యా... రెండు కిడ్నీలు పాడైపోయి నా బిడ్డ పడుతున్న బాధ చూడలేకపోతున్నా. ఉన్న డబ్బంతా ఆస్పత్రులకే ఖర్చు పెట్టా. మా ఇంటి భారాన్ని కూతురు, అల్లుడు మోస్తున్నారు. బిడ్డ బతకాలంతే రూ.40 లక్షలు అవసరమంట. దయగల మారాజులు చేతనైంత సాయం చేసి నా కొడుకును బతికించండయ్యా.. – ఆదెమ్మ , సాకే శ్రీకాంత్ తల్లి దాతలు సాయం చేయదలిస్తే... సాకే శ్రీకాంత్ సెల్ నంబర్ – 7658971971 ఎస్బీఐ , జేఎన్టీయూ బ్రాంచ్ అకౌంట్ నం: 30453144331 ఐఎఫ్ఎస్సీ కోడ్ – ఎస్బీఐఎన్ 0021008 గూగుల్‌పే /ఫోన్‌పే నం – 7658971971 -
ఒమన్ లో మహిళ మృతి
తాడేపల్లిగూడెం : పొట్టచేత పట్టుకుని ఒమన్ దేశానికి ఉపాధి కోసం వెళ్లిన ఓ మహిళ అక్కడ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. భారత దౌత్య కార్యాలయంలో సంప్రదింపులు జరిపి తాడేపల్లిగూడెంలోని కైండ్‌నెస్ సంస్థ ఆమె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన కోయ జ్యోతి (46) జీవనోపాధికోసం ఒమన్ దేశం వెళ్లారు. ఆమె ఇటీవల మరణించడంతో మృతదేహాన్ని జిల్లాకు రప్పించాల్సిందిగా ఆమె కుమార్తె వర్ధనపు ఈశ్వరి కైండ్‌నెస్ సంస్థ ప్రవాసాంధ్రుల సేవాకేంద్రం అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును సంప్రదించింది. భారతరాయబార కార్యాలయంతో గట్టిం మాట్లాడి.. ఒమన్ నుంచి హైదరాబాద్‌కు జ్యోతి మృతదేహాన్ని రప్పించారు. అక్కడి నుంచి అంబులెన్సులో భౌతికకాయాన్ని ఆమె స్వగ్రామానికి ఉచితంగా చేర్చారు. శుక్రవారం మృతదేహం స్వగ్రామం చేరింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు మాణిక్యాలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని వినతులు : అలాగే జిల్లాలోని నర్సాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల ఏసురత్నం రెండేళ్ల క్రితం సౌదీఅరేబియా వెళ్లారు. గతనెల 24న గుండెపోటు రావడంతో అక్కడే చనిపోయారు. ఆయన పార్దీవదేహాన్ని తీసుకురావాలని కోరుతూ శుక్రవారం ఆయన కుమారుడు రాజశేఖర్ మాణిక్యాలరావుకు వినతిపత్రం సమర్పించారు. అలాగే మొగల్తూరు మండలం సిరిపాలెం గ్రామానికి చెందిన భూసి శిరోమణి మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. అనుకోని పరిస్థితులలో అక్కడ మరణించింది. ఆమె మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని ఆమె బంధువులు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి సాయం చేస్తానని మాణిక్యాలరావు చెప్పారు.